Tirumala: తిరుమల యాత్రికులకు బీమా
ABN, Publish Date - Jun 29 , 2025 | 04:47 AM
శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే యాత్రికులందరికీ బీమా సదుపాయం కల్పించే దిశగా టీటీడీ యోచిస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రూపుదిద్దుకోనప్పటికీ సాధ్యాసాధ్యాలపై పాలక, అధికారవర్గాల్లో ఆలోచన మొదలైంది.
సదుపాయం కల్పనపై టీటీడీ యోచన
పాలకమండలి సమావేశంలోనూ చర్చ!
నిత్యం సగటున 70 వేల మంది కొండపైకి
వీరందరికీ బీమా కల్పించడం సాధ్యమేనా?
టికెట్ లేని సర్వదర్శనం భక్తుల మాటేమిటి?
సాధ్యాసాధ్యాలపై అధికారుల తర్జనభర్జనలు
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నిర్ణయం?
(తిరుపతి-ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే యాత్రికులందరికీ బీమా సదుపాయం కల్పించే దిశగా టీటీడీ యోచిస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రూపుదిద్దుకోనప్పటికీ సాధ్యాసాధ్యాలపై పాలక, అధికారవర్గాల్లో ఆలోచన మొదలైంది. అయితే రోజువారీగా భారీగా వచ్చే భక్తులకు బీమా కల్పించడం సాధ్యమేనా? దర్శనంటికెట్ గానీ, టైమ్ స్లాట్ టోకెన్ గానీ లేకుండా వచ్చే సర్వదర్శనం భక్తుల మాటేమిటి? అంటూ తర్జనభర్జనలు సాగుతున్నాయి.
ఈ నెల 17న తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో అజెండాతో సంబంధం లేకుండా తిరుమల యాత్రికులకు బీమా సదుపాయం కల్పించడంపై కొందరు పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. తిరుమల వచ్చి వెళుతున్న భక్తులు అనారోగ్యం బారిన పడినా, గాయపడినా ఇప్పటి వరకూ వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ఎవరైనా అనారోగ్యంతోనో లేక ప్రమాదాల్లోనో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా తరహాలో ఆర్థిక సాయం అందిస్తున్న ఉదాహరణలూ ఉన్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. అరుదుగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వీటికి తోడు నడక దారిలో వన్యప్రాణుల మూలంగా భక్తులకు ప్రమాదం పొంచి ఉంటోంది. అయితే ఈ ఘటనల్లో ఎప్పుడూ టీటీడీ పెద్దగా ఒత్తిడికి లోను కాలేదు. బీమా సదుపాయం గురించి ఆలోచించింది లేదు. అయితే ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన టీటీడీని కుదిపివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి టీటీడీ ఆర్థిక సాయం చేసింది. అప్పటి నుంచే యాత్రికులకు బీమా సదుపాయం కల్పించాలన్న ఆలోచన మొదలైంది. కాకపోతే దానిపై సీరియ్‌సగా దృష్టి సారించలేదు. అధికారులు, పాలక మండలి సభ్యుల మధ్య మాత్రం తరచుగా ఈ విషయమై చర్చ మాత్రం నడుస్తోంది.
టీటీడీపై పెనుభారం
తిరుమలకు రోజువారీ సగటున 70 వేల నుంచి 80 వేల మంది భక్తులు వస్తుంటారు. వారాంతాల్లో, సెలవు దినాలు, ప్రత్యేక దినాల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుంది. అంతమందికి బీమా సదుపాయం కల్పించడం సాధ్యమేనా అన్న ప్రశ్న టీటీడీ వర్గాలను వేధిస్తోంది. ఎందుకంటే ప్రతి భక్తుడి తరఫునా బీమా కంపెనీలకు టీటీడీనే ఏడాది పొడవునా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా టీటీడీపై ఇది పెనుభారం మోపే అవకాశముంది. అలాగే తిరుమలకు వచ్చే యాత్రికులకు ఏ ప్రాతిపదికన బీమా కల్పించాలన్నది కూడా ప్రధాన ప్రశ్నే. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక దారి, ఘాట్ రోడ్డు... ఇలా మూడు మార్గాల్లో యాత్రికులు తిరుమల వెళ్తున్నారు. ఈ మూడుచోట్లా ప్రతి యాత్రికుడి వివరాలనూ టీటీడీ నమోదు చేయాల్సి ఉంటుంది. యాత్రికుల పేర్లు, చిరునామా, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు వంటి వివరాల నమోదుకు సమయం పడుతుంది.
అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అవసరం. ఈ పని కోసం విడిగా యంత్రాంగం సైతం కావాల్సి ఉంటుంది. ఇదంతా టీటీడీపై అదనంగా భారం మోపే అంశాలే. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే భక్తులు, సిఫారసు లేఖలతో వెళ్లేవారు, టైమ్ స్లాట్ బుకింగ్‌తో వెళ్లేవారికి చేతిలో ఏదో ఒక ఆధారం ఉంటుంది. అయితే ఉచిత లేదా సర్వదర్శనం క్యూలో వెళ్లే యాత్రికుల వద్ద ఎలాంటి రశీదులూ, ఆధారాలూ ఉండవు. వీరు ఆధార్ కూడా వెంట తెచ్చుకునే పరిస్థితి ఉండదు. అలాంటి వారికి బీమా కల్పించడం సాధ్యమేనా? అని చర్చ నడుస్తోంది.
ఇంకా ఆలోచన దశలోనే..
యాత్రికులకు బీమా అంశం టీటీడీలో ప్రస్తుతానికి ఆలోచన దశలోనే ఉంది. ఇంకా ప్రతిపాదనగా రూపు దిద్దుకోలేదు. టీటీడీ ఉన్నతాధికారులు, పాలకవర్గం సీరియ్‌సగా తీసుకుని ముందుగా దానిపై లోతైన కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రతిపాదన రూపొందించాల్సి ఉంది. ఆపై ప్రభుత్వ అనుమతితో గానీ అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిన నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం బీమా సదుపాయ కల్పన గురించి ఎంతవరకూ ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.
Updated Date - Jun 29 , 2025 | 04:47 AM