investigation: హెచ్‌సీఏ కుంభకోణంలో.. కవిత, కేటీఆర్ పాత్ర..!
ABN, Publish Date - Jul 18 , 2025 | 04:43 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో జరిగిన కుంభకోణం వెనుక ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్ పాత్ర ఉందని.. వీరిపై విచారణ జరపాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ధరమ్ గురవారెడ్డి సీఐడీ, ఈడీకి ఫిర్యాదు చేశారు.
కేటీఆర్ బావమరిదికి కాంట్రాక్టులు
సీఐడీ, ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు అందిన 600 కోట్లపైనా విచారణకు డిమాండ్
ఫిర్యాదులో అజహర్‌తో పాటు పలువురి పేర్లు
జగన్‌మోహన్‌రావుపై ఈడీ కేసు నమోదు
ఫోర్జరీ స్కెచ్ వేసిందెవరు?
బీఆర్‌ఎస్ పెద్దలతో మీ సంబంధాలేమిటీ?
జగన్ మోహన్‌రావుకు సీఐడీ ప్రశ్నలు
ఇన్‌స్పెక్టర్ సమాచారంతో దేవరాజ్ పరారీ!
ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు?
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో జరిగిన కుంభకోణం వెనుక ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్ పాత్ర ఉందని.. వీరిపై విచారణ జరపాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ధరమ్ గురవారెడ్డి సీఐడీ, ఈడీకి ఫిర్యాదు చేశారు. గురువారం ఈ మేరకు రెండు దర్యాప్తు సంస్థలకు లిఖితపూర్వక ఫిర్యాదు ప్రతులను అందజేశారు. క్రికెట్ అభివృద్ధి కోసం గత పదేళ్లలో బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు అందిన రూ.600 కోట్ల నిధుల్లో సింహభాగం దుర్వినియోగం అయ్యాయని, దీనిపైనా విచారణ జరపాలని ఆ ఫిర్యాదులో కోరారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయిన వెంటనే జగన్ మోహన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తన విజయం వెనుక కవిత, కేటీఆర్ ఉన్నారని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. అందుకు ఆధారాలుగా మీడియా క్లిప్పింగ్‌లను ఫిర్యాదుకు జత చేశారు. జగన్ మోహన్‌రావు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఐపీఎల్ టికెట్ల అమ్మకాల కాంట్రాక్టును కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్‌నౌ డాట్ కామ్, మేరా ఈవెంట్ డాట్ కామ్‌కు కట్టబెట్టారని, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఫుడ్ కాంట్రాక్టును కేటీఆర్, కవితకు బంధువైన సురభి క్యాటరర్స్ సంస్థకు ఇచ్చారని, దీని యజమాని జగన్ మోహన్ రావుకు సమీప బంధువని పేర్కొన్నారు. ట్రావెల్, హోటళ్ల బుకింగ్ కాంట్రాక్టులు సైతం ఈ బ్యాచ్‌కే దక్కాయని వివరించారు. బీసీసీఐ నుంచి అందిన రూ.600 కోట్లలో సింహభాగం దుర్వినియోగం అయ్యాయని పేర్కొంటూ.. అప్పటి అధ్యక్షుడు అజారుద్దీన్, సభ్యులు జాన్ మనోజ్, ఆర్.విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్‌పైనా విచారణ చేపట్టాలని కోరారు. తాము అందజేస్తున్న ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులను.. ఇప్పటి వరకు జరిగిన విచారణకు జత చేసి, లోతుగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఫోర్జరీపై ప్రశ్నల వర్షం
హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టు అయిన జగన్‌మోహన్‌రావు బృందాన్ని సీఐడీ అధికారులు గురువారం కస్టడీకి తీసుకున్నారు. శ్రీచక్ర క్లబ్ సభ్యుడినంటూ జగన్‌మోహన్‌రావు సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు, బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల దుర్వినియోగం తదితర అంశాలకు సంబంధించి జగన్ మోహన్ రావును సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఎవరి అండదండలతో మీరు హెచ్‌సీఏ అధ్యక్షుడు అయ్యారు? ఫోర్జరీ స్కెచ్ వెనక ఉన్నదెవరు? మీ వెనక బీఆర్‌ఎస్ పెద్దలు ఎవరున్నారు? అనే కోణంలో విచారించినట్లు తెలుస్తోంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురవారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇప్పటి వరకు జగన్‌మోహన్ రావుతో పాటు శ్రీనివాసరావు, సునీల్ కాంతే, రాజేందర్ యాదవ్, కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే..! వీరిని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును సీఐడీ కోరగా.. ఆరు రోజుల విచారణకు అనుమతి వచ్చింది. దీంతో.. గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ఐదుగురు నిందితులను సీఐడీ అదుపులోకి తీసుకుంది. హెచ్‌సీఏ నిబంధనలకు విరుద్ధంగా.. టెండర్లు లేకుండా రూ.