Hyderabad: మాతృభాష అమ్మ.. హిందీ పెద్దమ్మ!
ABN, Publish Date - Jul 12 , 2025 | 05:02 AM
మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ’’ అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. హిందీ మనది అని.. ఆ భాషను ప్రేమిద్దాం అని, ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.
హిందీ అంటే ఎందుకంత భయం?.. ఎందుకు ద్వేషిస్తున్నాం?
ఇంగ్లిష్‌ను సొంతం చేసుకొన్న మనమే.. హిందీని మనభాషగా ఎందుకు అనుకోవడం లేదు?
చిల్లర రాజకీయాల కోసమే కొందరు హిందీని వ్యతిరేకిస్తున్నారు
అది రాజభాష.. హిందీని ప్రేమిద్దాం.. ముందుకు తీసుకెళ్దాం: పవన్ కల్యాణ్
గచ్చిబౌలిలో రాజభాషా స్వర్ణోత్సవ వేడుకలు
హైదరాబాద్ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ‘‘మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ’’ అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. హిందీ మనది అని.. ఆ భాషను ప్రేమిద్దాం అని, ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. హిందీని రాజభాషగా ఆయన అభివర్ణించారు. నాగరికత ముసుగులో ఆంగ్ల భాషను సొంతం చేసుకున్న మనమే హిందీని మనభాష అని అనుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి భాషలు నేర్చుకుంటున్నామని, మరి.. మన దేశానికే చెందిన హిందీ నేర్చుకునేందుకు ఎందుకు భయపడుతున్నాం? ఆ భాషను ఎందుకు ద్వేషిస్తున్నాం? అని ప్రశ్నించారు. హిందీ నేర్చుకోవాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని, అయితే అది ఎవరైనా తేలిగ్గా అర్థం చేసుకోగలిగే భాష అని పేర్కొన్నారు. లాభం ఉందనుకున్నప్పుడు కొందరు హిందీని నిస్సంకోచంగా ఉపయోగిస్తూ అదే హిందీని చిల్లర రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం ‘రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం’ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఇంట్లో మాట్లాడుకునేందుకు మాతృభాష ఉంటే, బయట మాట్లాడేందుకు హిందీ అవసరమవుతుందని ఆయన చెప్పారు. మనమేమో విడిపోయేందుకు దారులు వెతుకుతుంటే.. హిందీ, దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు దారులు వెతుకుతోందని.. ఆ భాషను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. పర్షియన్, ఉర్దూ భాషలను ఆమోదిస్తూ.. హిందీని మాత్రం బలవంతంగా రుద్దుతున్నారని కొందరు అంటున్నారన్నారని.. అది అవివేకమేనని విమర్శించారు. విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం అన్ని భాషలు, మాండలికాలు అనే గోడలను ఛేదించుకుంటూ వెళుతున్న ఈ రోజుల్లో హిందీని వ్యతిరేకిస్తే రానున్న తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణాది చిత్రపరిశ్రమకు ఆదాయ వనరు
హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికి కోల్పోవడం కాదని, మన ఉనికికి మరింత సుదృఢం చేసుకోవడం అవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. మరో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదని, కలిసి ప్రయాణం చేయడం అని పేర్కొన్నారు. హిందీ సినిమా వ్యాపార ఆదాయంలో 31 శాతం మేర హిందీలోకి అనువాదమయ్యే దక్షిణాది భాషలకు చెందిన చిత్రాల ద్వారానే వస్తోందని.. తద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమకి ఆదాయం కూడా వస్తోందని చెప్పారు. వ్యాపార అవసరాలకు హిందీ కావాలి గానీ నేర్చుకోవడానికి మాత్రం వద్దు అనే ధోరణి తగదన్నారు. ‘‘హిందీ భాష పట్ల నాకు ఉన్న గౌరవం, నిబద్ధతను చూపేందుకే ఖుషీ సినిమాలో ‘ఏ మేరా జహా’ అనే పాటను పెట్టానని, మాతృ భాష తెలుగు అయితే.. రాజ భాష హిందీ అని చెప్పే ప్రయత్నం చేశాను’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణకు చెందిన హిందీ భాషావేత్త మాణిక్యాంబ, తమిళనాడుకు చెందిన హిందీ భాషావేత్త అనంతకృష్ణన్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News
Updated Date - Jul 12 , 2025 | 05:02 AM