Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం..
ABN, Publish Date - Sep 21 , 2025 | 08:31 AM
లోకకల్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి సాక్షాత్తు బ్రహ్మ దేవుడే ఉత్సవాలను నిర్వహించాడట. బ్రహ్మ స్వయంగా నిర్వహించిన ఉత్సవాలు కావటంతోనే ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు పొందాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
లోకకల్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి సాక్షాత్తు బ్రహ్మ దేవుడే ఉత్సవాలను నిర్వహించాడట. బ్రహ్మ స్వయంగా నిర్వహించిన ఉత్సవాలు కావటంతోనే ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు పొందాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా వివిధ వాహనాలపై గోవిందుడు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్త కోటిని కటాక్షిస్తాడు. ఏడాదిలో 365రోజుల్లో దాదాపు 450కిపైగా ఉత్సవాలు జరిగినప్పటికీ ఏడాదిలో తొమ్మిది రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాలే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.
వైకుంఠపురాన్ని విడిచిపెట్టి తన భక్తులను కటాక్షించేందుకే భూలోక వైకుంఠానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువే శ్రీవేంకటేశ్వరునిగా అవతరిం చారని పురాణోక్తి. ఆపదమొక్కులవాడిగా, కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడిగా సప్త గిరులపై కొలువుదీరిన దేవదేవడు శ్రీవేంకటే శ్వరుడు. తిరుమల శ్రీవారి ఆలయం కేవలం పూజలకే కాకుండా వైభవోపేతమైన ఉత్సవా లకూ ప్రసిద్ధి చెందింది. భక్తి, శ్రద్ధ, ఆనందం, ఉత్సాహం ఈ నాలుగు కలిసినప్పుడు సృష్టిలో పుట్టేది ఉత్సవం. అలాంటి ఉత్సవాల్లో అగ్రగణ్యమైనది తిరుమలేశుని బ్రహ్మోత్సవం.
రాజులు విజయపరంపరకు కృతజ్ఞతగా...
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడవఏటా అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం)లో ఒక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రుల్లో (ఆశ్వ యుజం)లో మరొక బ్రహ్మోత్సవం నిర్వ హిస్తారు. భాద్రపదంలో అంటే కన్యామాసంలో నిర్వహించే ఉత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలు అని, నవరాత్రుల్లో నిర్వహించే ఉత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలని పిలు స్తారు. అధికమాసం రాని ఏడాదిలో అయితే కన్యామాసం, నవరాత్రులు కలిసే వస్తాయి కాబట్టి ఒక బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ పదిరోజుల బ్రహ్మోత్సవాలను కాలానుగుణంగా ఎందరో రాజులు, రారాజులు తమ విజయపరంపరలకు కృతజ్ఞతగా శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిం చేవారట. ఇలా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు నెలకొకటి చొప్పున ప్రతీ ఏడాది పన్నెండు బ్రహ్మోత్సవాలు కూడా జరిగేవని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కాలక్రమేణా మార్పులు జరిగి, ఏడాదికి ఓసారి పది నుంచి పన్నెండురోజులు పాటు జరగటం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కూడా కొన్ని పరిణామాలతో రోజుల సంఖ్య తగ్గి నేటికి తొమ్మిది రోజులకు చేరింది.
1,059 ఏళ్లుగా ...
తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు వెయ్యేళ్లకుపై గానే జరుగుతున్నట్టు వివిధ పురాణాలు, గ్రంథాల ద్వారా తెలుస్తోంది. శాసనాల ద్వారా పరిశీలిస్తే.. పల్లవరాణి సామవై క్రీ.శ 966లో శ్రీవారికి తొలిగా వెండి భోగశ్రీనివాసమూర్తిని శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా ప్రతిష్టించారు. ఈ క్రతువుతోనే గోవిందుని సన్నిధిలో ఉత్సవ సంబరానికి నాందిగా గ్రంథాలు చెప్పేమాట. అంతకుముందు అవకాశం కుదిరినప్పుడల్లా జరిగే బ్రహ్మోత్సవం ప్రతిష్ట తర్వాత సామవై నిర్ణయించినట్టుగా ఏడాదికి రెండు బ్రహ్మోత్సవాలు (పురటాశి, మార్గశిర మాసాల్లో) జరిగే విధానం మొదలైంది.
- 10వ శతాబ్దం వరకు ఈ రెండు బ్రహ్మోత్స వాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. ఈ పల్లవ రాణినే ఉత్సవమూర్తికి అలంకరించేందుకు అనేక ఆభరణాలు, రథాలు సమకూర్చింది.
