Vantalu: పెసరపప్పుతో చింతపండులేకుండా పెసరకట్టు వండుకోవటమే శ్రేయస్కరం..
ABN, Publish Date - Dec 28 , 2025 | 11:56 AM
పెసరపప్పుతో ఉత్తపప్పు, పప్పు కూరలు, పచ్చడి, పెసరట్లు, పులుసు, సాంబారు, గారెలు, వడియాలు, వడలు, అప్ప డాలు, పూర్ణాలు, అప్పాలు, పాయసం, హల్వా ఇవన్నీ వండుకునే వాళ్లు. డైటింగ్ చేసేవాళ్లకి పెసరపప్పే అనుకూలంగా ఉంటుంది.
- పోషణనిచ్చే పెసరకట్టు..
ప్రతిరోజూ అన్నంలో తిని తీరాల్సింది పెసరపప్పే! సంతోషాన్ని కలిగిస్తాయి కాబట్టి, సంస్కృతంలో పెసరని ముద్గ అంటారు. పప్పు ధాన్యాలన్నింటిలోనూ తేలికగా అరిగేవి, రుచికరమైనవి, ఎక్కువ పోషకాలు కలిగినవి, శరీర నిర్మాణానికి అత్యధికంగా సహకరించేవీ పెసలే! పప్పన్నం అంటే తెలుగువారికి పెసరపప్పు అన్నమే! ఇటీవలి కాలంలో పప్పు వండుకోవటానికి కందిపప్పు మీద, పిండివంటల కోసం శనగపిండి మీద ఆధారపడి పెసల వాడకాన్ని మరిచిపోతున్నాం.
దక్షిణాదిలో ఇది తొలి పంట! మూలద్రావిడ భాషలో (డిఇడిఆర్-3941) పయరు శబ్దం తెలుగులో పెసరగా మారింది. ‘పయ’ అంటే ఉత్పత్తి అయినదనే అర్థంలో ఈ పదం తమిళంలో మిగిలి ఉంది. తెలుగులో పైరు అయ్యింది. పైరు అంటే మొదట్లో పెసర చేనే! ఇప్పుడు అన్ని పంట చేలనీ పైరు అనే అంటున్నాం!
పెసరపప్పుతో ఉత్తపప్పు, పప్పు కూరలు, పచ్చడి, పెసరట్లు, పులుసు, సాంబారు, గారెలు, వడియాలు, వడలు, అప్ప డాలు, పూర్ణాలు, అప్పాలు, పాయసం, హల్వా ఇవన్నీ వండుకునే వాళ్లు. డైటింగ్ చేసేవాళ్లకి పెసరపప్పే అనుకూలంగా ఉంటుంది. ఇటీవలి పరిశోధనలు రక్తంలో చక్కెర స్థాయి తగ్గించటానికి పెసరపప్పు దోహదపడ్తోందని నిరూపించాయి.
భోజన కుతూహలం అనే పాకశాస్త్ర గ్రంథంలో సారాణీ అంటే, ఫుడ్ ఎక్స్‌ట్రాక్ట్స్ గురించి ఒక అధ్యాయం ఉంది ‘‘బల్యం చాఢకీసూప ముక్తమితిచ’’ చాఢకీ - పెసరకట్టు అమిత బలకరమైంది అనే వాగ్భటుని సూత్రాన్ని ఉదహరించారు.
కట్టు అంటే చింతపండు వెయ్యని పప్పు చారు. పప్పు చారులో పెసరపప్పుతో పాటు దండిగా కూరగాయ ముక్కలు కలిపి అల్లం, మిరియాలు తక్కిన సుగంధ ద్రవ్యాలు కూడా చేర్చి, ఎక్కువ నీళ్లు పోసి సగానికి మరిగేదాకా ఉడికిస్తారు. అలా ఉడికించినందువలన కూర, పప్పుల్లోని సారం అంతా పప్పుచారులోకి దిగుతుంది. దీనిలో పులుపు కోసం దానిమ్మ గింజల గుజ్జు కలుపుకోవాలన్నాడు వాగ్భటుడు. ఇది గాయాలు, ఆపరేషన్లు, ఒళ్ళు కాలిన వారికి అందిస్తే త్వరగా కోలుకుంటారన్నాడు. రాత్రి పూట తేలికగా తినాలను కునేవారు కొద్దిగా అన్నం కలుపుకుని ఈ చాఢకీ పెసరకట్టు తింటే కడుపు నిండిపోతుంది. చపాతీ పుల్కాలు ఇందులో నంజుకోవచ్చు. ఈ పెసరకట్టుని మిక్సీ పట్టిస్తే చిక్కని సూపు అవుతుంది. 1-2 గ్లాసులు తాగితే కడుపు నిండుతుంది.
