Andhra Progress: పారిశ్రామికీకరణతోనే రాష్ట్రాభివృద్ధి
ABN, Publish Date - May 02 , 2025 | 04:26 AM
పారిశ్రామిక అభివృద్ధే రాష్ట్ర పురోగతికి మార్గమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 50 ఎంఎస్‌ఎంఈ పార్కులతోపాటు పింఛన్లు, రైతు సంక్షేమం, తల్లికి వందనం వంటి పథకాలను ప్రకటించారు
50 ఎంఎస్‌ఎంఈ పార్కులప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారుచేస్తాం
ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత ఎదగాలి
ఎంఎ్‌సఎంఈ పార్కుల్లో ప్లగ్ అండ్ ప్లే విధానం
పరిశ్రమల స్థాపనకు ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి
దరఖాస్తులు పరిశీలించి జూన్‌లో కొత్త పింఛన్లు
రైతులకు మూడు విడతల్లో రూ.20 వేలు సాయం
‘తల్లికి వందనం’ కింద ప్రతి బిడ్డకూ రూ.15 వేలు
రాష్ట్రంలో 35 లక్షల బంగారు కుటుంబాల ఎంపిక
ఆదుకోవడానికి మార్గదర్శులు ముందుకు రావాలి
ఆత్మకూరు ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు పిలుపు
తెలుగుదేశం పార్టీ జెండాలో నాగలి, గుడిసె, చక్రం ఉంటా యి. నాగలి రైతులకు, గుడిసె పేదలకు, చక్రం కార్మికులకు సూచిక. రైతులు, పేదలు, కార్మికులకు ఎల్లప్పుడూ టీడీపీ అండగా నిలుస్తుంది.
- సీఎం చంద్రబాబు
నెల్లూరు, మే 1(ఆంధ్రజ్యోతి): కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. వారిని దృష్టిలో పెట్టుకొనే రూ.వేల కోట్ల ఆదాయం వదులుకొని ఇసుకను ఉచితం చేశామని తెలిపారు. రైతులు, పేదలు, కార్మికుల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, పార్టీ జెండాలోని గుర్తులు కూడా వారినే సూచిస్తాయని వివరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గురువారం ఆయన పర్యటించారు. ‘పేదల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరుపాలెం గిరిజన కాలనీలో సామాజిక పింఛన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అక్కడి గిరిజనులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం నారంపేట వద్ద ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించారు. అక్కడినుంచే రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 11 ఎంఎస్‌ఎంఈ పార్కులకు ప్రారంభోత్సవాలతోపాటు మరో 39 పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. ప్రజా వేదిక సాక్షిగా ఒక మార్గదర్శిని, ఒక బంగారు కుటుంబాన్ని అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, ముందుగా కార్మిక లోకానికి ‘మే డే’ శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్రంలో 88శాతం మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వారిలో 67శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వచ్చేదారిలో భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడాను. వీరందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది’ అని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఇసుక దొరక్క కార్మికులు ఉపాధి కోల్పోయారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వానికి ఆదాయం కంటే కార్మికుల సంక్షేమమే ముఖ్యమని, అందుకే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. కార్మికుల కోసం గుంటూరు, శ్రీసిటీల్లో 100 పడకల ఆసుపత్రి, కర్నూలులో 30 పడకల ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా ఏం చెప్పారంటే..
175 నియోజకవర్గాల్లోనూ...
పారిశ్రామికీకరణతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే మా లక్ష్యం. అందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఎంస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క నారంపేట పార్కులోనే రూ.250కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. తద్వారా 2,500 మంది ఉపాధి లభిస్తుంది. మొత్తం 20లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో సాగుతున్నాం. ప్రభుత్వంపై విశ్వాసంతో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. భవిష్యత్ ఏఐ రంగానిది. టాటా సంస్థ సహకారంతో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో డేటా హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. యువత ఆలోచనల్లో మార్పు రావాలి. పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో ప్లగ్ అండ్ ప్లే విధానం తీసుకొస్తున్నాం. ఇక్కడ షెడ్లు, విద్యుత్, నీటి వసతి కల్పిస్తాం. మార్కెటింగ్ కూడా ప్రభుత్వమే గైడ్ చేస్తుంది. ఆసక్తి ఉన్నవారు నేరుగా వచ్చి పరిశ్రమ స్థాపించుకోవచ్చు. పరిశ్రమల స్థాపనకు స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి. అప్పుడే ప్రజలు మళ్లీ ఓట్లు వేస్తారు. రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే మా లక్ష్యం. రైతులే వారి భూములను ఇండస్ట్రియల్ పార్కులుగా మార్చుకోవచ్చు. పదెకరాల్లోపు అయితే నానో పార్కు, 10-100 ఎకరాల్లోపు అయితే ఎంఎ్‌సఎంఈ పార్కు, 100 ఎకరాలపైన అయితే మేజర్ పార్కు ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు అవసరమైన అన్ని సహకారాలతో పాటు నిధులు కూడా అందిస్తాం. తద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం రైతులే తీసుకోవచ్చు. అభివృద్ధిని సహించలేని వ్యక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా 84లక్షల పింఛన్లు ఇస్తున్నాం.
