TDP Political Rally: భారీగా పసుపు పండగ
ABN, Publish Date - May 25 , 2025 | 05:11 AM
కడపలో తొలిసారిగా టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించబడుతుంది. రెండు రోజుల పాటు 30వేల మందికి బస, భోజనం అందించబడుతుంది; మూడో రోజు 5 లక్షల మందికి భోజనం ఏర్పాట్లు చేయబడ్డాయి.
తొలి 2 రోజులు 30 వేల మందికి ఆతిథ్యం
ప్రతిష్ఠాత్మకంగా కడప మహానాడు .. బస నుంచి భోజనాల వరకూ పకడ్బందీగా సాగుతున్న ఏర్పాట్లు
మూడోరోజు 5లక్షల మందికి భోజనాలు
బహిరంగ సభ కోసం 8వేల బస్సులు సిద్ధం
నేటి సాయంత్రానికి పనులు దాదాపు పూర్తి
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రుల కమిటీ
భద్రతా ఏర్పాట్లపై డీజీపీ హరీశ్‌కుమార్ సమీక్ష
అమరావతి/కడప, మే 24(ఆంధ్రజ్యోతి): కడప గడపలో తొలిసారిగా నిర్వహించనున్న మహానాడును తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడుకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస నుంచి భోజనాల వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జరుగుతున్న వేడుక కావడంతో దీన్ని ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ముఖ్య నేతలు నెల రోజులుగా శ్రమిస్తున్నారు. ఈ మహానాడుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా కడప జిల్లాను వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా భావిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలను టీడీపీ శాసించినా కడపలో మాత్రం వైఎస్ కుటుంబమే పైచేయి సాధించేది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఏడుచోట్ల టీడీపీ జెండా ఎగిరింది. ఇది ఆ పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. అదే ఊపులో ఈసారి మహానాడును కడపలో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కడపలో మహానాడు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇది ఓ ప్రత్యేకత కాగా, చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుగుతున్న మహానాడు కావడం మరో ప్రత్యేకత. టీడీపీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సమయంలో ఒంగోలులో మహానాడును 2022లో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. వైసీపీ పాలన అంతానికి ఒంగోలు మహానాడు నాంది పలికింది. ఇప్పుడు కడప మహానాడు ఆ జిల్లాలో వైఎస్ కంచుకోటను బద్దలు కొడుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
భారీగా ఏర్పాట్లు..
మహానాడు తొలి రెండురోజులు సుమారు 23వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ప్రస్తుత కడప జిల్లావ్యాప్తంగా బస ఏర్పాట్లు చేశారు. సుమారు 30వేల మందికి బస సిద్ధం చేశామని టీడీపీ నాయకులు తెలిపారు. వీరందరికీ భోజనాలకు మహానాడు ప్రాంగణం వద్దే ఏర్పాట్లు చేశారు. తొలి రెండు రోజులు 30వేల మందికి, మూడో రోజు సుమారు 5లక్షల మందికి భోజనం అందించనున్నారు. బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివస్తుండటంతో వారందరికీ అవసరమైన రవాణా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరునుంచి వచ్చేవారికి 3వేలబస్సులు, రాష్ట్రం నలుమూలనుంచి వచ్చేవారికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు కలిపి 5వేల వరకూ అందుబాటులో ఉంచుతున్నారు.
ముమ్మరంగా పనులు
మహానాడు పనులు ఆదివారం సాయంత్రానికి దాదాపు పూర్తవుతాయి. ఏర్పాట్లను మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దనరెడ్డి, నిమ్మల రామానాయుడు, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు అమర్‌నాథరెడ్డి, పులివర్తి నాని, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, రవిచంద్రయాదవ్ శనివారం పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చే వారికోసం కర్నూలు- కడప- చిత్తూరు జాతీయ రహదారి, పులివెందుల రోడ్డులో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్నమయ్య జిల్లా నుంచి వచ్చే కార్యకర్తలకు గువ్వలచెరువు వద్ద భోజన సదుపాయం ఏర్పాట్లపై పరిశీలించారు. జన సమీకరణపై చర్చించారు. మహానాడు సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సూచించారు. వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, ఫుడ్‌కోర్టు, ప్రధాన వేదిక వద్ద చేపట్టాల్సిన భద్రతపై పోలీసులకు సూచనలు చేశారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ డీఐజీ మధుసూదనరెడ్డి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, అనంతపురం డీఐజీ షిమోషి, కడప, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ సూచించారు.
Updated Date - May 25 , 2025 | 05:12 AM