Heavy Rainfall: అకాల వర్షం తీరని నష్టం
ABN, Publish Date - May 05 , 2025 | 04:17 AM
మండువేసవిలో కురిసిన అకాల వర్షం రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం కలిగించింది. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో సహా కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించి, 8 మంది మరణించారు, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
మండు వేసవిలో భారీ వర్షంతో సర్వత్రా అతలాకుతలం
8 మంది దుర్మరణం
వేల ఎకరాల్లో మామిడి, వరికి నష్టం
దెబ్బతిన్న అరటి, బొప్పాయి, కొబ్బరి, మొక్కజొన్న
పిడుగులు పడి ఆరుగురు మృత్యువాత
చెట్టు కూలి ఓ బాలుడు, విద్యుదాఘాతంతో మరొకరు
విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరాకు అంతరాయం
విజయవాడ, కాకినాడల్లో ముంచెత్తిన జోరువాన
ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం
మంత్రుల సమీక్ష.. నేడు, రేపు భారీ వర్షసూచన
ఎక్కడికక్కడ నిలిచిన కరెంటు సరఫరా
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు
మండువేసవిలో అకాలవర్షం అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులు, వడగండ్లు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గాలివాన హోరెత్తించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయా ప్రాంతాల్లో గంటల కొద్దీ వాన దంచికొట్టింది. పిడుగులు పడి ఆరుగురు, చెట్టు కూలి ఓ బాలుడు, విద్యుదాఘాతంతో మరొకరు మరణించారు. పెనుగాలులు, భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో మామిడి, వరి, బొప్పాయి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి, వరి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చాలా చోట్ల భారీ వృక్షాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు భారీగా రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వాన దంచి కొట్టింది.
కాకినాడ జిల్లా కాజులూరులో అత్యధికంగా 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 130 చోట్ల 20 మిల్లీమీటర్ల కన్నా అధికంగా వాన పడింది. గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, అరటి, కొబ్బరి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగ్‌లు పడిపోయాయి. విజయవాడ సహా పలు నగరాల్లో పల్లపు ప్రాంతాలు జలమయయ్యాయి.
తిరుపతి జిల్లాలో ఇద్దరు మృతి
తిరుపతి జిల్లాలో ఈదురుగాలులతో పాటు మెరుపులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. నాయుడుపేట మండలం వద్దిగుంట కండ్రిగ గ్రామానికి చెందిన భాస్కర్ (50), ఓజిలి మండలం గ్రద్దగుంట పంచాయతీ గొల్లపాలెం వద్ద కార్తీక్ అనే బాలుడు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. తిరుపతిలో ఈదురుగాలుల ప్రభావం భయాందోళనకు గురిచేసింది. పలుచోట్ల వందేళ్ల నాటి వృక్షాలు నేలకొరిగాయి. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో ట్రాన్స్‌ఫార్మర్‌పై చెట్టుకూలిందన్న సమాచారంతో వెళ్లిన సచివాలయ జేఎల్‌ఎం మురళి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. శని, ఆదివారాల్లో గాలి వానతో మామిడి కాయలు నేలరాలాయి. సుమారు వెయ్యి ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం కలిగిందని అంచనా వేస్తున్నారు. అరటి, బొప్పాయి పంటలు దెబ్బ తిన్నాయి. విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో ఆ శాఖకు రూ.20లక్షలకుపైగా నష్టం కలిగింది.