- 13-14వ శతాబ్దాల్లో తెలుగు పల్లవ రాజులు ‘ఆడి తిరునాళ్లు’ పేరుతో బ్రహ్మో త్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారు. ఆ తర్వాత మాసి తిరునాళ్లు, తిరుకోడి తిరునాళ్, అచ్యుతరాయ బ్రహ్మోత్సవం వంటి వివిధ పేర్లుతో బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.
- 14వ శతాబ్దం చివరి నాటికి తిరుమలలో మూడు బ్రహ్మోత్సవాలు, తిరుపతిలో మరో రెండు బ్రహ్మోత్సవాలను జరిపేవారు.
- 16వ శతాబ్దం నాటికి వైశాఖం, ఆడి మాసాల మినహా ఏడాదికి 10 బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఈ బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కాకుండా 12 రోజుల పాటు జరిగేవని శాసనాల సారాంశం. మిగిలిన రెండు మాసాల్లో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేవారు.
- ఆ తర్వాతి కాలంలో ఏడాదికి నాలుగు సార్లు అంటే పురటాశి, రథసప్తమి, కార్తీక మాసంలో కైశిక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) సమయాల్లో బ్రహ్మోత్స వాలు జరిగేవి. ఈ తర్వాత కాలానుగుణంగా భక్తుల రద్దీని బట్టి ఏడాదికోసారి బ్రహ్మోత్సవం నిర్వహించే ఆనవాయితీ మొదలై నేటికీ కొనసాగుతోంది. స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం ఎందరో రాజులు, రారాజులు, నవాబులు ఈ ఉత్సవాల నిర్వహణ కోసం తమ గ్రామాలను, భూములను, ఆభరణాలను, బంగారు వస్తువులు, ఆహార పదార్థాలు ఇచ్చి ఉత్సవాలను జరిపించారు. ఆ తర్వాత కూడా ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిష్ అధికారులు, మహంతుల కాలంతో పాటు టీటీడీ ఏర్పడిన 1933 నుంచి కూడా నేటికీ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
అంకురార్పణతో మొదలై..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. 23న సాయంత్రం అంకురార్పణతో మొదలై ధ్వజావరోహణంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతీరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలను నిర్వహిస్తారు. 24న సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంలో ధ్వజ స్తంభంపై ధ్వజపటాన్ని(గరుడపటం) ఎగురవేసి సకల దేవతలను ఆహ్వానించి బ్రహ్మోత్సవం సంబరాన్ని ఆరంభిస్తారు. బ్రహ్మరథ సారథ్యంలో వివిధ వాహనాలపై ఊరేగే శ్రీవారిని కనులారా వీక్షించి తరించడానికి భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తండోప తండాలుగా తరలిరావడం విశేషం.
ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో మొదటిరోజు రాత్రి పెద్దశేషవాహనంపై స్వామివారు ఊరేగుతారు. అనంతరం చిన్నశేష, హంస, సింహ, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఐదోరోజు ఉదయం మోహినీ అవతారంలో మురిపించే మలయప్ప రాత్రి గరుడ వాహనంపై భక్తకోటిని అనుగ్రహిస్తారు. గరుడసేవ బ్రహ్మోత్సవాలలో అత్యంత పవిత్రం, విశిష్టమైనది. ఈ దృష్ట్యా మూలమూర్తి అలంకరించే లక్ష్మీహారం, మకర కంఠి, పచ్చ, సహస్త్రనామావలి వంటి విశేషమైన ఆభరణాలను మలయప్పస్వామికి అలంకరించడం గరుడోత్సవ ప్రత్యేకత. అనంతరం హనుమంత, స్వర్ణరథం, గజ, సూర్యప్రభ, చంద్రపభ వాహనాలలో వెంకన్న మాడవీధులలో ప్రదక్షిణ చేస్తారు. ఎనిమిదవ రోజు ఉదయం జరిగే మహారథోత్సవాన్ని కూడా భక్తులు విశేషమైనదిగానే భావిస్తారు. ఆ రోజు రాత్రి జరిగే అశ్వవాహనంతో వాహన సేవలు పరిసమాప్తమవుతాయి. తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.
వాహనాల విశిష్టత
విష్వక్సేనుల ఊరేగింపు: విష్వక్సేనులవారు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి సర్వసైన్యాధ్యక్షుడు. స్వామివారికి జరిగే ప్రధాన ఉత్సవాల ముందు రోజున అంకురార్పణలో భాగంగా ఈయన మాడవీధులలో ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
అంకురార్పణం: శాస్త్రాల ప్రకారం విత్తనాలను మొలకెత్తించడం అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పంచడంతో పాటు స్వామి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ముఖ్య ఉద్దేశం.
