High Court: ఆ విద్యార్థులను అనుమతించండి
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:50 AM
నీట్ పరీక్షకు ముందు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన పై తాజా విద్యా సంవత్సరం 2025కు సంబంధించిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదవకున్నా వారిని దరఖాస్తు చేసుకోనివ్వండి: హైకోర్టు
హైదరాబాద్ జూలై 23 (ఆంధ్రజ్యోతి): నీట్ పరీక్షకు ముందు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన పై తాజా విద్యా సంవత్సరం 2025కు సంబంధించిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కోర్టుకు వచ్చిన అభ్యర్థులను ఎంబీబీఎస్ బీడీఎస్ వంటి కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత విద్యా సంవత్సరం సైతం.. ఈ నిబంధనను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అప్పట్లో హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నాలుగేళ్ల నిబంధనను కొట్టేసి, నివాస ధ్రువీకరణ పత్రం ఉన్న అభ్యర్థులందర్నీ స్థానికులుగానే గుర్తించి అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. హైకోర్టు తీర్పు మేరకు.. నివాస ధ్రువీకరణ పత్రం ఉన్న 134 మంది అభ్యర్థుల దరఖాస్తులను (వరుసగా నాలుగేళ్లు చదవకపోయినా) స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఈ క్రమంలోనే.. తాజా విద్యా సంవత్సరానికి సంబంధించి సైతం హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై.. చీఫ్ జస్టిస్ ఏకేసింగ్, జస్టిస్ షాంకోసితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టులో కేసు పరిస్థితి ఏ దశలో ఉందో చెప్పాలని కోరింది. ఆగస్టు మొదటి వారంలో సుప్రీంకోర్టు ఎదుట ఈ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టుకు వచ్చిన అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించాలంటూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. నివాస ధ్రువీకరణ పత్రం ఉన్న అభ్యర్థులందరూ స్థానికులే అని హైకోర్టు ఇచ్చిన తీర్పునే పాటించాలని పేర్కొంది. నీట్ పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదవలేదనే కారణంతో దరఖాస్తులు తిరస్కరించరాదని స్పష్టం చేసింది. అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులు, అడ్మిషన్ల ప్రక్రియ తుదితీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 24 , 2025 | 02:50 AM