స్థూలకాయానికి విరుగుడు పెసరే! మినుము, కంది స్థూలకాయాన్ని పెంచుతాయి. ఉలవలు తగ్గిస్తాయి. కానీ, వేడి చేస్తాయి.
భోజన కుతూహలం పెసరకట్టుని ముద్గయూషం అని పేర్కొంది. ఇది తేలికగా అరిగేదని, చలవ చేస్తుందని, పైత్యాన్ని తగ్గిస్తుందని, వేడివలన కలిగే వ్యాధుల్ని నివారిస్తుందని, రక్త దోషాలను హరించి రక్త వృద్థికి తోడ్పడుతుందని పేర్కొంది. ఆర్చుకు పోయి కృశించి పోతున్న పిల్లలకు పెసరకట్టు పోషణనిచ్చి పుష్టిగా ఎదిగేలా చేస్తుంది.
పెసరపప్పు - పుళ్ళకు చీము పట్టేలా చేస్తుందని, ఆపరేషన్లు అయినవారు తినకూడదనీ, గ్యాసు, ఉబ్బరం కలిగిస్తుందనీ, షుగరు రోగులకు మంచిదికాదనీ కొన్ని అపోహలున్నాయి. పెసరపప్పు చీముని తగ్గించి, పుళ్ళను గాయాలను మాన్పేందుకు సహకరిస్తుందని, షుగర్ని నివారిస్తుందని, తేలికగా అరుగుతుందని, పైత్యాన్ని ఎసిడిటీని తగ్గిస్తుందనీ శాస్త్ర ప్రమాణాలు చెప్తున్నాయి. పెసరపప్పుతో చింతపండులేకుండా పెసరకట్టు వండుకోవటమే శ్రేయస్కరం.
కూరగాయలతో పెసరకట్టు కాచుకోవటం వలన చాలినంత ఫైబరు, పోషకాలు, ప్రోటీన్లు శరీరానికి సరిపడ అందుతాయి. శరీర నిర్మాణానికి, ధాతువృద్ధికి, జీర్ణాశయ వ్యవస్థ బలసంపన్నతకూ పెసరకట్టు తోడ్పడుతుంది! అందుకని భోజనంలో రోజూ పెసరకట్టు ఉండేలా చూసుకోండి.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
కావలసిన పదార్థాలు:
జొన్న పిండి-ఒకటిన్నర కప్పు, గోధుమ పిండి - ముప్పావు కప్పు, పాలకూర తరుగు - నాలుగు స్పూన్లు, మెంతి కూర- నాలుగు స్పూన్లు, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, క్యారెట్ తురుము-నాలుగు స్పూన్లు, జీలకర్ర పొడి - స్పూను, పసుపు - అర స్పూను, గరం మసాలా - అర స్పూను, నువ్వులు - రెండు స్పూన్లు, ఆలుగడ్డ(ఉడికించినది) - ఒకటి, ఉప్పు- ముప్పావు స్పూను, పెరుగు - అర కప్పు, నీళ్లు, నెయ్యి - తగినంత.
తయారుచేసే విధానం: ఓ పెద్ద గిన్నెలో అన్ని పదార్థాలను వేసి, కాస్త నీళ్లు కలిపి పిండిముద్దలా చేసుకోవాలి. రొట్టెలా వత్తుకుని పెనం మీద అటూ ఇటూ కాస్త నెయ్యి వేసి కాలిస్తే జొన్న పరాటా తయారు.
రాగి చాక్లెట్ ప్యాన్‌కేక్
కావలసిన పదార్థాలు: రాగి పిండి - కప్పు, కోకో పౌడర్ - రెండు స్పూన్లు, చక్కెర - రెండు స్పూన్లు, బేకింగ్ పౌడర్ - స్పూను, ఉప్పు - కాస్త , పాలు - కప్పు, వెనీలా ఎసెన్స్ - కాస్త, బటర్ - రెండు స్పూన్లు, తేనె - రెండు స్పూన్లు, తాజా పళ్లు - కొన్ని.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో రాగి, కొకొ పౌడర్, చక్కెర, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కలపాలి. మరో గిన్నెలో పాలు, బటర్, వెనీలా ఎసెన్స్‌ను బాగా కలపాలి. ఆ తరవాత ఈ రెండు మిశ్రమాల్ని ఓ గిన్నెలో వేసుకుని గిలక్కొట్టాలి. పది నిమిషాలు మూతమూసి పక్కన పెట్టుకోవాలి. పెనం మీద కాస్త బటర్ రాసి ఓ గరిటె పిండిని వేసి అటూ ఇటూ కాలిస్తే ప్యాన్‌కేక్‌లు తయారు. తేనె, తాజా పళ్లతో వీటిని ఆరగిస్తే రుచిగా ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!
ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 28 , 2025 | 11:56 AM