Tirumala: తిరుమల గోవిందుడి గుడిలో శ్రీరామకృష్ణులు
ABN, Publish Date - Sep 21 , 2025 | 01:30 PM
తిరుమల అనగానే శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం అని అందరికీ తెలుసు. అయితే తిరుమల ఆలయంలో కలియుగ అవతారమైన శ్రీనివాసుడితో పాటూ త్రేతాయుగంలో ఆరాధ్యుడైన శ్రీరాముడు, ద్వాపర యుగంలో భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల పూజలను స్వీకరిస్తూ అంతే వైభవంగా వేడుకలు అందుకుంటున్నారని చాలామందికి తెలియదు.
తిరుమల: తిరుమల అనగానే శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం అని అందరికీ తెలుసు. అయితే తిరుమల ఆలయంలో కలియుగ అవతారమైన శ్రీనివాసుడితో పాటూ త్రేతాయుగంలో ఆరాధ్యుడైన శ్రీరాముడు, ద్వాపర యుగంలో భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల పూజలను స్వీకరిస్తూ అంతే వైభవంగా వేడుకలు అందుకుంటున్నారని చాలామందికి తెలియదు.
కౌసల్యా..సుప్రజా.. రామా..
‘కౌసల్య సుప్రజారామా’ అంటూనే గోవిందుడిని మేల్కొలుపుతారు. తిరుమల గర్భాలయంలో శ్రీనివాసుడి మూలమూర్తితో పాటు శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇవి వెయ్యేళ్లనాటివి అనేందుకు శాసనాధారాలున్నాయి. ఈ విగ్రహాలు ఒకప్పుడు రాములవారి మేడలో ఉండేవి. మహంతుల కాలంలో గర్భాలయానికి చేరినట్టు చెబుతారు. బంగారువాకిలి నుంచి శ్రీవేంకటేశ్వరుడి గర్భాలయంలోకి వెళ్లే దారిలో స్నపనమండపం దాటగానే ఉండే ప్రదేశాన్ని ‘రాములవారిమేడ’ అంటారు. అక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలంటాయి.
ఆనాటి రాముడే ఈనాటి వేంకటేశ్వరుడని వేంకటాచల మహాత్మ్యం చెబుతుంది. శ్రీనివాసుడి సన్నిధిలో శ్రీరాముడి విగ్రహం కొలువై ఉండడానికి సంబంధించి అనేక ఐతిహ్యాలు ప్రచారంలో ఉన్నాయి.
- అరణ్యవాసం సమయంలో సీతమ్మను వెతుకుతూ శ్రీరామలక్ష్మణులు వేంకటాద్రికి వచ్చారని, అందుకు గుర్తుగానే వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నాయని చెబుతారు.
- రావణ సంహారం తర్వాత సీతాసమేతంగా ఆయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు తిరుమలలోని జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేశారట.
- అలిపిరిలో తన గురువైన తిరుమల నంబి దగ్గర శ్రీమద్రామాయణ రహస్యాలను అధ్యయనం చేస్తున్న భగవద్రామానుజులు దగ్గరకు ఒక విప్రుడు వచ్చి సీతారామలక్ష్మణ విగ్రహాలను అందజేశాడని, వాటిని ఆయన శ్రీవారి ఆలయంలో కొలువుదీర్చారని కూడా అంటారు.
- తిరుమల ఆలయంలో సీతా రామలక్ష్మణ విగ్రహాల ప్రస్తావన మాత్రం క్రీ.శ.1476, 1504 నాటి శాసనాల్లో కనిపిస్తుంది.
- తిరుమలలో ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున శ్రీరామనవమి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహిస్తారు. రంగనాయక మండపంలో సీతాలక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి హనుమంతవాహనమెక్కి శ్రీరాముడు భక్తకోటికి దర్శనమిస్తాడు.
- శ్రీవారి పుష్కరిణిలో జరిగే వార్షిక తెప్పోత్సవాల్లో తొలిరోజు తెప్పపై కొలువుదీరేది శ్రీరాముడే.
- ఛైత్రమాసంలో జరిగే వసంతోత్సవాల్లో మలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామితో పాటు శ్రీరాములవారిని కూడా ఒకే వేదికపై కొలువుదీర్చి స్నపనం నిర్వహిస్తారు.
- బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు హనుమంత వాహనంపై శ్రీవారే కోదండరాముడిగా మాడవీధుల్లో విహరించి దర్శనమిస్తారు.
- శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున శ్రీవారి ఆలయంలో ఆస్థానం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి సమేతంగా తిరుమాడవీధుల్లో ఊరేగుతారు.
వెన్నదొంగకు విశేష సేవలు
శ్రీరాముడి వలెనే శ్రీకృష్ణుడు కూడా తిరుమలలో గోవిందుడితో సమానంగా వైభవం అనుభవిస్తున్నాడు. 11వ శతాబ్దం నుంచే శ్రీకృష్ణుడు తిరుమలలో పూజలందుకుంటున్నట్టు పలు శాసనాల్లో ఉంది. శ్రీవారి ప్రథమ భక్తుల్లో ఒక్కరైన తిరుమలనంబి సుమారు రెండు అడుగుల ఎత్తు కలిగిన తిరువాయిపడి ఆళ్వాన్ అనే వెన్నకృష్ణుడి రజత విగ్రహాన్ని తిరుమల ఆలయంలో ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. 11వ శతాబ్దంలో అవనిములుదు దయ్యార్ అను కులోతుంగచోళరాణి ఈకృష్ణ స్వామికి పూజలు చేసేందుకు పాలు, పెరుగు సమర్పించినట్లు ఒక శాసనంలో పేర్కొన్నారు.
- శ్రీకృష్ణాష్టమి పర్వదినాన శ్రీవారి ఆలయంలో శ్రీకృష్ణస్వామికి అభిషేకం చేస్తారు. మలయప్పస్వామితో పాటు మాడవీధుల్లో ఊరేగిస్తారు.
- ధనుర్మాసంలో 30రోజుల పాటు సన్నిధిలో జరిగే ఏకాంతసేవలో భోగశ్రీనివాసమూర్తికి బదులుగా వెన్నకృష్ణుడే శయనభాగ్యం పొందు తాడు. ఆరోజుల్లో సుప్రభాతానికి బదులుగా బంగారు శయ్యపై పవళించిన చిన్నికృష్ణని గోదాదేవి కీర్తించిన తిరుప్పావై పాశురాలను పఠిస్తూ మేల్కొల్పుతారు.
- బ్రహ్మోత్సవాలలో ఐదోరోజున శ్రీమలయప్పస్వామి మోహినీ అవతారంలో దంతపు పల్లకీలో ఊరేగుతుండగా, ఆ జగన్మోహిని సరసనే మరో పల్లకీపై శ్రీకృష్ణస్వామి ఊరేగుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 21 , 2025 | 01:32 PM