ధ్వజారోహణం: బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించడం ఆనవాయితీ. ఓ నూతన వస్త్రంపై శ్రీవారి వాహనమైన గరుడ బొమ్మను చిత్రీకరిస్తారు. దీన్ని ‘ధ్వజపటం’ అంటారు. కొడితాడు సహాయంతో దీన్ని ధ్వజస్తంభం మీద కట్టి, ఎగరవేస్తారు. ఎగిరే ఈ గరుడపతకమే సకల దేవతలకు ఆహ్వానపత్రిక. ఈ ఆహ్వానాన్ని అందుకుని దేవతలంతా బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు తిరుక్షేత్రంలోనే ఉండి వీక్షిస్తారట.
పెద్దశేష వాహనం: బ్రహ్మోత్సవాలలో మొదటి వాహనం పెద్దశేషవాహనం. స్వామివారికి నివాసభూమిగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా, ఛత్రంగా ఆయా సమయాలలో కామరూపియైు సేవలందిస్తున్న దాసుడుగా ఉంటారని కీర్తించారు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఆ సందేశాన్ని మనకు అందించడానికే శేషాద్రినాథుడు శేషవాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తారు.
చిన్నశేష వాహనం: రెండోరోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శేషవాహనంపై శ్రీవారిని దర్శించి, ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని ఆధీనమై, అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండలినీ సర్పరూపపు శిరస్సు సహస్రారంలో, పుచ్ఛం మూలాధారంలోనూ నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైన సేవకుడవుతాడు. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండిలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుంది.
హంస వాహనం: రెండో రోజు రాత్రి మలయప్పస్వామి వీణాపాణియైు సరస్వతీమూర్తిగా దర్శనమిస్తారు. బ్రహ్మవాహనమైన హంస ప్రసిద్ధం. పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను హంస అని, పరమహంస అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణుడు హంస శబ్ద వాచ్చుడైన సూర్యునిలో నివసిస్తున్నాడు. అందుకే మనం శ్రీమన్నారాయణునికి ప్రతీకైన సూర్యభగవానుని ఆరాధిస్తున్నాం. హంసకు ఒక విశిష్టగుణముంది. పాలు నీరును కలిపి ముందు పెడితే పాలను స్వీకరించి నీరును వదిలివేయగల శక్తి కలిగి ఉంది. వివేకం కలవాడు అనాత్మ అయిన స్థూల సూక్ష్మాది దేహాలు వదలి ఆత్మను పరిగ్రహిస్తాడు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సోహం భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి దాసోహం అనే భావాన్ని కలిగించడానికే శ్రీనివాసుడు హంసవాహనారూఢుడై తిరువీఽధులలో విహరిస్తారు.
సింహవాహనం: మూడో రోజు ఉదయాన మలయప్ప యోగనరసింహ స్వామిరూపంలో సింహ వాహనంపై ఊరేగుతారు. వనరాజు, మృగాలలో రారాజు సింహం. గాంభీర్యానికి, దక్షతకు ప్రతీక సింహం. ధర్మ రక్షణకై స్వామి నృసింహ స్వరూపంలో సింహాన్ని అధిష్టించి రావడం విశేషం. అందులో దుష్టజన శిక్షణ, శిష్టజన రక్షణలో భాగంగా దుర్మార్గుడైన హిరణ్యకశిపుని వధించి, ప్రహ్లాదుని రక్షించడమే ఇందుకు సంకేతం. ఈ వృత్తాంతాన్ని భక్తులకు కనులకు కట్టినట్లుగా చూపించేందుకై సింహ వాహన ఉత్సవం నిర్వహిస్తారు.
ముత్యపుపందిరి వాహనం: మూడో రోజు రాత్రి ఏడుకొండలస్వామి ముత్యపుపందిరి వాహనంతో ప్రత్యక్షమవుతారు. ముక్తికి, సాఽధనకు ముత్యం వంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామి చెబుతారు.
కల్పవృక్ష వాహనం: నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం విశేషముంది. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి మొదలయినవి కోరిన కోరికలను ప్రసాదిస్తాయని నమ్మకం. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా చేసుకుని మథనం చేయగా ఆ సమయంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో ఈ కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరినవారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. తనను శరణుజొచ్చిన భక్తుల కోరికలను స్వామి నెరవేరుస్తారని చెప్పడానికే కల్పవృక్ష వాహనంపై ఊరేగుతారు.
సర్వభూపాల వాహనం: పూర్తిగా బంగారురేకులతో నిర్మించిన వాహనం సర్వభూపాలవాహనంలో నాలుగో రోజు రాత్రి విహరిస్తారు స్వామివారు. లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని ఈ వాహనం ద్వారా తెలియజేస్తారు. ఈ వాహనసేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది.
