Road Development: హ్యామ్ ‘బాట’లో తొలి అడుగు!
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:22 AM
రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కొత్త రోడ్లను నిర్మించాలని, ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఆ దిశగా తొలి అడుగు పడింది.
ఆర్‌అండ్‌బీ పరిధిలో 373 రోడ్లకు సర్కారు ఆమోదం.. ఉత్తర్వులు జారీ
మొదటి దశలో 5,190 కి.మీ రోడ్ల కోసం రూ.6,478 కోట్లు
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కొత్త రోడ్లను నిర్మించాలని, ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఆ దిశగా తొలి అడుగు పడింది. ఆర్ అండ్ బీ శాఖలోని 16 సర్కిళ్లలో 5,190 కి.మీ మేర ఉన్న 373 రోడ్ల పనుల కోసం రూ.6,478.33 కోట్లు అవసరం అన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు 350 కి.మీ మేర రోడ్లను విస్తరించనున్నట్లు, మరో 4,840 కి.మీ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో ఉమ్మడి నల్లగొండ పరిధిలో 537 కి.మీ మేర రోడ్లున్నాయి. వీటి కోసం రూ.623 కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో పనులను రెండు భాగాలుగా విభజించారు. నల్లగొండ-1లో 231.12 కి.మీ మేర 18 పనులను.. నల్లగొండ-2లో 314.66 కి.మీ మేర 26 పనులు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లలో ఎక్కువ విస్తీర్ణంలో అంటే.. 2,900 కి.మీ మేర రోడ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఉండటంతోనే ఈ కేటాయింపులు చేసినట్లుగా భావిస్తున్నారు. కాగా హ్యామ్ విధానంలో తొలివిడతలో 373 రోడ్ల కోసం రూ.6,478 కోట్లు అంచనా వేశారని, ఆ పనుల నిర్వహణకు కన్సల్టెన్సీలు పలు విధానాలను సూచించాయని, వాటిలో సర్కిళ్ల ప్రకారమే పనులు నిర్వహించాలని శాఖ నిర్ణయించిందని చెబుతూ జూలై 4న ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ కన్సల్టెన్సీలు సూచించిన విధానాలు ఉన్నాయి. సర్కిళ్ల ప్రకారమే పనులను చేపట్టాలని నిర్ణయించిన విషయాన్ని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీకి 16 సర్కిళ్లు ఉండగా.. నల్లగొండ పనులను 2 భాగాలుగా చేయడంతో సర్కిళ్ల లెక్క 17గా ఉత్తర్వుల్లో పొందుపర్చారు.
హ్యామ్ విధానం అంటే
సాధారణంగా రోడ్ల నిర్మాణం సహా పలు పనులను ఇంజనీరింగ్-ప్రొక్యూర్‌మెంట్-కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ), బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) విధానాల్లో ఎక్కువగా చేస్తుంటారు. వీటిలో ఈపీసీ విధానం నిర్మాణం ద్వారా ప్రభుత్వంపై ఒకేసారి భారం పడుతుంది. బీవోటీ పద్ధతిలో కాంట్రాక్టు సంస్థే మొత్తం వ్యయాన్ని భరిస్తుంది. ఆ తరువాత టోల్‌గేట్ల ద్వారా చేసిన ఖర్చును రాబట్టుకుంటుంది. ఈ రెండు పద్ధతులను కలిపి ప్రభుత్వానికి సులభంగా ఉండేలా, ప్రజలపై భారం పడకుండా హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరు, కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం తొలుత 40 శాతం నిధులను అందిస్తుంది. మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్టు సంస్థలే భరించి పనులు పూర్తిచేస్తాయి. ఆ సంస్థలు భరించిన 60శాతం నిధులను ప్రభుత్వం 15ఏళ్ల పాటు ఏటా కొంత చొప్పున వడ్డీతో సహా చెల్లిస్తుంది. అయితే ఈ రోడ్డపై టోల్‌గేట్లు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. హ్యామ్ విధానంలో గ్రామీణ రోడ్లను నిర్మించడం, విస్తరించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి.
సీఎంకు కృతజ్ఞతలు: మంత్రి కోమటిరెడ్డి
హ్యామ్ విధానంలో ఆర్‌అండ్‌బీ పరిధిలో చేపట్టాల్సిన రోడ్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంచి రోడ్లు అభివృద్ధికి చిహ్నం అని, రాష్ట్రంలో మెరుగైన బీటీ రోడ్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రోడ్లకు శ్రీకారం చుట్టామని చెప్పారు. హ్యామ్ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించామని చెబుతూ ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్‌అండ్‌బీలో మొదటి దశలో
చేపట్టే పనులు ఇవే.. (సర్కిళ్ల వారీగా)
సర్కిల్ రోడ్ల కి.మీ.లు ఖర్చు
పనులు (రూ.కోట్లలో)
ఆదిలాబాద్ 18 313.09 365.68
కొత్తగూడెం 10 266 380.90
హనుమకొండ 39 394.42 467.90
జగిత్యాల 28 346.09 435.80
భూపాలపల్లి 10 194.23 249.31
కరీంనగర్ 20 229.03 259.50
ఖమ్మం 35 382.29 468.98
మహబూబ్‌నగర్ 26 380.85 434.19
మంచిర్యాల 12 259.23 294.29
నల్లగొండ-1 18 223.12 302.45
నల్లగొండ-2 26 314.66 320.80
నిజామాబాద్ 24 362.83 438.54
రంగారెడ్డి 25 281.56 367.75
సంగారెడ్డి 26 387.19 523.47
సిద్ధిపేట 25 289 379.69
వనపర్తి 15 279.16 399.34
యాదాద్రి 16 287.50 389.73
మొత్తం 373 5,190.25 6,478.33
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 24 , 2025 | 02:22 AM