Hyderabad: ఫేస్‌బుక్‌లో హనీట్రాప్.. 70 ఏళ్ల వృద్ధుడిపై వలపు వల విసిరి..
ABN, Publish Date - Jun 19 , 2025 | 08:12 AM
సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో హనీట్రాప్ చేసి ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ.38.73 లక్షలు దోచేశారు. వలపు వలలో పడి తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- రూ.38.73 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు
- బాధితుడు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి
- సినిమాను తలపించిన ట్విస్ట్‌లు
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్(Facebook)లో హనీట్రాప్ చేసి ఓ వృద్ధుడి నుంచి ఏకంగా రూ.38.73 లక్షలు దోచేశారు. వలపు వలలో పడి తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసంలో సినిమాను తలపించేలా ట్విస్ట్‌లున్నాయి. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. 70 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి ఇటీవల ఫేస్‌బుక్‌లో ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా దానిని యాక్సెప్ట్ చేసిన బాధితుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
తర్వాత తన ఇంట్లో ఇంటర్నెట్ లేదని, వైఫై కనెక్షన్ కోసం రూ.10వేలు అవసరమని ఆమె చెప్పగా.. చెల్లించడానికి అతను సిద్ధమయ్యాడు. దీంతో ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ నంబర్ అని ఒక నంబరు పంపగా..దానికి బాధితుడు డబ్బు పంపాడు. కొద్దిరోజులు అతనితో ప్రేమగా ఫేస్‌బుక్ కాల్స్ మాట్లాడిన యువతి బాధిత వృద్ధుడిపై వలపు వల విసిరింది. ఈ క్రమంలో బాధితుడు ఆమె మైకంలో పడిపోయాడు. అయితే ఉన్నట్టుండి ఆమె మాట్లాడటం మానేయడంతో ఆందోళన చెందిన బాఽధితుడు ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్‌కు ఫోన్ చేయగా.. ఆమెకు ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేరిందని, వైద్య ఖర్చుల కోసం చాలా ఇబ్బంది పడుతోందని నమ్మించాడు.
నమ్మిన బాధితుడు విడతలవారీగా ఆమె వైద్య ఖర్చుల కోసం రూ.12.65 లక్షలు పంపాడు. అయినా యువతి నుంచి స్పందనరాకపోవడంతో మళ్లీ ఆ ఆపరేటర్‌కు ఫోన్ చేయగా.. ఆమె ఇటీవలే దుబాయ్(Dubai)కి వెళ్లిందని చెప్పాడు. ఆ తర్వాత బాధితుడితో పలుమార్లు మాట్లాడిన ఇంటర్నెట్ ఆపరేటర్ పరిచయం పెంచుకున్నాడు. తన తల్లి, చెల్లి మీతో మాట్లాడాలనుకుంటున్నారని, వారిని పరిచయం చేశాడు. దాంతో బాధితుడితో ఆ ఇద్దరు మహిళలు తల్లి, చెల్లిలా నటిస్తూ పరిచయం పెంచుకున్నారు.
మాయచేసి ఆయన్ను ముగ్గులోకి దింపారు. నిత్యం కాల్స్, చాటింగ్ చేశారు. కొద్దిరోజుల తర్వాత లైన్‌లోకి వచ్చిన ఇంటర్నెట్ ఆపరేటర్ తన చెల్లి, తల్లితో అసభ్యంగా మాట్లాడావని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. తన చెల్లి మైనర్ అని, పోక్సో కేసు నమోదు చేయిస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే బాధితుడికి ఓ మెసేజ్ వచ్చింది. ‘మీపై పోక్సో నమోదైంది. మీరు వెంటనే అవతలి వ్యక్తులతో సెటిల్‌మెంట్ చేసుకోవాలి. లేదంటే కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ చేస్తాం’ అని అందులో ఉంది. దాంతో బాధితుడు ఆ ఆపరేటర్ తల్లితో మాట్లాడి ఆమెకు రూ.12.5 లక్షలు ఇచ్చేలా సెటిల్ చేసుకున్నాడు.
ఆ డబ్బులు ఇంటర్నెట్ ఆపరేటర్ ఖాతాలో వేశాక బాధితుడికి మరో కాల్ వచ్చింది. తాను కానిస్టేబుల్‌ను మాట్లాడుతున్నానని చెప్పి.. మీరు మీరే సెటిల్ చేసుకుంటే సరిపోతుందా..? మా ఎస్సైకి, నాకు ఏం చెయ్యవా అంటూ హెచ్చరించాడు. ఎస్సై రూ.10 లక్షలు అడిగారని, ఇవ్వకుంటే కేసు మళ్లీ ఓపెన్ చేస్తానంటున్నారని బెదిరించాడు. దాంతో బెంబేలెత్తిపోయిన వృద్ధుడు ఎస్సైకి రూ.10లక్షలు, కానిస్టేబుల్‌కు రూ.లక్ష చెల్లించాడు. రెండు మూడు రోజుల తర్వాత కానిస్టేబుల్ ఫోన్ చేసి పాత ఎస్సై మారిపోయాడని, కొత్త ఎస్సై పోక్సో కేసు మళ్లీ తెరుస్తానంటున్నారని, ఆయనకు రూ.10 లక్షలు చెల్లించకుటే ఇబ్బందుల్లో పడతారని బెదిరించాడు.
తన వద్ద అంత డబ్బులేదన్న బాఽధితుడు రూ.2.58 లక్షలు చెల్లించాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి బాధితుడికి ఫోన్ చేసి ‘బాలిక తాత కేసు పెడతానని స్టేషన్‌కు వచ్చాడు. అతడికి రూ.6.5 లక్షలు, తమ పై అధికారికి రూ.20లక్షలు ఇస్తే కేసును క్లోజ్ చేస్తాం’ అన్నాడు. జూన్ 25 లోపు చెల్లించాలని గడువు విధించి ఫోన్ కట్ చేశారు. అప్పటికే రూ.38.73 లక్షలు సమర్పించుకున్న బాధితుడు తాను మోసపోయిన విధానం గురించి స్నేహితులతో చెప్పడంతో అది సైబర్ మోసమని చెప్పారు. దాంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే
Read Latest Telangana News and National News
Updated Date - Jun 19 , 2025 | 08:45 AM