Volunteer System in AP: పింఛన్, రేషన్ పంపిణీ ఇప్పుడే బాగుంది
ABN, Publish Date - Jun 02 , 2025 | 03:00 AM
వలంటీర్ల లేకుండానే ఇంటి వద్దకే పింఛన్, రేషన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం మాట నిలబెట్టి పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచింది, సేవలు ఎక్కడా ఆగలేదని ప్రజలు చెబుతున్నారు.
1నే.. ఇంటి వద్దకే
ప్రతినెలా ఠంచనుగా పింఛను
సెలవు దినమైతే ముందురోజే పంపిణీ
వలంటీర్లు లేకపోయినా ఆగని సేవలు
ప్రభుత్వానికి ఏటా 1200 కోట్లు ఆదా
ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పినట్టుగా పెన్షన్ 4 వేలకు పెంపు
వలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరన్న జగన్ మాటలు ఒట్టివే
‘సేవలకు సమాధి కట్టేస్తున్నారు’... అని విపక్ష నేత జగన్ తెగ వాపోయారు! వలంటీర్లను పక్కన పెట్టేశారని... రేషన్ బండ్లను మూలకు నెట్టారని ఆక్రోశించారు. వలంటీర్లు లేకుంటే ప్రపంచమంతా తలకిందులైపోతుందన్నది వైసీపీ వాదన మాత్రమే! కానీ... వారు లేకున్నా పింఛన్ల పంపిణీ ఆగలేదు. ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఏడాదిగా ప్రతినెలా ఠంచనుగా లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే పెన్షను అందుతోంది.
వైసీపీ హయాంలో ఇంటింటికీ సరుకుల పంపిణీ ఒక మిథ్యే! సరుకుల బండి ఆగేది... వీధి మలుపు చివరే! లబ్ధిదారులను నడి రోడ్డుపై క్యూలో నిలబెట్టిన ఘనత జగన్‌దే! ఇప్పుడు డీలర్ల ద్వారా సరుకుల పంపిణీతో ఈ కష్టం తీరుతోంది. ముడుపులు పిండుకునేందుకే అప్పట్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. వాటిని తొలగించడంవల్ల వేలమందికి ఉపాధి పోయిందట! వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలిచ్చి జనం సొమ్మునే జీతాలుగా పంచారు. ఇప్పుడు వారిని తొలగించడమూ తప్పేనట! గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ కూటమి సర్కారు తొలగించలేదు. సచివాలయాలను హేతుబద్ధీకరించడం ద్వారా ఉద్యోగుల సేవలను సమర్థంగా వినియోగించుకోవడంపైనే దృష్టి పెట్టింది. దానినీ జగన్ వక్రీకరించారు. ‘33వేల శాశ్వత ఉద్యోగాలకు సమాధి కట్టారు’ అని తప్పుడు ఆరోపణలు చేశారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘కూటమి సర్కారు వస్తే వలంటీర్లను తీసేస్తుంది. అప్పుడు పింఛన్ల పంపిణీ ఆగిపోతుంది’... అంటూ ఎన్నికల ముందు వైసీపీ గగ్గోలు పెట్టింది. కూటమి ప్రభుత్వమే వచ్చింది. వలంటీర్లను పక్కన పెట్టింది. కానీ... పింఛన్ల పంపిణీ మాత్రం ఆగలేదు. వలంటీర్లు లేకపోయినా ఏడాదిగా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వంలో కంటే సజావుగా సాగుతోంది. గత జూన్ నుంచి వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడం లేదు.
అయినా ప్రతి నెలా ఒకటో తేదీ లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి సచివాలయ ఉద్యోగులు అందజేస్తున్నారు. ఈ నెలలో పెన్షన్‌ను ఒక రోజు ముందుగానే మే 31న పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు ఒక్కరోజులోనే 92శాతం పూర్తి చేశారు. పెన్షన్‌ను రూ.3 వేలుకు పెంచుతామన్న హామీని జగన్ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లకు నెరవేరిస్తే.. రూ.4వేలుకు పెంచుతామన్న మాటను చంద్రబాబు సీఎం అయిన వెంటనే నిలబెట్టుకున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకొనే జగన్ సర్కారుకు, చంద్రబాబు ప్రభుత్వానికి పాలనలో తేడా చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమేనని అంటున్నారు. వలంటీర్లను తొలగించడం వల్ల ప్రజలకు ఏ సేవలు కూడా నిలిచిపోలేదని చెబుతున్నారు.
