ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

ABN, Publish Date - May 15 , 2025 | 04:22 AM

ధరణి పోర్టల్‌లో విలువైన భూముల రికార్డులు తారుమారు చేశారని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సిద్ధమైంది.

  • కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు

  • నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు

  • ధరణితో విలువైన భూముల రికార్డులు

  • తారుమారయ్యాయని ఆరోపణలు

  • గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 15 వేల ఎకరాల సర్కార్‌ భూములు మాయం

  • అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ భూములూ..

  • 2014 నుంచి 2023 డిసెంబరు వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో విలువైన భూముల రికార్డులు తారుమారు చేశారని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సిద్ధమైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్‌ బాధ్యతలను అప్పగిచేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు కూడా రానున్నాయి. 2024 డిసెంబరు 20న సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ నిర్వహణలో లోపాలను, టెండర్ల కేటాయింపులో జరిగిన అవకతవకలను ప్రస్తావించారు. భూ రికార్డుల్లో అక్రమాలు జరిగాయా లేదా? అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తామని, నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. దేశీయ సంస్థలతోపాటు విదేశీ సంస్థలు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహణకు ముందుకొచ్చాయి. దేశీయంగా 4 సంస్థలు ఆసక్తి చూపగా కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీ వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. గతంలో టెర్రాసిస్‌ అనే విదేశీ సంస్థ ధరణి పోర్టల్‌ నిర్వహణ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. స్వదేశీ సంస్థకే ఆడిట్‌ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్‌ బాధ్యతలను అప్పగించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ధరణి పోర్టల్‌ నిర్వహణ విదేశీ సంస్థకు అప్పగించడం వల్ల భూ యజమానుల గోప్యతకు భంగం వాటిల్లిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది అధికారులు, ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా పోర్టల్‌ను యాక్సెస్‌ చేసి భూ రికార్డులను మార్చినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించింది. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే సుమా రు 15 వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ధరణి పోర్టల్‌ ద్వారా ఆక్రమించారని ప్రభు త్వం వెల్లడించింది. ఈ భూముల విలు వ రూ.లక్ష కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేసింది. పోర్టల్‌లో అనేక లోపాలున్నట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌ రద్దు చేసి ఆ స్థానంలో భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.


లక్షల ఎకరాల రికార్డుల తారుమారు!

2014 నుంచి 2023 మధ్య కాలంలో అటవీ భూము లు, దేవాదాయ, వక్ఫ్‌, భూదాన్‌ భూములకు సంబంధించి లక్షల ఎకరాల రికార్డులు తారుమారు అయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 2014 ముందు ఉన్న భూముల వివరాలకు, 2023 తరువాత భూముల వివరాలకు పొంతన లేకుండా పోయిందనేది ప్రభుత్వ వాదన. 2014కి ముందు రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద నిషేధిత భూములకు సంబంధించి ఉన్న జాబితాలను తీసుకుని.. అదే సర్వే నంబర్లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసి.. ఎన్ని ఎకరాలు జాబితా నుంచి తొలగించారనే వివరాలను బయట పెడతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఏడాది పాలన విజయోత్సవాల సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణలో 2017 సెప్టెంబరు నుంచి 2018 జనవరి వరకు భూరికార్డుల నవీకరణ జరిగింది. ఆ సమయంలో అటవీశాఖ లెక్కల ప్రకారం 66.67 లక్షల ఎకరాల అటవీ భూమి ఉండాల్సి ఉంటే.. లెక్కల్లో 43.93 లక్షల ఎకరాలే ఉన్నట్లు తేలింది. 22.74 లక్షల ఎకరాల భూములు మాయమయ్యాయని అటవీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయమై ఆనాటి ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. అటవీ సరిహద్దు వివాదాల కారణంగా 2.18 లక్షల ఎకరాల భూమికి ఎలకా్ట్రనిక్‌ టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా ప్రభుత్వం.. వాటిని వివాదాస్పద భూముల జాబితాలో చేర్చింది. అటవీ శాఖ తాను కోల్పోయిన భూములు 22 లక్షల ఎకరాలు అని చెబుతుండగా.. కేవలం 2.18 లక్షల ఎకరాలే అభ్యంతర జాబితాలో ఉన్నాయి. ఈ భూములపై సమగ్ర సర్వే చేయాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. 2018 జనవరి 1 నుంచి 31వ తేదీ దాకా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించింది. జయశంకర్‌ భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, కొమురంభీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, భద్రాద్రికొత్తగూడెం తదితర జిల్లాల్లోకి సర్వేయర్లతో కూడిన ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు వెళ్లాయి. అయితే ప్రభుత్వం 2.18 లక్షల ఎకరాల వివాదాలు తేల్చి.. ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఎలకా్ట్రనిక్‌ టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూశాఖ చెబుతుండగా.. అటవీ శాఖ మాత్రం 22 లక్షల ఎకరాల భూములను తమ శాఖ జాబితాలో చేర్చాలని కోరుతోంది. సర్వే అనంతరం పరిశీలించగా 42.53 లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు తేలింది. ఏకంగా 24.14 లక్షల ఎకరాల భూమి మాయమయిందని 2018లో అప్పటి పీసీసీఎఫ్‌ ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాశారు. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2023లో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన నాటికి భూరికార్డుల్లో జరిగిన అక్రమాలపై శాస్త్రీయంగా లోతైన అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