జోరువాన
నెల్లూరు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మెట్ట ప్రాంతాల్లో ఉద్యాన పంటలకు కొంతమేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. రాపూరు మండలం రావిగుంటపల్లి గ్రామానికి చెందిన తాటిబోయిన చిన్నయ్య(50) గొర్రెలు మేపడానికి అడవికి వెళ్లగా, పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పలు చోట్ల విద్యుత్ స్తంబాలు, చెట్లు నేలకొరిగాయి. నెల్లూరులో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. అకాలవర్షాలు బాపట్ల జిల్లాను ముంచెత్తాయి. కొల్లూరు మండలం పరిధిలోని గాజుల్లంక గాలు మార్గం లో పిడుగుపడి మాతంగి సుప్రదీప్(23) మృతిచెందాడు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన అతడు స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా పిడుగుపడింది. సుప్రదీప్ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాంలోని కొమ్మమూరు కాలువ వద్ద గొర్రెల కాపరి గడ్డం బ్రహ్మయ్య (47)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అకాల వర్షం చిన్నగంజాం ప్రాంతంలో ఉప్పుసాగు చేసిన రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. చీరాలలో గాలివాన జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. చీరాల, బాపట్ల రూరల్ ప్రాంతాలలో వడగళ్ల వానతో మామిడితోటలకు భారీగా నష్టం వాటిల్లింది. అరటి, మొక్కజొన్నతోపాటు పొగాకు రైతులకు నష్టం జరిగింది. కొల్లూరు, చీరాలలో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
గోదావరిలో భారీ నష్టం
ఏలూరు జిల్లాలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు వరి పంట తడిసి ముద్దయింది. మామిడి కాయలు రాలిపోయాయి. అరటి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముసునూరు మండలం చెక్కపల్లిలో ఇంటిపై వెలగచెట్టు విరిగిపడడంతో మామిడి బాలగోవింద్ (12) మృతి చెందగా, అతని తండ్రి మారేశు తీవ్రంగా గాయపడ్డాడు. దెందులూరులో ఇంటిముందు విద్యుత్ సర్వీస్ వైరు తెగి పడటంతో విద్యుద్ఘాతానికి గురై తానికొండ జార్జి (53) మృతిచెందాడు. మండవల్లి మండలం దెయ్యంపాడులో సైదు గిరిబాబు (33) రొయ్యల చెరువు వద్ద మేత మేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈదురు గాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. జిల్లా వ్యాప్తంగా లక్ష టన్నుల ధాన్యం రాశుల్లోనే తడిచిపోయింది. దాదాపు 5వేల ఎకరాలలో వరిపంట నేలవారింది. మామిడి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. మొగుల్తూరు మండలంలో 950 ఎకరాల్లో మామిడిపంట దెబ్బతింది. ఈదురుగాలులతో 200 విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో జిల్లా అంతటా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరుణుడు ముంచెత్తాడు. రాజమహేంద్రవరంలో రహదారులన్నీ కాల్వలను తలపించాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ధాన్యం తడిసి ముద్దయింది. అమలాపురం పట్టణంతో పాటు కోనసీమ వ్యాప్తంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 3గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ఈదురుగాలులతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంటకూ భారీ నష్టం కలిగింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, వైర్లు తెగిపడ్డాయి. కాకినాడ నగరం జలమయమైంది.
విజయవాడలో భారీ వర్షం
ఎన్టీఆర్ జిల్లాలో గాలివాన దుమారం రేపింది. ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు హోరున వాన కురిసింది. జిల్లాలోని పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల్లో తప్ప మిగిలిన అన్ని మండలాల్లో వర్షం కురిసింది. విజయవాడ నగరంలో చెట్లు నేలకూలాయి. కొన్ని వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. రహదారులు వర్షం నీటితో నిండిపోయాయి. భక్తుల భద్రత దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానం ఘాట్‌రోడ్డును మూసివేశారు. జిల్లాలో మొత్తం 297.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మామిడి రైతులను వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఉన్న ధాన్యం తడిసిపోయింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. ధాన్యం, ఆరబెట్టిన మొక్కజొన్న తడిచింది. అరటి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి.
మరో 2 రోజులు ఇదే పరిస్థితి
రాష్ట్రంలో మరో రెండు రోజులు భిన్న వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అనకాపల్లి, ఉభయగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదివారం నంద్యాల జిల్లా గోనవరంలో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మంత్రుల సమీక్ష
అకాల వర్షాలపై హోం మంత్రి అనిత విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో మాటా ్లడి, ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయించారు. పంట నష్టం జరగకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
Updated Date - May 05 , 2025 | 05:48 AM