Uttam: యాసంగి సన్నాలకూ రూ.500 బోనస్
ABN, Publish Date - May 04 , 2025 | 04:07 AM
యాసంగిలో పండిన సన్న రకం ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని, వానాకాలం తరహాలోనే ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్నీ కొంటాం
రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ఆరు లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం: ఉత్తమ్
వరంగల్, మే 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యాసంగిలో పండిన సన్న రకం ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని, వానాకాలం తరహాలోనే ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌస్ వద్ద మోటర్లను, ధర్మసాగర్ వద్ద దేవాదుల టన్నెల్ పనులు, వరంగల్ భద్రాకాళి చెరువు మట్టి పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, పౌరసరఫరాలశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా తెలంగాణలో 2024-25లో ఖరీ్‌ఫలో 153 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 125 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్పారు. ఒక ఏడాదిలో ఇంతగా ధాన్యం దిగుబడి రావటం రికార్డు అని పేర్కొన్నారు. ఏటా సుమారు రూ.16వేల కోట్లతో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించి ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో రేషన్‌కార్డుల్లో తొలిగింపులు చేశారని కానీ, కొత్తగా కార్డులిచ్చింది లేదన్నారు. రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 2.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, మిగిలిపోయిన భూసేకరణతో పాటు ఇతర పనులన్నీ పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం సమ్మక్క బ్యారేజీకి ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం నుంచి ఎన్‌వోసీ తీసుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే అక్కడి నుంచి ఎన్‌వోసీ వస్తుందని తెలిపారు.ప్రతి ఏటా రూ.23 కోట్లు ఖర్చు చేస్తూ, కొత్తగా ఐదారు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 04:07 AM