కోటికి పైగా విలువ చేసే క్రికెట్ బంతులను ఎందుకు కొనుగోలు చేశారు? వాటి వివరాలను రిజిస్టర్‌లో ఎందుకు నమోదు చేయలేదు? క్రికెట్ బంతులు అందకుండానే డబ్బులను చెల్లించారా? అని వీరిని సీఐడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ‘‘హైదరాబాద్ సన్ రైజర్స్ నుంచి వేల టికెట్లు ఎందుకు అడిగారు? వాటని ఎవరి ద్వారా అమ్మించాలని అనుకున్నారు? మీరే స్వయంగా విక్రయిద్దామనుకున్నారా?’’ అని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. పలు ప్రశ్నలకు జగన్‌మోహన్ రావు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ మాట్లాడినా.. ‘‘లేదు.. తెలియదు.. గుర్తులేదు’’ అనే సమాధానాలు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం.
ఈడీ కేసు నమోదు
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు సహా.. ఐదుగురిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో హెచ్‌సీఏకి సంబంధించిన కేసు ఉన్నందున.. ఆ కేసుకే తాజా నిందితుల వివరాలను ఈడీ అధికారులు జోడించి కోర్టుకు వివరాలను అందజేశారు. గతంలో హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై అజారుద్దీన్ తదితరులపై కే సు నమోదైన విషయం తెలిసిందే..! అప్పట్లో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. తాజాగా సీఐడీ కేసు నేపథ్యంలో జగన్‌మోహన్ రావు, శ్రీనివాసరావు, సునీల్ కాంతే, రాజేందర్ యాదవ్, కవిత పేర్లను ఈడీ అధికారులు ఈసీఐఆర్‌లో చేర్చారు. ప్రస్తుతం జగన్‌మోహన్ రావు బృందం సీఐడీ కస్టడీలో ఉన్నారు. ఆ కస్టడీ ముగిసిన వెంటనే.. ఈడీ అధికారులు వీరిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతిని కోరనున్నట్లు తెలిసింది. ఈడీ వీరిని మనీలాండరింగ్ కోణంలో విచారించనుంది.
దేవరాజ్ పరారీ.. ఇన్‌స్పెక్టర్‌పై వేటు!!
ఉప్పల్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): హైసీఏ కేసులో మరో నిందితుడు, హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే..! ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయితే.. ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే దేవరాజ్ పారిపోయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దేవరాజ్ కాల్‌లిస్టు ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. దాంతో.. ఎలక్షన్‌రెడ్డిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. అయితే.. ఈ నెల 9న ఉప్పల్ స్టేడియం పక్కనే స్థలం వివాదం విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధర్నా నిర్వహించారు. గేట్లు మూసివేస్తూ గోడను నిర్మించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో స్టేడియం తరఫున ఎవరూ రాలేదని పేర్కొంటూ.. హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్‌కు ఫోన్ చేసినట్లు ఎలక్షన్‌రెడ్డి పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే.. ఇన్‌స్పెక్టర్ ఫోన్‌చేయగానే దేవరాజ్ ఫోన్ స్విచ్చాఫ్ అవ్వడం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం యాదృచ్ఛికమా? లేక ఉద్దేశపూర్వకమా? అనేది తేలాల్సి ఉంది. అప్పటి వరకు ఎలక్షన్‌రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే.. రాచకొండ కమిషనర్ కార్యాలయం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కాగా.. ఆర్నెల్ల క్రితం ఎస్సై శంకర్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డిని వారం రోజుల పాటు రిజర్వ్‌లో పెట్టారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 04:43 AM