Tirumala: తిరుమల కొండకు ఎన్ని దారులో..
ABN, Publish Date - Sep 21 , 2025 | 11:50 AM
‘‘ఏడు కొండల సామి.. ఎక్కడున్నావయ్యా... ఎన్నీ మెట్లెక్కినా.. కానరావేమయ్యా.. ఈ అడవిదారిలో.. చేయూతనీయవా..’’ అంటూ శ్రీవేంకటేశ్వర మహత్యము సినిమాలోని పాట, తిరుమలకు చేరుకోవడం ఎంత కష్టమో వివరిస్తుంది. ఇప్పుడంటే ఎక్కడానికీ దిగడానికీ వేరువేరుగా సురక్షితమైన తారురోడ్లు ఉన్నాయి కానీ... ఒకప్పుడు దట్టమైన అడవిలో, క్రూరమృగాల నడుమ నుంచి, వాగులు వంకలు దాటి బండలు కొండలు ఎక్కి, లోయలు దాటి తిరుమలకు చేరుకోవాల్సి వచ్చేది.
‘‘ఏడు కొండల సామి.. ఎక్కడున్నావయ్యా...
ఎన్నీ మెట్లెక్కినా.. కానరావేమయ్యా..
ఈ అడవిదారిలో.. చేయూతనీయవా..’’ అంటూ శ్రీవేంకటేశ్వర మహత్యము సినిమాలోని పాట, తిరుమలకు చేరుకోవడం ఎంత కష్టమో వివరిస్తుంది. ఇప్పుడంటే ఎక్కడానికీ దిగడానికీ వేరువేరుగా సురక్షితమైన తారురోడ్లు ఉన్నాయి కానీ... ఒకప్పుడు దట్టమైన అడవిలో, క్రూరమృగాల నడుమ నుంచి, వాగులు వంకలు దాటి బండలు కొండలు ఎక్కి, లోయలు దాటి తిరుమలకు చేరుకోవాల్సి వచ్చేది. తిరుమల యాత్ర అంటే ఒక సవాలుగా ఉండేది. నడవలేని వారిని డోలీలలో మోసుకెళ్ళే కూలీలు వుండేవారు. 1944లో ఘాట్ రోడ్డు నిర్మించేదాకా ఇదే పరిస్థితి.
తిరుమలలో వెలుగు చూసిన తొలి శాసనం 7వ శతాబ్ది నాటిది. క్రీస్తు శకం 600 నాటికే అక్కడ శ్రీవారి ఆలయం వుంది. అంతకు మునుపు ఎప్పటి నుంచి వుందో చెప్పే చారిత్రక ఆధారాలు లేవు. అంటే దాదాపు 1400 ఏళ్లుగా శేషాచలం కొండల్లో కొలువైయున్న తిరుమల ఆలయాన్ని భక్తులు సందర్శిస్తున్నారు. అడవిదారుల్లోనే కొండకు చేరుకునేవారు. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారులు మాత్రమే వినియోగంలో ఉన్నా వందల ఏళ్ల కిందట అనేక మార్గాలుండేవి.
- తిరుపతి నుంచి తిరుమలకు చేరుకోవడానికి తొలుత కపిలతీర్థం నుంచి దారి వుండేది. కపిలతీర్థంలో స్నానం చేసి, కపిలేశ్వరుని పూజించి నడక మొదలు పెట్టేవారు. ప్రస్తుతం గాలిగోపురమున్న పర్వతం మీదుగా ప్రయాణించి తిరుమలకు చేరుకునేవారు.
- అవ్వాచారికోన పేరిట మరో దారి వుండేది. కడప-రేణిగుంట మార్గంలో ఆంజనేయపురం నుంచి మొదలుపెట్టి అవ్వాచారికోన లోయలో నడచి పడమర వైపునకి ప్రయాణించి మోకాళ్ళ పర్వతానికి చేరుకునేవారు. అక్కడి నుంచి తిరుమల వెళ్ళేవారు.
- ఏనుగులదారి పేరిట చంద్రగిరి-శ్రీవారి మెట్టు నుంచి అవ్వాచారికోన వరకూ ఒక తోవ వుండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్థంభాలను ఈ మార్గంలోనే ఏనుగుల ద్వారా చేరవేశారని చెబుతారు. అందుకే ఏనుగులదారిగా పేరు పడిందంటారు.