ఎన్నికల ముందు రాద్ధాంతం
పెన్షన్ల పంపిణీపై ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం రాద్ధాంతం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక వలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేపట్టరాదని ఈసీ ఆదేశించింది. వలంటీర్లు ఉండటం వల్లనే పెన్షన్ ప్రతినెలా ఒకటో తేదీ వస్తోందని, ఇక నుంచి సకాలంలో రాదని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేసింది. గతంలో పెన్షన్లు ఇంటికొచ్చేవని, చంద్రబాబు ఫిర్యాదుతో సచివాలయం వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పెన్షన్‌దారులు అనుకునేలా, టీడీపీ పట్ల వ్యతిరేకత పెంచేలా ఉధృతంగా ప్రచారం చేసింది. ఎన్నికల్లో లబ్ధిపొందాలని కుట్ర చేసినా ప్రజలు నమ్మలేదు.
వలంటీర్ల పని.. సచివాలయ సిబ్బందితో
వైసీపీ ప్రభుత్వంలో వలంటీర్లను నియమించింది కేవలం ఆ పార్టీ కోసమే. సొంత పార్టీ కార్యకర్తలను నియమించుకోవడం ద్వారా వారికి ఉపాధి కల్పించడంతో పాటు వారి ద్వారా పార్టీ పనులు చేయించుకోవాలన్నది అసలు వ్యూహం. వలంటీర్లంతా ‘మనవాళ్లే’ అని స్వయానా నాటి సీఎం జగన్, విజయసాయిరెడ్డిలు పలు సమావేశాల్లో చెప్పారు. వీరు ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడలేదు. రాష్ట్రవ్యాప్తంగా 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.26లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. పెద్ద పంచాయతీల్లో బిల్లు కలెక్టర్లు, ఇతర సిబ్బందితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 1.62 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు వారి సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రతి లబ్ధిదారుకూ పెన్షన్ ఠంఛన్‌గా అందుతోంది. రాష్ట్రంలో పెన్షన్‌దారులతో చంద్రబాబుకు, టీడీపీకి విడదీయరాని బంధముంది. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ఎన్టీఆర్‌దే. మొదటిసారిగా ఎన్టీఆర్ హయాంలో రూ.75 పెన్షన్ మంజూరు చేశారు. తర్వాత వైఎస్ హయాంలో రూ.200చేయగా, చంద్రబాబు రూ.2 వేలకు, దివ్యాంగులకు రూ.3వేలకు పెంచారు. 2019 ఎన్నికల ముందు పెన్షన్ రూ.3 వేలకు పెంచుతామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. ఏటా రూ.250 పెంపు అంటూ మెలిక పెట్టింది. అది కూడా సక్రమంగా ఇవ్వలేదు. ఐదేళ్లకు రూ.3 వేలు పెంచింది. జగన్ మాట తప్పడంతో ఒక్కో పెన్షన్‌దారు రూ.13,500 నష్టపోయారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచారు. టీడీపీ పాలనలోనే పెన్షన్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వైసీపీకి అలవాటే
ఎన్నికల సమయంలో టీడీపీపై అభాండాలు వేయడం వైసీపీకి కొత్తేమీ కాదు. 2019 ఎన్నికల్లో కూడా జన్మభూమి కమిటీలపై ఎన్నో ఆరోపణలు చేసింది. జన్మభూమి కమిటీలు పెన్షన్లు, ఇళ్ల మంజూరుకు లంచాలు తీసుకుంటున్నాయని, డబ్బులిస్తేనే పెన్షన్లు, ఇళ్లు ఇస్తారని ప్రచారం చేసింది. పలువురు ఇది నిజమని నమ్మారు కూడా. అదేవిధంగా డీఎస్పీ పదోన్నతుల విషయంలో వైసీపీ ఇలాంటి తప్పుడు ప్రచారమే చేసింది. 37మంది కమ్మ సామాజికవర్గానికి మాత్రమే పదోన్నతులు కల్పించారని ప్రచారం చేసింది. చివరకు అవన్నీ అవాస్తవాలు అని తేలింది. ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో ఇప్పుడు కూడా అదే పంథా అవలంభిస్తోందని చెబుతున్నారు.
Updated Date - Jun 02 , 2025 | 06:14 AM