ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kakani Govardhan Reddy Arrest: క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకంలో కాకాణే సూత్రధారి

ABN, Publish Date - May 27 , 2025 | 03:34 AM

క్వార్ట్జ్ అక్రమ తవ్వకానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. రూ.138 కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించి, అధికారులను గిరిజనులను బెదిరించినట్లు రిమాండ్‌ రిపోర్టు వెల్లడించింది.

  • రుస్తుం మైన్స్‌లో 138 కోట్ల ఖనిజం తరలింపు

  • అధికార్లను, గిరిజనులను భయపెట్టారు

  • ఆయనకు పెద్ద నేరచరిత్రే ఉంది

  • 11 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌

  • విచారణకు పిలిచినా రాలేదు

  • 2 నెలలు తప్పించుకుని తిరిగారు

  • బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు

  • కోర్టుకు పోలీసుల నివేదన

  • సుదీర్ఘ రిమాండ్‌ రిపోర్టు సమర్పణ

  • మాజీ మంత్రికి 14 రోజులు రిమాండ్‌

  • నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలింపు

  • కస్టడీ కోసం నేడు కోర్టులో పిటిషన్‌ వేయనున్న పోలీసులు

నెల్లూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్‌లో మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డే సూత్రధారి అని పోలీసులు స్పష్టంచేశారు. అప్పట్లో మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని పొదలకూరు మండలం పరిధిలోని రుస్తుం మైన్స్‌లో ఈయన రూ.138 కోట్ల విలువైన క్వార్ట్జ్‌ ఖనిజాన్ని అక్రమంగా తరలించారని వెల్లడించారు. ఇందుకోసం అధికారులను, క్వారీ కింద నివసించే గిరిజనులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారని కోర్టుకు సమర్పించిన సుదీర్ఘ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కాకాణికి సుదీర్ఘ నేరచరిత్ర ఉందని.. 11 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కర్ణాటకలోని చింతామణిలో ఆదివారం రాత్రి ఆయన్ను అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఆయనకు రెండు వారాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. వెంటనే ఆయన్ను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.


చింతామణిలో అరెస్టుచేసిన అన్నమయ్య పోలీసులు

మైనింగ్‌ కేసులో ఏ-4గా ఉన్న కాకాణి కోసం నెల్లూరు పోలీసులు రెండు నెలలు విస్తృతంగా గాలించారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు బృందాలు జల్లెడపట్టాయి. చివరకు బెంగళూరు శివార్లలోని చింతామణి ప్రాంతంలో ఆయన ఉన్నారని సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ అప్రమత్తమయ్యారు. చింతామణికి పొరుగునే ఉన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌తో మాట్లాడారు. అక్కడి నుంచి ఓ పోలీసు బృందాన్ని పంపారు. ఆ బృందం ఆదివారం రాత్రి చింతామణి ప్రాంతంలోని వెంకటపురం గ్రామంలో కాకాణిని అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి నేరుగా నెల్లూరు డీటీసీకి తీసుకొచ్చి నెల్లూరు పోలీసులకు అప్పగించింది. అక్కడ ఆయన్ను జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్య, నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సోమవారం విచారించారు. అయితే ఏ ప్రశ్నకూ ఆయన జవాబివ్వలేదు. ఆయన వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెంకటాచలంలో వైద్య పరీక్షలు చేయించి, తిరిగి డీటీసీకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వెంకటాచలంలో వైద్య పరీక్షలు నిర్వహించి వెంకటగిరి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ కేసు గూడూరు కోర్టు పరిధిలోకి వస్తుంది. అక్కడి న్యాయాధికారి సెలవులో ఉండడంతో వెంకటగిరి కోర్టు మేజిస్ట్రేట్‌ విష్ణువర్మ ముందు హాజరుపరిచారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసు అని, వాస్తవాలు లేవని, కేసును కొట్టి వేయాలని కాకాణి తరఫు న్యాయవాదులు న్యాయాధికారిని కోరారు. అయితే ఈ కేసులో కనీసం పదేళ్లు శిక్షపడే అవకాశం ఉందని, ఇలాంటి కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారుచేసే ప్రమాదం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది వివరించారు. కాకాణికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు సహకరించలేదని.. రెండు నెలలు తప్పించుకుని తిరిగారని.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. పైగా ఆయనకు పెద్ద నేరచరిత్రే ఉందని.. బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన సుదీర్ఘ రిమాండ్‌ రిపోర్టును కోర్టు ముందుంచారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కాకాణికి న్యాయాధికారి రిమాండ్‌ విధించారు. ఈ కేసులో ఆయన్ను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. తమ క్లయింటుకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కాకాణి తరఫు న్యాయవాదులు కోరారు. ఆయన సమాజంలో పరువు ప్రతిష్ఠలు కలిగిన నాయకుడని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారని.. వెన్నునొప్పితో బాధపడుతున్నారని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని జైలులో ఆయనకు ఏసీ గది, వార్తా పత్రికలు, ఇంటి భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు. అయితే కోర్టు ఈ విన్ననంపై విచారణను పెండింగ్‌లో పెట్టింది. కాగా.. కాకాణిని వెంకటగిరి కోర్టుకు తీసుకొస్తారన్న సమాచారంతో వైసీపీ నాయకులు తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా పోలీసులు కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు.


