Share News

School Text Books : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:36 AM

గత యేడాది పుస్తకాలు ముందుగానే వచ్చినప్పటికీ కొన్ని తరగులు, సబ్జెక్టులకు సంబందించి సరఫరా కాలేదు. ప్రధానంగా ఇంగ్లీష్‌ మీడియం పుస్తకాలు రాలేదు. హిందీ పాఠ్య పుస్తకాలు కొరత నెలకొంది. దీంతో చదువుకునేందుకు ఉన్నత తరగతుల విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు. ప్రస్తుత విద్యాసంవత్సరమైనా పుస్తకాలు పూర్తి స్థాయిలో అందేలా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాల్సిన ..

School Text Books :  పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
School Text Books

  • జిల్లాకు కావాల్సినవి 3,86,406

  • గోదాంకు చేరుకున్న 44,190 పుస్తకాలు

  • బడులు తెరిచే నాటికి పూర్తిగా అందుబాటులోకి

  • బరువు తగ్గించి ముద్రణ

జగిత్యాల, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా గత యేడాది కాంగ్రెస్‌ సర్కారు అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు కనీస మౌలిక వసతుల కల్పన ఏర్పాటులో భాగంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విద్యుత్‌ వంటి మరమ్మతులు చేపట్టనున్నారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు సకాలంలో అందించేందుకు ఇప్పటికే పిల్లల దుస్తుల కొలతలు తీసుకున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు, వర్క్‌ బుక్కులు పాఠశాలల ప్రారంభం నాటికి పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాకు ఎంత మేర అవసరమవుతాయో ఇప్పటికే విద్యా శాఖ అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. వాటిని దశల వారీగా రాష్ట్ర అధికారులు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి.


జిల్లాలో కావాల్సినవి ఇలా...

జిల్లా వ్యాప్తంగా యూడైస్‌ ఆధారంగా ఒక్కో విద్యార్థికి తరగతిని బట్టి 5 నుంచి 11 పుస్తకాలు అవసరమవుతాయి. 2023-24 యూడైస్‌ ప్రకారం జిల్లాలో 853 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 85,368 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ సుమారు 3,86,406 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయన్న అంచనాతో జిల్లా విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇందులో ఒకటో తరగతి పుస్తకాలు 12,180, రెండో తరగతి 12,220, మూడో తరగతి 16,360, నాలుగో తరగతి 16,870, ఐదో తరగతి 28,180 పుస్తకాలు అవసరమున్నాయి. ఆరో తరగతి 46,460 పుస్తకాలు, ఏడో తరగతి 48,000, ఎనిమిదో తరగతి 58,570, తొమ్మిదో తరగతి 71,940, పదో తరగతి 75,880 పుస్తకాలు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాకు 44,190 పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ఇంకా 3,42,216 పుస్తకాలు రావాల్సి ఉన్నాయి.

నోట్‌ బుక్కులు సైతం...

ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవసరమైన నోట్‌ బుక్కులు సైతం ప్రభుత్వం అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పలు నోట్‌ బుక్కులు సైతం జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3,82,321 నోట్‌ బుక్కులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రాథమిక పాఠశాలల పిల్లలకు అవసరమైన వర్క్‌బుక్స్‌ సైతం పంపిణీ చేయనున్నారు. 6వ, 7వ తరగతుల విద్యార్థులకు ఆరు చొప్పున, 8వ తరగతి విద్యార్థులకు 8 నోటు బుక్కులు, 9వ, 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 14 చొప్పున నోట్‌ బుక్కులు అందజేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, టీఎస్‌ డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడానికి అవసరమైన కసరత్తులు జరుగుతున్నాయి.


బరువు తగ్గించి..

పాఠ్య పుస్తకాల బరువు మోత విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. పుస్తకాల బరువు మోతను నివారించేందుకు పుస్తకం ముద్రించే కాగితం మందం తగ్గించారు. దీంతో బరువు తగ్గి పిల్లల ఇబ్బందులు తీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా అవసరమయ్యే పుస్తకాల సంఖ్యలో వంద శాతం వరకు పుస్తకాలు బడులు తెరిచే నాటికి అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ, మరాఠీ భాషాల్లో వీటిని రూపొందించారు.

