Dhanteras: ధన త్రయోదశికి బంగారం కొనలేకున్నా.. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే..
ABN, Publish Date - Oct 17 , 2025 | 12:00 PM
బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటాయి. వీటిని కొనాలంటే సామాన్యులు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. మరి ధన త్రయోదశి రోజు వీటిని కొనుగోలు చేయకుంటే.. మరికొన్ని వస్తువులు కొనుక్కుంటే అదృష్టం కలిసి వస్తుందంటున్నారు.
Dhanteras 2025: దీపావళి పండగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. తొలి రోజు ధన త్రయోదశి.. ధన్ తేరస్‌గా జరుపుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆ రోజు లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి? ఆ రోజు తప్పకుండా బంగారం, వెండి కొనాల్సిందేనా? కొనలేకుంటే పరిస్థితి ఏమిటి ? అందుకు ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అంటే.. ఉన్నాయని జ్యోతిష్య పండితులు సోదాహరణగా వివరిస్తున్నారు.
త్రయోదశి విశిష్టత..
పంచాంగం ప్రకారం త్రయోదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. త్రయోదశి రోజు.. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ఉండే సమయాన్ని ప్రదోష వేళగా చెబుతారు. ఈ ప్రదేష సమయానికి శివారాధనకు అత్యంత అనుకూలమైందని అంటారు. అలాగే ఈ ధన త్రయోదశి రోజు.. బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడం చాలా కాలంగా ఒక ఆనవాయితీగా మారింది. అయితే అత్యధిక శాతం మంది మాత్రం బంగారం లేదా వెండి కొనడానికే మొగ్గు చూపుతారు.
ఇంతకీ ధన త్రయోదశి..?
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి పండగగా జరుపుకుంటారు. దీనినే ఉత్తర భారతదేశంలో ధన్‌తేరస్‌గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ధన త్రయోదశి పండగ అక్టోబర్ 18వ తేదీ శనివారం జరుపుకొంటారు. ఈ ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని పెద్దలు చెబుతారు.
బంగారం, వెండి కొని తీరాల్సిందేనా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయడం కష్టంగా మారింది. మరి వారు ఏ వస్తువులు కొనుగోలు చేయ్యాలి? అయితే అసలు ఈ రోజు.. బంగారం, వెండి కొనాలనే ఆచారం వెనుకు ఉన్న అర్థం, పరమార్థం ఏమిటి?
ఈ రెండే ఎందుకు కొనాలి?
లక్ష్మీదేవికి ప్రతి రూపాలుగా బంగారం, వెండిని భావిస్తారు. వీటిని ధన త్రయోదశి రోజు కొని ఇంటికి తీసుకురావడం శుభప్రదమని అంటారు. ఈ రోజు వీటిని కొనడం వల్ల లక్ష్మీదేవితోపాటు సంపదలకు అధిపతి కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని హిందూ సంప్రదాయంలో ఒక ప్రగాఢ విశ్వాసం బలంగా ఉంది. అందుకే ఈ రోజు ఎలాగైనా వీటిని కొనుగోలు చేయాలనుకుంటారు. అలాగే ఈ రోజు నుంచి దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. అదృష్టానికి, ఐశ్వర్యానికి ప్రతీక బంగారం. ఈ రోజు వీటిని కొనుగోలు చేయడం ద్వారా దీపావళి వేడుకల్లో తొలి రోజు లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడం సంప్రదాయంగా మారింది.
బంగారం, వెండే కాదు.. ఇవి కూడా..
బంగారంతోపాటు వెండి ధరలు సైతం రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో వీటిని కొనుగోలు చేయడం కష్టంగా మారింది. దాంతో వంటింటి సరుకులు.. ఉప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చ కర్పూరం వంటి వాటిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇటు వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించాయి. దీంతో ఈ రోజు.. వంటింటి సరుకులు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వీటిని కొనుగోలు చేయం ఆరోగ్యమే కాదు అదృష్టం కూడా..
ధన త్రయోదశి రోజు.. కొత్త పాత్రలు కొనడం అనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ధన త్రయోదశి రోజు.. ధన్వంతరి క్షీరసాగర మథనం నుంచి అమృత కలశంతో ఉద్భవించారని భాగవతం చెబుతోంది. అలాగే ఆయనకు ఇత్తడి అత్యంత ఇష్టమైన లోహంగా చెబుతారు. ఈ రోజు ఈ పాత్రలు కొనడం వల్ల కుటుంబంలోని వారి ఆరోగ్యం పెరిగి.. అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. ఈ రోజు కొత్త చీపురు సైతం కొనడం మంచిదంటారు.
వీటితో లక్ష్మీ కటాక్షం..
ధన త్రయోదశి రోజు బంగారం, వెండి కొనలేని వారు.. శ్రీయంత్రం, కుబేర యంత్రం కానీ కొనుగోలు చేయడం శుభప్రదం. ఈ యంత్రాలను ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో ఉంచడం వల్ల లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెబుతారు. అలాగే ఈ రోజు 11 గోమతి చక్రాలు కొని వాటిని ఎర్ర గుడ్డలో చుట్టి ఇంట్లో ఒక చోట ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. అదే విధంగా ఈ రోజు లక్ష్మీ దేవికి ప్రీతికరమైన పసుపు గవ్వలు కొని పూజామందిరంలో ఉంచితే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు.
దీంతో ఈ ధన త్రయోదశి రోజు.. బంగారం, వెండి కొనలేకపోయామని దిగులు పడకుండా ఈ ప్రత్యామ్నాయ వస్తువులు కొని ఇంటికి తీసుకు వెళ్లడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి నుంచి ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం
దీపావళి వేళ.. దీపాలు వెలిగించే ముందు ఈ చిట్కాలు పాటించండి
For More devotional News And Telugu News
Updated Date - Oct 17 , 2025 | 01:00 PM