ఏటా రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రతిపక్షాలైనా సరే ఇది నిజం కాదని చెబుతాయా..? సవాల్ విసురుతున్నా. జూన్ నుంచి కొత్త పింఛన్లు ఇస్తాం. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. రైతులకు కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తోంది. మేము మిగిలిన రూ.14 వేలను మూడు విడతల్లో అందిస్తాం. తల్లికి వందనం మీద అపోహలొద్దు. ప్రతీ బిడ్డకూ రూ.15వేల చొప్పున తల్లులకు అందిస్తాం. కోత ఉండదు. మెగా డీఎస్సీ పూర్తిచేసి బడులు తెరిచేలోపు టీచర్ల భర్తీ పూర్తి చేస్తాం.
మార్గదర్శులు ముందుకు రావాలి
పేదలను వృద్ధిలోకి తెచ్చేదుకు ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ అనే ఉన్నత ఆలోచనను అమల్లోకి తీసుకొచ్చాం. గతంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పిలుపునిచ్చినప్పుడు అనేక మంది ముందుకొచ్చారు. ఇప్పుడు కూడా మార్గదర్శులు ముందుకు రావాలి. రాష్ట్రంలో 35 లక్షల బంగారు కుటుంబాలను ఎంపిక చేశాం. వారికి మార్గదర్శులుగా ఉండేందుకు 5-10 లక్షల కుటుంబాలను ఎంపిక చేస్తున్నాం.
ఏ ఆధారమూ లేదు: జ్ఞానమ్మ
నా పేరు జ్ఞానమ్మ. మాది మర్రిపాడు మండలం. మేము యానాదులం. నాకు నలుగురు పిల్లలు. నా భర్త పనికి వెళ్తేనే మా కుటుంబానికి తిండి ఉంటుంది. లేకపోతే ఇంటింటికి వెళ్లి అడుక్కోవాలి. మాకు సొంత ఇల్లు లేదు. ఏ ఆధారమూ లేదు. ఎవరైనా అప్పు అడిగితే తిరిగి ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు. చాలాకాలం నుంచి ఊరిని కనిపెట్టుకొని ఉన్నాం. నా బిడ్డలను బాగా చదివించుకోవాలని ఉంది.
స్థలం ఇప్పించి.. ఇల్లు కట్టిస్తా..: సీఎం చంద్రబాబు
ఈ కుటుంబాన్ని చూస్తే బాధేస్తోంది. ఈ నలుగురు పిల్లలను ఆస్తిగా భావించి వారిని చదివిస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. జ్ఞానమ్మ కుటుంబానికి స్థలం ఇప్పించి ఇల్లు కట్టిస్తా. కరెంటు, గ్యాస్ కూడా ఇస్తా. నలుగురు పిల్లలపై రూ.లక్ష చొప్పున డిపాజిట్ చేస్తా. జ్ఞానమ్మ, ఆమె భర్తకు పని కల్పిస్తాం. మార్గదర్శి కూడా వారి పిల్లల మాదిరిగానే ఈ నలుగురు పిల్లలనూ పైకి తీసుకురావాలి.
ఈ కుటుంబానికి మార్గదర్శిగా ఉంటా: నాగేశ్వరరావు
నాపేరు నాగేశ్వరరావు. మాది మర్రిపాడు. చంద్రబాబు విజనరీ ఆలోచనలతో ఎదిగిన నేను.. జ్ఞానమ్మ కుటుంబానికి మార్గదర్శిగా నిలుస్తాను. ఆ కుటుంబానికి ప్రస్తుతం భరోసా కావాలి. ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చేస్తా. ఆ కుటుంబంలోని నలుగురు పిల్లలను చదివిస్తా. ఇంకా వారికి ఏమేం అవసరమో అన్నీ చేస్తా.
ఇవి కూడా చదవండి..
Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కేసిరెడ్డికి ఎదురుదెబ్బ
Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్
Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి
Updated Date - May 02 , 2025 | 04:26 AM