దేవుడి భూములూ మాయం!

తెలంగాణలో 12 వేల దేవాలయాలుండగా.. గుడుల పేరిట 84,195 ఎకరాల భూమి ఉండేది. 2017-18 భూరికార్డుల నవీకరణ అనంతరం 10 వేల ఎకరాలు తగ్గి.. 74,128.07 ఎకరాలుగా మిగిలింది. ధరణిలోకి ఎక్కించే సమయానికి 49 వేల ఎకరాలకు చేరింది. సుమారు 25 వేల ఎకరాల లెక్కలు తేలాల్సిఉంది. రికార్డు నవీకరణకు ముందు తెలంగాణలో 74 వేల ఎకరాల వక్ఫ్‌భూములుం డగా.. కేవలం 45,564 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. 28436 ఎకరాల భూమి రికార్డుల నుంచి మాయమై.. పాస్‌పుస్తకాల్లోకి ఎక్కి, పట్టాభూమిగా మారిపోయిందని తేలింది. లోపభూయిష్టంగా జరిగిన భూరికార్డుల నవీకరణలో అటవీ, వక్ఫ్‌, దేవాదాయ శాఖ భూములు క్రమంగా తగ్గి.. పట్టాభూముల శాతం పెరిగింది. రాష్ట్రంలో అసైన్డ్‌ భూములు 22.68 లక్షల ఎకరాలు ఉండగా.. ఇవి కూడా మాయమైపోయాయి. భూరికార్డుల నవీకరణకు ముందు రాష్ట్రంలో మొత్తం పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాలుంటే 2020 అక్టోబరు 23 నాటికి ఈ లెక్క 1.55 కోట్ల ఎకరాలకు చేరింది. పట్టా భూముల జాబితాలో ఏకంగా 25 లక్షల ఎకరాలు అదనంగా చేరాయి. ఈ 25 లక్షల ఎకరాలు అటవీ భూములా లేక దేవాదాయ భూములా, వక్ఫ్‌ భూములా? అనేది తేలాల్సి ఉంది. అయినా రికార్డులు నవీకరణ అనంతరం 2020లో ధరణి పోర్టల్‌లోకి ఎక్కించేశారు. రిజిస్ట్రేషన్లు, ఆ వెంటనే మ్యుటేషన్లు జరిగిపోయాయి. మరోవైపు.. భూధాన్‌ భూ ములు 1.60 లక్షల ఎకరాల రికార్డులూ తారుమారు అయ్యాయి. ప్రస్తుతం సీసీఎల్‌ఏలో ఓ అధికారిని నియమించి పున:పరిశీలన చేపట్టి సర్వే నంబర్లవారీ భూదాన్‌ భూ వివరాలను సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:22 AM