దరూర్‌ క్యాంపు గోదాంలో నిల్వ

జిల్లా కేంద్రానికి చేరుకుంటున్న పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు, వర్క్‌ బుక్కులను దరూర్‌ క్యాంపులో గల ప్రత్యేక గోదాంలో విద్యాశాఖ అధికారులు నిల్వ చేస్తున్నారు. ఇందుకు ఆరుగురు సభ్యులుగా ప్రత్యేక బృందం అధికారులకు బాధ్యతలు అప్పగించారు. డిస్ట్రిక్ట్‌ టెక్స్ట్‌ బుక్స్‌ మేనేజర్‌గా ద్రోణంరాజు వెంకట రామకృష్ణ వ్యవహరిస్తుండగా ఐదుగురు సీఆర్‌పీలు, ఒక సహాయ అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కేంద్రానికి పుస్తకాలు పూర్తిగా చేరుకున్న తర్వాత వాటిని మండల విద్యా వనరుల కేంద్రానికి పంపించనున్నారు. అక్కడి నుంచి పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. జూన్‌ తొలి వారంలో పాఠశాలల పునః ప్రారంభం లోపు కొత్త పుస్తకాలు వారికి అందిచేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


అరకొరగా వస్తే సమస్యలే

పూర్తి స్థాయిలో పుస్తకాల సరఫరా కాకుండా అరకొరగా వస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. గత యేడాది పుస్తకాలు ముందుగానే వచ్చినప్పటికీ కొన్ని తరగులు, సబ్జెక్టులకు సంబందించి సరఫరా కాలేదు. ప్రధానంగా ఇంగ్లీష్‌ మీడియం పుస్తకాలు రాలేదు. హిందీ పాఠ్య పుస్తకాలు కొరత నెలకొంది. దీంతో చదువుకునేందుకు ఉన్నత తరగతుల విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు. ప్రస్తుత విద్యాసంవత్సరమైనా పుస్తకాలు పూర్తి స్థాయిలో అందేలా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. పాఠశాలలు తెరిచే సమయానికి పాఠ్యపుస్తకాలను అరకొరగా పంపిణీ చేస్తుండడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. పాఠశాలలను ప్రారంభించే సమయానికి విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


సకాలంలో పుస్తకాలు అందిస్తాం

-ద్రోణంరాజు వెంకట రామకృష్ణ, డిస్ట్రిక్ట్‌ నోట్‌ బుక్‌ మేనేజర్‌

వచ్చే విద్యా సంవత్సరానికి ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు సకాలంలో అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా కేంద్రానికి వచ్చిన పుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అందించి పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు సరఫరా చేస్తాం. జిల్లా కేంద్రం నుంచి మండలాలకు అక్కడి నుంచి పాఠశాలలకు అవసరమైన సంఖ్యలో పుస్తకాలను అందజేస్తాం.

ఇబ్బందులు లేకుండా చూడాలి

-దొనికెల నవీన్‌, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు

జిల్లాలో రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ జరపాలి. ప్రభుత్వం పాఠ్య పుస్తకాల సరఫరాలో జాప్యం జరగకుండా చూడాలి. విద్యార్థులకు అవసరమైన పుస్తకాల సరఫరాపై దృష్టి సారించాలి. సకాలంలో పుస్తకాలు అందితేనే బోధన సక్రమంగా జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇవి కూడా చదవండి:

China Warning: మా ప్రయోజనాలపై దాడి చేస్తే ఊరుకోం..అమెరికాకు చైనాహెచ్చరిక

Elon Musk: తల్లి బర్త్‌ డేకు సర్‌ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్..ఎలాగో తెలుసా..

Gold Rates Today: ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..ఈ వారం లక్షకు చేరుతుందా..

Updated Date - Apr 21 , 2025 | 12:12 PM