మోహినీ అవతారం: ఐదో రోజు ఉదయం మలయప్పస్వామి మోహినీ రూపంలో దంతాలపల్లకీలో తిరువీధులలో ఊరేగుతారు. తోడుగా శ్రీకృష్ణస్వామి మరో పల్లకీలో ప్రదక్షిణ చేస్తారు. ఉత్సవమూర్తి మామూలుగా నిలబడే భంగిమలో కాకుండా ఆశీనులైన భంగిమలో కనిపించడం ప్రత్యేకత. స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో స్వామివారికి అలంకరిస్తారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగరం మథించి, అమృతం దక్కగా మాకు మాకని మథనపడే వేళ దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి అతిలోక మోహనమైన కన్యరూపం ధరించి దేవతలకు అమృతప్రదానం చేసిన జగన్మోహ రూపమే మోహినీ అవతారం.
గరుడవాహనం: ఐదో రోజు రాత్రి మలయప్పస్వామి ఊరేగే వాహనం గరుడ వాహనం. మూలవిరాట్టుకున్న మకరకంఠి, సహస్రనామ హారం, లక్ష్మిహారం మొదలైనవాటిని ఉత్సవమూర్తులకు అలంకరించడం ఈ వాహనంలో ప్రత్యేకత. గరుత్మంతుడు నిత్యసూరి, స్వామికి దాసుడు, సఖుడు, వాహనం, పతాకచిహ్నం, గరుత్మంతునికి తెలియని స్వామి రహస్యాల్లేవు. గరుడసేవలో స్వామివారిని దర్శిస్తే సమస్త పాపాల హరించినట్లవుతుందని పౌరాణోక్తి. ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణవచనం. ఏ ఉత్సవానికి రాని భక్తజనం ఈ సేవకు హాజరవుతారు.
హనుమంత వాహనం: ఆరో రోజు ఉదయం స్వామివారు దాస భక్తుడైన హనుమద్వాహనంలో వరదహస్తం దాల్చిన వెంకటాద్రి రాముడిగా ఊరేగుతారు. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాఢ్యం, వక్తృత్వాలు హనుమంతుని స్మరిస్తే పుష్కలంగా లభిస్తాయి. చతుర్వేద నిష్ణాతుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రివాసుని వీపున వహించి తిరువీధులలో దర్శనమిస్తాడు. గురుశిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన కావించిన మహనీయులు కనుక తన భక్తితత్పరతను చాటిన హనుమంతుడి ద్వారా భక్తులు స్ఫూర్తి పొందడానికి వీలుగా మారుతిపై స్వామి ఊరేగుతారు.
స్వర్ణరథం: స్వర్ణరథాన్ని దర్శించడం ద్వారా లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు లభిస్తాయని, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం
గజవాహనం: ఆరో రోజు రాత్రి స్వామివారిని రాజులను పట్టాభిషేకం చేసే సమయంలో గజాధిష్టితులను చేసే విధంగా అలంకరించి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది. గజేంద్ర మోక్షంలో ఏనుగును కాపాడిన విధంగానే శరణు కోరే వారినీ కాపాడతానని చాటి చెప్పడానికి స్వామి ఈ వాహనంపై ఊరేగుతారు.
సూర్యప్రభ వాహనం: సప్తాశ్యాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పుష్పాలతో ఈ వాహనంపై ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి తాను ప్రతిరూపమని చాటి చెబుతారు.
చంద్రప్రభ వాహనం: ఏడో రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభపై ఊరేగుతారు. చంద్రున్ని కూడా శాసించేమూర్తి తానే అని చెప్పడం చంద్రప్రభ వాహనం మరో విశేషార్థం. చంద్రుడు భగవంతుని మారురూపమే. ఔషధాలు లేకపోతే జీవనం లేదు. కనుక ఔషధీశుడైన చంద్రుడు కూడా పోషకుడే. ఈ వాహన ఈ సందర్శనం ఆధ్మాత్మిక, అధిభౌతిక, ఆధిదైవికమనే త్రివిధ తాపాలను నివారిస్తుంది.
మహారథం: గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రఽథికుడైన ఆత్మ ద్వారా అదుపుచేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి రథోత్సవం ద్వారా తెలియజేస్తారు.
అశ్వవాహనం: ఎనిమిదోరోజు రాత్రి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతారు. చతురంగ బలలాలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వంమీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం.
చక్రస్నానం: చివరిదైన ఉత్సవమే చక్రస్నానం. ఎనిమిది రోజుల పాటు వాహనసేవల్లో అలసిపోయిన స్వామి సేదతీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయనాంచారులకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వార్‌ను పుష్కరిణి స్నానం చేయిస్తారు.
ద్వజావరోహణం: చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిదిరోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించింన దేవతామూర్తులకు వీడ్కోలు పలుకుతారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
- జగదీష్ జంగం
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 21 , 2025 | 08:31 AM