Tummala: రైతులు ఆనందంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలకు కళ్లుమంట!
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:08 AM
రైతుల్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని, వారి కళ్లు మండుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాటలా?
రైతుబంధు సొమ్మును ఎప్పుడైనా రెండు నెలల్లోపు వేశారా?
‘బంధు’ పేరుతో ఎగ్గొట్టిన పథకాలు ఎన్ని?
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రైతుల్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని, వారి కళ్లు మండుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోంటే బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు రైతు సమస్యలపై చర్చించాలని అంటుంటే.. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి తుమ్మల ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విఽధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలో లక్షా మూడు వేల కోట్ల రూపాయలను రైతు సంక్షేమానికి ఖర్చు చేసి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో తాము అధికారం చేపట్టిన తర్వాత రైతులకు దిగుబడులు పెరిగాయని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు అందుతున్నాయని చెప్పారు.
అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమాన్ని పట్టించుకోని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు వ్యవసా యం, రైతులు, ఎరువులు,నీళ్లు అని మాట్లాడుతుంటే.. వారంతా నిస్పృహలో ఉన్నారనే విషయం తెలంగాణ సమాజం అర్థం చేసుకుందన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్రప్రభుత్వం ఒకేసారి రూ.21వేల కోట్లు రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసిందని తుమ్మల తెలిపారు. బీఆర్‌ఎస్ ఎగ్గొట్టిన రైతుబంధుతోపాటు రెండో పంట కాలాల్లో రూ.13,500 కోట్లు రైతు భరోసా పథకం లో చెల్లించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వం 9 రోజుల్లో రూ.9000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసిందన్నారు. దీంతో తమ రాజకీయ జీవితానికి ఎక్కడ చరమగీతం పడుతుందోనన్న భయంతో బీఆర్‌ఎస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ‘‘మీరు అరకొరగా చేసిన రుణమాఫీతో రైతులకు ఏమైనా లాభం కలిగిందా? అసలు రుణమాఫీ అయ్యిందా? రైతుబంధు సొమ్మును ఎప్పుడైనా రెండు నెలల్లోపు వేశారా? రైతుబంధు పేరుతో ఎగ్గొట్టిన పథకాలు ఎన్ని? ఐదేండ్లలో పంట నష్టపరిహారం ఎప్పుడైనా చెల్లించారా? కేంద్ర ప్రభుత్వ పథకాలకు వాటా ధనం చెల్లించకుండా నిధులు అడ్డుకున్నది ఎవరు? యాంత్రీకరణ పథకానికి తూట్లు పొడిచింది ఎవరు? మైక్రో ఇరిగేషన్ పథకానికి చరమగీతం పాడింది ఎవరు? ఏదైనా పంటలకు గిట్టుబాటు ధర కల్పించారా ? వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అన్నది ఎవరు? చివరికి పచ్చి రొట్ట విత్తనాల సబ్సిడీ కూడా బకాయిలు పెట్టింది ఎవరు?’’ అని బీఆర్‌ఎస్ నేతలను తుమ్మల ప్రశ్నించారు.
1.9లక్షల టన్నుల ఎరువుల లోటు
రాష్ట్రంలో 1.9లక్షల టన్నుల ఎరువుల లోటు ఉంద ని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతులు వానాకాలంలో 53 లక్షల బస్తాల యూరియా, 20లక్షల డీఏపీ, 45 లక్షల బస్తాల కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేశారని తెలిపారు. మరో 67లక్షల బస్తాల యూరియా, 8లక్షల బస్తాల డీఏపీ, 66లక్షల బస్తాల కాంప్లెక్స్ ఎరువులు, 6లక్షల ఎంఓపీ బస్తాలు, 4లక్షల ఎస్‌ఎస్పీ బస్తాలు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇదికాక, ప్రతిరోజు 2-3లక్షల బస్తాల ఎరువులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
Updated Date - Jul 07 , 2025 | 02:08 AM