Secretariat Towers: రాజధానిపై విద్రోహ శక్తుల విద్వేషం
ABN, Publish Date - May 04 , 2025 | 04:53 AM
అమరావతిలో సచివాలయ టవర్ల శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన, శంకుస్థాపన కార్యక్రమం తర్వాత జరిగి, ఉద్దేశ్యపూర్వకంగా చేసిన చర్యగా భావిస్తున్నారు.
సచివాలయ టవర్ల శిలాఫలకం ధ్వంసం
పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మరుసటి రోజే దాడి
విజయవాడ, మే 3(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో సచివాలయం, హెచ్‌ఓడీ ఆఫీసు కాంప్లెక్స్ (సచివాలయ టవర్లు) శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంగరంగ వైభవంగా అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన జరిగిన మరుసటి రోజునే ఈ సంఘటన జరగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కడుపు మంటతో ఎవరు చేసిన పనో ఇప్పటి వరకు తెలియదు. అయితే ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ఘటనగానే తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018, డిసెంబరు 27న సీఎం చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు. అప్పటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు అప్పటి మంత్రులు, స్థానిక జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధుల పేర్లను ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం బోర్డులో రాయించారు. తెలుగు, ఇంగ్లిషులో రెండు బోర్డులను ఏర్పాటు చేశారు. ఇంగ్లిషు బోర్డును ప్రస్తుతం ధ్వంసం చేశారు. ఇనుప రాడ్డు లేదా సుత్తి వంటి దానితో గట్టిగా కొట్టి ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది. ఈ శిలాఫల కానికి రెండు వైపులా సచివాలయ టవర్ల నమూనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సచివాలయ టవర్ల శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Updated Date - May 04 , 2025 | 04:57 AM