Year Ender 2025: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..
ABN, Publish Date - Dec 24 , 2025 | 06:04 PM
ఈ సంవత్సరం జరిగిన పలు సంఘటనలు అంతర్జాతీయ సంబంధాలను, ప్రపంచ ఆర్థిక వ్యూహాలను ఓ మలుపు తిప్పాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవహరాలు, మారిన అధికార సమీకరణాలు, దీర్ఘకాలిక యుద్ధాలు ఈ ఏడాది ప్రపంచాన్ని పునర్నిర్మించాయని చెప్పక తప్పదు.
ప్రపంచ వ్యవహారాల్లో 2025 సంవత్సరాన్ని ఒక మలుపుగా భావించాల్సిందే. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవహరాలు, మారిన అధికార సమీకరణాలు, దీర్ఘకాలిక యుద్ధాలు ఈ ఏడాది ప్రపంచాన్ని పునర్నిర్మించాయని చెప్పక తప్పదు. ఈ సంవత్సరం జరిగిన పలు సంఘటనలు అంతర్జాతీయ సంబంధాలను, ప్రపంచ ఆర్థిక వ్యూహాలను ఓ మలుపు తిప్పాయి (2025 global events).
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం..
నవంబర్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జనవరిలో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అమెరికా దేశీయ, విదేశాంగ విధానంలో కీలక మార్పులు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ఆయన సుంకాల పేరుతో వాణిజ్య యుద్ధాలకు తెరతీశారు (trade tariffs 2025). ముఖ్యంగా భారత్‌పై ఆయన భారీ సుంకాలు విధించారు. దీంతో భారత్, అమెరికా మధ్య దూరం పెరిగింది.
భారత్-పాకిస్థాన్ వివాదం
ఈ ఏడాది ఏప్రిల్ 22న, జమ్ము, కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని చంపారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలు ఈ దాడికి పాల్పడ్డాయి. దీనికి ప్రతిస్పందనగా, భారత సాయుధ దళాలు మే 7 ఉదయం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. ఆ తర్వాత భారత్, పాక్ మధ్య కాల్పుల ఒప్పందం జరిగినప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి (wars and geopolitics 2025).
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..
2022లో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈ ఏడాది మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆ ప్రభావం ప్రపంచంలోని పలు ఇతర దేశాలపై కూడా తీవ్రంగా పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో శాంతి ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఇంకా కార్యరూపం దాల్చడం లేదు.
చైనాతో దోస్తీ..
అమెరికా అనుసరిస్తున్న ఆర్థిక వ్యూహాల కారణంగా రష్యాకు మరింత చేరువైన భారత్.. చైనాతో దోస్తీకి కూడా సిద్ధపడింది. ప్రధాని మోదీ బీజింగ్ చేరుకుని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే కాస్త మెరగయ్యాయి. ఇక, రష్యాతో భారత్ బంధం మరింత బలోపేతం అయింది (world affairs year ender).
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు..
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ తీవ్ర ఆటుపోట్లకు కారణంగా మారింది. ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. టెహ్రాన్ కూడా అదే విధంగా స్పందించింది. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు దిగింది. చివరకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. అలాగే అమెరికా జోక్యంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కూడా శాంతి ఒప్పందం కుదిరింది (international crisis 2025).
నేపాల్ ఆందోళనలు..
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. సోషల్ మీడియా నిషేధం మాజీ ప్రధాన మంత్రి కేపీ ఓలి ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసింది. జనరేషన్ జెడ్ చేసిన ఈ ఆందోళనలు ఆ దేశ ముఖ చిత్రాన్నే మార్చివేశాయి.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మొసలికి ఎంత కోపం వచ్చిందో చూడండి.. ఒళ్లు జలధరించే వీడియో..
ఛీ.. ఛీ.. ఈ బిర్యానీ తిన్నవారందరూ హాస్పిటల్‌కు పరిగెత్తాల్సిందే..
Updated Date - Dec 24 , 2025 | 06:04 PM