Who is Kulman Ghising: ఇంతకీ ఎవరీ కుల్మన్ ఘీసింగ్..
ABN, Publish Date - Sep 11 , 2025 | 05:33 PM
నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో కుల్మన్ ఘీసింగ్ ఉన్నారు. ఆయన పట్ల ఓలీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా ప్రజాగ్రహానికి ఒక కారణమని తెలుస్తోంది.
ఖాట్మాండూ, సెప్టెంబర్ 11: యువత నిరసనల కారణంగా నేపాల్ అట్టుడికిపోయింది. దీంతో సైన్యం రంగంలోకి దిగి తక్షణ చర్యలు చేపట్టింది. యువత నిరసనలు, దాడుల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీతోపాటు మంత్రులంతా తమ తమ పదవులకు రాజీనామా చేశారు. మరో వైపు కర్ఫ్యూ విధించడంతో.. శాంతి భద్రతలు ఇప్పుడిప్పుడే కదుటపడుతున్నాయి. అయితే దేశ తాత్కాలిక ప్రధానిగా మాజీ సుప్రీంకోర్టు చీఫ్ సుశీల కర్కా పేరును జెన్ జెడ్ ఇప్పటికే ప్రతిపాదించినట్లు వార్త కథనాలు వెల్లడిస్తున్నాయి.
అలాంటి వేళ.. కుల్మన్ ఘీసింగ్ పేరు సైతం జెన్ జెడ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఇంతకీ కుల్మన్ ఘీసింగ్ ఎవరంటూ చర్చ సాగుతోంది. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ఈ పేర్లను జెన్ జెడ్ ప్రతిపాదించాయి. ఇక ఖాట్మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు సైతం తాత్కాలిక ప్రధాని రేసులో ఉన్నట్లు సమాచారం.
ఇంతకీ కుల్మన్ ఘీసింగ్ ఎవరు..
నేపాల్ విద్యుత్ అథారిటీకి చీఫ్‌గా గతంలో ఆయన విధులు నిర్వహించారు. అయితే గతంలో నేపాల్‌లో నిత్యం విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. అది కూడా ఎంతగా అంటే.. రోజుకు 18 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా నిలిచిపోయేది.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే వారు. అలాంటి సమయంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన ఘీసింగ్.. నేపాల్ విద్యుత్ అథారిటీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత విద్యుత్ కోతలనేది లేకుండా చేయడంలో ఆయన నూటికి నూరు శాతం సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో ఘీసింగ్ సేవలను దేశ ప్రజలు ప్రశంసించారు.
భారత్‌లో ఉన్నత విద్య..
భారత్‌లోని జంషెడ్‌పూర్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రిల్ ఇంజనీరింగ్‌లో ఆయన పట్టా అందుకున్నారు. అనంతరం నేపాల్‌లోని త్రిభువన్ విశ్వ విద్యాలయం పుల్ చౌక్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని ఘీసింగ్ పొందారు.
ఇక 1994లో నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో ఆయన చేరారు. అనంతరం ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆ క్రమంలో 2016లో ఆ అథారిటీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. విద్యుత్ కోతలను నివారించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2021లో ఈ అథారిటీకి చీఫ్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఘీసింగ్‌పై వేటు వేసిన ఓలీ ప్రభుత్వం
దేశంలో విద్యుత్ కోతలను నివారించడంలో కీలకంగా వ్యవహరించిన ఘీసింగ్‌ను ఓలీ ప్రభుత్వం.. ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన రిటైర్‌మెంట్‌కు కేవలం నాలుగు నెలల ముందు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతలను హితేంద్ర దేవ్ శాక్యకు ఓలీ ప్రభుత్వం కట్టబెట్టింది.
ఓలీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతోపాటు పౌర సమాజం మండిపడింది. నేపాల్‌లో విద్యుత్ సంక్షోభాన్ని నివారించడంలో ఘీసింగ్ సేవలను కొనియాడింది. దేశ సేవలో నిమగ్నమైన ఘీసింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించడం పట్ల తన నిరసనలను సైతం తెలియజేసింది. ఆయన పని తీరును పట్టించుకోకుండా.. రాజకీయ కారణాల వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి, అక్రమాలు, బంధు ప్రీతితోపాటు ఘీసింగ్‌ను పదవి నుంచి తప్పించడం కూడా ఓలీ ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి కారణాలుగా దేశ ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో ఘీసింగ్ పేరును సైతం జెన్ జెడ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మరోసారి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
పెండింగ్ బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం.. తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 11 , 2025 | 05:46 PM