Bonalu Jatara: నాకు రక్తం బలి కావాలి.. లేదంటే అల్లకల్లోలమే!
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:47 AM
బోనాల జాతరను సాకలు పోసి బాగా చేసినా.. ప్రతిసారి చేసినట్లే ఈసారి కూడా పొరపాటు చేశారని రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత మండిపడ్డారు.
మహమ్మారి వస్తుంది.. అగ్ని ప్రమాదాలూ ఉంటాయి
ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయి
రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్య వాణి
సికింద్రాబాద్, జూలై 14(ఆంధ్రజ్యోతి): బోనాల జాతరను సాకలు పోసి బాగా చేసినా.. ప్రతిసారి చేసినట్లే ఈసారి కూడా పొరపాటు చేశారని రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత మండిపడ్డారు. తనకు రక్తం బలి కావాలని, లేకపోతే అల్లకల్లోలం జరుగుతుందని హెచ్చరించారు. ‘మీరు మాత్రం ఆరగిస్తారు.. నాకు మాత్రం బలి ఇవ్వరా?’ అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మహమ్మారి వస్తుందని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో సోమవారం ఉదయం రంగం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తనకు పూజలు సరిగా నిర్వహించాలని.. అలా చేయకపోతే రక్తం కక్కుకొని చస్తారని, పూజలు సరిగా నిర్వహించకపోవడం వల్లే మరణాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది తన కోరికలు చెబుతున్నానని, అయినా పండుగ సందర్భంగా ఏదో ఒక ఆటంకం కల్పిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు వారాల పాటు తనకు పూజలు చేసి, సాక పోసి ఆనందపరచాలన్నారు. తన రూపాన్నిపెట్టడానికి కూడా అడ్డు పడుతున్నారని అన్నారు.. తనను మొక్కే వాళ్లు ఉండాలని, నిందలు వేసే వాళ్లు ఉండకూడదన్నారు. తనను కొలిచే వారికి ఎప్పుడూ తోడుగా నిలబడతానని చెప్పారు. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు.
బలి విషయమై అధికారులతో చర్చిస్తాం: మంత్రి పొన్నం
అమ్మవారికి గతంలో నిర్వహించి, ఆ తర్వాత రద్దు చేసిన బలి విషయమై ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మహాంకాళి ఆలయంలో రంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు రక్తం కావాలని పరోక్షంగా బలి అంశాన్ని అమ్మవారు ప్రస్తావించినందున దీనిపై దేవాదాయ శాఖ అధికారులతో చర్చిస్తామని వెల్లడించారు. అమ్మవారు కోరిన విధంగా ప్రభుత్వం తరపున అన్ని చేస్తామని, దేవాదాయ శాఖ తరపున శాస్త్రోక్తంగా జరగవలసిన పూజలన్నీ నిర్వహిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ బోనాల జాతర బాగా జరిగిందని, ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తప్పనిసరి చర్యలు చేపడుతుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 15 , 2025 | 05:47 AM