Share News

MP Kalisetti On Jagan: జడ్పీటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?

ABN , Publish Date - Sep 11 , 2025 | 02:52 PM

వైసీపీ అధినేత జగన్‌పై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అంటే అబద్ధాల పుట్ట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు.

MP Kalisetti On Jagan: జడ్పీటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
MP Kalisetti Appalanaidu And Jagan

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చెప్పిన మాటలన్నీ అబద్ధాల మూటలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జగన్ అంటే అబద్ధాల పుట్ట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలను జనాలు చూసి అహా అనడం కాదు.. మా కర్మరా బాబు అంటున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. జగన్ రెడ్డిలా అబద్ధాలు చెప్పే వారు ప్రపంచంలోనే ఉండరని ఎంపీ వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో కొవిడ్ వస్తే రాష్ట్రంలో వైద్య సేవలు సరిగా లేవని వైసీపీ మంత్రులు పక్క రాష్ట్రాలకు పరుగులు తీశారని ఎద్దేవా చేశారు.


85 శాతం హామీలను ఎగొట్టి..

ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 27 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని అన్నారు. వైద్యం అంటే మానవ సేవ.. అలాంటి సేవలోనూ జగన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఎంపీ ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న నిజామ్స్, తిరుపతిలోని బర్డ్స్, తిరుపతి మహిళా మెడికల్ కాలేజీ, మంగళగిరి ఎయిమ్స్ ఇలా అనేకం నిర్మించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి తన హయాంలో 85 శాతం హామీలను ఎగొట్టి.. నేడు కూటమి ప్రభుత్వం 15 నెలల సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


నాయకుడి లక్షణమంటే ఇది..

ఉచిత బస్సు పథకం ద్వారా 5 కోట్ల మంది ఇప్పటివరకూ ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు ఎంపీ కలిశెట్టి. రూ.200 కోట్లు ఆదా చేశారన్నారు. జగన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసి రాష్ట్ర ప్రజలు ఛీ కొడుతున్నారని కామెంట్స్ చేశారు. ఐదేళ్ల పాలనలో పారిశ్రామిక వేత్తలను బెదిరించి, భయపెట్టడమే తప్ప పరిశ్రమలను జగన్ తీసుకొచ్చింది లేదని మండిపడ్డారు. మరో 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంటుందని జోస్యం చెప్పారు. నేపాల్‌లో తెలుగు వారు చిక్కుకుంటే అనంతపురం సభకు కూడా రాకుండా మంత్రి నారా లోకేశ్ వారిని తీసుకొచ్చేందుకు శ్రమించారని.. అది నాయకుడి లక్షణమని ప్రశంసించారు.


గంటన్నర.. అన్నీ అబద్ధాలు, మోసాలే..

దేశంలో ఉన్న ప్రతి నాయకుడు సీఎం చంద్రబాబు విజన్‌ను చూసి మెచ్చుకుంటున్నారని మాట్లాడారు. ఆయన గురించి అబద్ధాలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్న జగన్ రెడ్డి వెళ్లి నూతిలో దూకాలన్నారు. గంటన్నర ప్రెస్ మీట్‌లో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలు, మోసాలేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికీ నేడు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలను స్వాగతించాల్సింది పోయి విమర్శించడమే పనిగా జగన్ రెడ్డి పెట్టుకున్నాడని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి జేజేలు కొడుతున్నారని.. అనంతపురం సభను ప్రజలు సూపర్ హిట్ చేశారని పేర్కొన్నారు.


2029పై కలలెందుకు?

ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఇబ్బందుల్లో ఉన్నా అండగా ఉండేది సీఎం చంద్రబాబు ఒక్కరేనని కొనియాడారు. కియా మోటర్స్ ద్వారా రాయలసీమలో వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని, అలాంటి పరిశ్రమను జగన్ తన హయాంలో ఇబ్బందులకు గురిచేశాడని దుయ్యబట్టారు. 'ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రాన్ని లూటీ చేశావ్.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిల్లోనే నీకు దిక్కు లేదు.. రాబోయే 2029 గురించి ఎందుకు కలలు కంటున్నావని' జగన్‌పై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి

భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 11 , 2025 | 04:55 PM