Supreme Court On Pending Bills: పెండింగ్ బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం.. తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:42 PM
పెండింగ్ బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణీత సమయం లోపు ఆమోదం తెలపాలనే అంశంపై సుప్రీంకోర్టులో 10 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపింది. అందుకు సంబంధించిన తీర్పును గురువారం రిజర్వ్ చేసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: పెండింగ్ బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణీత సమయం లోపు ఆమోదం తెలపాలంటూ జరిగిన విచారణపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ చేసింది. ఈ అంశంపై దాదాపు 10 రోజులపాటు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం ఈ కేసులో తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రపతి కానీ, గవర్నర్లు కానీ బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెడితే.. ఆటోమెటిక్‌గా మూడు నెలల తర్వాత అవి ఆమోదం పొందినట్లేనంటూ గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఈ తీర్పులోని అంశాలపై ఉన్నత న్యాయస్థానం రిఫరెన్స్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన విషయం విదితమే. అయితే గతంలో తమిళనాడు కేసులో గవర్నర్లు నిరవధికంగా బిల్లులను పెండింగ్‌లో ఉంచే అధికారం లేదని.. నిర్దిష్ట సమయంలోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇక ప్రస్తుతం ఈ తీర్పు ప్రకారం.. కోర్టు నిజంగా అలాంటి టైమ్ లైన్‌లు విధించే అధికారాన్ని కలిగి ఉందా?, గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయా? అనే అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వాదనల సందర్భంగా కేంద్రం తరఫు న్యాయవాది.. ఇలాంటి సమయ పరిమితులు విధించడం రాజ్యాంగ సమతుల్యతను దెబ్బ తీయవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట వాదించారు.
అలాగే తమిళనాడు, కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాలు మాత్రం ప్రజాస్వామ్య దేశంలో బాధ్యతగా గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయాలకు సమయం అవసరమని స్పష్టం చేశాయి. అయితే ఈ తుది తీర్పులో మాత్రం సుప్రీంకోర్టు.. గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. ఈ తరహ బిల్లులు నిలిపివేతపై భవిష్యత్తులో అనుసరించాల్సిన మార్గదర్శకాలపైనా స్పష్టతనిచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఈ అంశం దేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అలాంటి వేళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంపై ఎలాంటి తీర్పు వెలువరించనుందనే అంశంపై ఇండి కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయనే చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
For More National News and Telugu News