Telugu States Temples Closed: భక్తులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత
ABN, Publish Date - Sep 07 , 2025 | 08:32 AM
చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదివారం పలు ఆలయాలను మూసివేయనున్నారు. తిరిగి సోమవారం దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.
తిరుమల, హైదరాబాద్, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం కారణంగా ఇవాళ(ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలను (Temples) మూసివేయనున్నారు. తిరిగి రేపు (సోమవారం) దేవస్థానాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని ఆలయాల అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయాల అధికారులు పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం..
తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు(సోమవారం) ఉదయం 3 గంటల వరకు మూసివేయనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అలాగే, అన్నదానం, లడ్డూ ప్రసాద కేంద్రాలను మూసివేయనున్నారు. ఇప్పటికే శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులను క్యూలైనులోకి వెళ్లకుండా నిలిపివేశారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంది. శుద్ధి, పుణ్యవహచనం నిర్వహించిన అనంతరం రేపు(సోమవారం) ఉదయం మూడు గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరువనున్నారు అర్చకులు. ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు రేపు ఉదయం 6 గంటలకు క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం మల్లన్న ఆలయం...
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఇవాళ ఉదయం నుంచే స్వామివారి స్పర్శదర్శనం, ఆర్జిత అభిషేకాలు, పరోక్షసేవలు, స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిలిపివేశారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం ఆలయంలో ప్రాత:కాల పూజలు 7:30 నుంచి స్వామి, అమ్మవార్ల మహా మంగళ హారతులు, మహా మంగళ హారతులు ఇవ్వనున్నారు. అలాగే, రేపు మధ్యాహ్నం 2:15 వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో స్పర్శదర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2:15 నుంచి 4 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీశైలం ఆలయ ఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సింహాచలం అప్పన్న స్వామి...
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామి దర్శనాన్ని ఈరోజు ఉదయం 6:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా సింహాచలం దేవస్థానంలో భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవల సమయాల్లో మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 8:00 గంటల నుంచి తిరిగి అప్పన్న స్వామి దర్శనాలను ప్రారంభిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
భద్రాచలం రామాలయం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నివేదన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7:30 గంటల నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం..
యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసి రేపు ఉదయం 3:30 గంటల నుంచి తెరువనున్నారు ఆలయ అధికారులు. రేపు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా నిత్యా కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు ఆలయ అధికారులు.
ద్వారకా తిరుమల ఆలయం..
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం నివేదన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు అర్చకులు, అధికారులు. రేపు ఉదయం 9:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, శుద్ధి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, రేపు ఉదయం సుప్రభాత సేవను రద్దు చేసినట్లు ద్వారకా తిరుమల ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహేశ్‌గౌడ్‌కు సీఎం రేవంత్ సన్మానం
For More TG News And Telugu News
Updated Date - Sep 07 , 2025 | 08:56 AM