కాకాణి నేర చరిత్ర ఇదీ..!

కాకాణిపై మొత్తం 11 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వైసీపీ అధికారం కోల్పోయాక గతేడాది తన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో వెంకటాచలం సీఐని ఆయన పరుష పదజాలంతో దూషిస్తూ, పోలీసులను బెదిరించేలా మాట్లాడారు. గుడ్డలూడదీస్తాం.. అంటూ అసభ్యకరంగా మాట్లాడడంతో నెల్లూరులోని వేదాయపాలెం, కావలి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అలాగే వెంకటాచలం, ముత్తుకూరు, నెల్లూరు దర్గామిట్ట పోలీసు స్టేషన్లలోనూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నెల్లూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో 2016లో ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదైంది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆయన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించారన్నది అభియోగం. ఇందులో చార్జిషీటు కూడా దాఖలైంది. 2014 ఎన్నికల సమయంలో కల్తీ మద్యం తయారీ, రవాణా, పంపిణీ చేశారన్న అభియోగాలతో కాకాణిపై ఇంకో 3 కేసులు దాఖలయ్యాయి. నెల్లూరు-2, రాపూరు ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి. ఈ కేసులను విచారించిన సీఐడీ.. చార్జిషీటు కూడా దాఖలుచేసింది. నెల్లూరు రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రస్తుతం ఈ కేసులు విచారణలో ఉన్నాయని పోలీసులు తెలిపారు.


ఎవరూ రాకుండా చూసుకుంటానన్నారు..

ఈ అక్రమ మైనింగ్‌లో కాకాణే సూత్రధారి అని, ప్రభుత్వ శాఖలేవీ మైనింగ్‌ ప్రాంతానికి రాకుండా చూసుకుంటానని చెప్పి.. వెనుక ఉండి నడిపించారనిఏ-7 కాటంరెడ్డి కరుణాకరరెడ్డి కీలక వాంగ్మూలమిచ్చారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు. ఆయన భరోసాతోనే రుస్తుం మైన్స్‌లో అక్రమ క్వార్ట్జ్‌ తవ్వకాలు జరిగాయని ఏ-6 వేమిరెడ్డి అరవిందకుమార్‌రెడ్డి, ఏ-8 వాకా శివారెడ్డి కూడా వాంగ్మూలాలిచ్చారు. ఈ కేసులో పూర్వపు మైనింగ్‌ అధికారి (ఎల్‌డబ్ల్యూ-25) స్టేట్‌మెంట్‌ కూడా కీలకంగా మారింది. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న సమయంలో సదరు అధికారి సంబంధిత శాఖలకు మైనింగ్‌ను అడ్డుకోవాలని సమాచారమిచ్చారు. ఈ సమయంలో కాకాణితోపాటు ఏ-1 పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి వాట్సాప్‌ కాన్ఫరెన్స్‌లో కాల్‌లో తనను బెదిరించారని ఆ అధికారి వ్లెడించారు. వరదాయపాలెం వెంకటేశ్వరెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ నుంచి కూడా మరోసారి కాకాణి తనతో మాట్లాడి బెదిరించారని.. ఆ తర్వాత తాను అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లలేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కాకాణి అండతోనే మైనింగ్‌ మాఫియా క్వార్ట్జ్‌ను అక్రమంగా తవ్వుకుపోయిందని ప్రత్యక్ష సాక్షి అయిన ఎల్‌డబ్ల్యూ-11 స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతోపాటు అప్పట్లో తీసిన ఫొటోలు, వీడియోలు కూడా పోలీసులకు అందజేశారు.

Updated Date - May 27 , 2025 | 03:35 AM