ఫ తలకోన సిద్ధేశ్వరాలయం నుంచి జలపాతం, జండా పేటుల మీదుగా తిరుమలకు ఒక మార్గముండేది. 25 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఆనవాళ్ళు ఇప్పటికీ వున్నాయి.
కనుమరుగైన తోవలు: మెకంజీ కైఫియతులలో తిరుమలకు అనేక దారులున్నాయని ప్రస్తావించారు. ఉదాహరణకు ఉత్తరంగా మామండూరు, శెట్టిగుంటల నుంచి, దక్షిణంగా తిరుపతి, కపిలతీర్థం, పేరూరు, శ్రీవారి మెట్టుల నుంచి, తూర్పువైపున కరకంబాడి, శ్రీకాళహస్తిల నుంచి, పడమర నాగపట్ల కనుమ దారి నుంచి తిరుమలకు చేరుకునేవారని వీటిల్లో ప్రస్తావన ఉంది.
సొరంగ మార్గం: కపిలతీర్థం ఆలయ ప్రాంగణం నుంచి తిరుమలకు రహస్య సొరంగ మార్గముందని, తొండమాన్ చక్రవర్తి ఈ మార్గం మీదుగా వెళ్ళి దర్శనం చేసుకునే వారని ఈ ప్రాంతవాసుల నమ్మకం.
శతాబ్దాలుగా వన్నె తరగని అలిపిరి
తిరుమలకు చేరుకోవడానికి భక్తులు ఎక్కువగా ఎన్నుకునే నడకదారి అలిపిరి. విజయనగర రాజులు మొదలు సామాన్య భక్తుల దాకా వందల ఏళ్లుగా ఈ మార్గంలోనే నడుస్తున్నారు. అలిపిరి నుంచి తిరుమలకు ఈ మెట్ల దారిని విజయనగర రాజుల సామంతుడైన మట్లి కుమార అనంతరాజు ఏర్పాటు చేశారు. ఆయన వేసిన శాసనంలో అలిపిరిని అడిపడి అని పేర్కొన్నారు.. తమిళ ంలో అడిపడి అంటే అతి కిందనున్న మొదటి మెట్టు అని అర్థం. కాలక్రమంలో అడిపడి కాస్తా అలిపిరిగా మారింది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే ఈ నడక దారి దూరం 9 కిలోమీటర్లు. ఈ దారిలో మొత్తం 3550 మెట్లు వున్నాయి. ఈ మార్గంలో తిరుమలకు చేరుకోవడానికి నాలుగు నుంచి ఆరు గంటలు పడుతుంది.
సులువైన దారి శ్రీవారి మెట్టు
అలిపిరి తర్వాత భక్తులు ఎక్కువగా వినియోగిస్తున్న నడక దారి శ్రీవారి మెట్టు. కొండకు సులువుగా చేరుకునే మార్గంగా దీనికి పేరుంది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం నుంచి ఈ దారి మొదలవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు ఏడు సార్లు తిరుమలను సందర్శించగా ఎక్కువ సార్లు శ్రీవారి మెట్టు మార్గంలోనే ప్రయాణించారు. 2.10 కిలోమీటర్ల దూరం వున్న ఈ మార్గంలో 2388 మెట్లు వున్నాయి. గంట నుంచి రెండు గంటల సమయంలోనే ఈ మార్గంలో తిరుమలకు చేరుకోవచ్చు.
అన్నమయ్య నడచిన దారి
కడప జిల్లా వైపు నుంచి కూడా తిరుమలకు చేరుకోవడానికి రెండు నడకదారులు ఉన్నాయి. కడప-రేణిగుంట మార్గంలోని కుక్కలదొడ్డి గ్రామం నుంచి ఈ దారి మొదలవుతుంది. తుంబురతీర్థం, పాపవినాశనం మీదుగా తిరుమలలో పార్వేట మండపం వద్దకు చేరుకోవచ్చు. అన్నమయ్య ఈ మార్గంలోనే కొండకు నడచి వచ్చాడని ప్రచారం.
- శివప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 21 , 2025 | 12:12 PM