Share News

Odisha Police: ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:46 AM

మరింత మంది మావోయిస్టులను అరెస్టు చేసేందుకు ఒడిశా పోలీసులు కంధమాల్‌ జిల్లా అడవుల్లో నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్లను ముమ్మరం చేశారు.

Odisha Police: ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు

  • ప్రజలకు ఒడిశా పోలీసుల సూచన

  • ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో గాయపడిన నక్సల్స్‌ కోసం అడవుల్లో ముమ్మరంగా గాలింపు

భువనేశ్వర్‌/ఫుల్బానీ, డిసెంబరు 27: మరింత మంది మావోయిస్టులను అరెస్టు చేసేందుకు ఒడిశా పోలీసులు కంధమాల్‌ జిల్లా అడవుల్లో నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్లను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో గాయపడి, ఆ ప్రదేశం నుంచి పారిపోయిన మావోయిస్టులకు ఎవరూ ఆశ్రయం ఇవ్వొద్దని అదనపు డీజీపీ (యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌) సంజీవ్‌ పాండా ప్రజలను కోరారు. కంధమాల్‌ జిల్లాలో గురువారం భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. వీరిలో తలపై రూ.1.2 కోట్ల రివార్డు ఉన్న అగ్రనేత గణేశ్‌ ఉయికే (69) అలియాస్‌ పాకా హనుమంతు కూడా ఉన్నారు. ఏడీజీపీ సంజీవ్‌ పాండా మాట్లాడుతూ గంజాం జిల్లా సరిహద్దులోని ఛకపాడా పోలీసుస్టేషన్‌లో పరిధిలో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్‌ ఆపరేషన్లు చేపట్టాయని తెలిపారు. గురువారం నాటి ఆపరేషన్లలో గాయపడి, కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి పారిపోయిన మరింత మంది మావోయిస్టులను అరెస్టు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘గాయపడిన అలాంటి వ్యక్తులకు ఎవరూ ఆశ్రయం ఇవ్వొద్దని స్థానిక ప్రజలను కోరుతున్నాం. వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులు అయి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో, మావోయిస్టులు దాగి ఉంటారని అనుమానిస్తున్న ప్రాంతాల్లో ఒడిశా ఎస్‌వోజీ, సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌, డీవీఎఫ్‌ ఉమ్మడి బలగాలను మోహరించామని వెల్లడించారు.

Updated Date - Dec 28 , 2025 | 06:48 AM