Tirupati Railway Station: తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:14 PM
తిరుపతి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్ లూప్ లైన్‌లో ఆగి ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. రాయలసీమ, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లలో ఈ ప్రమాదం సంభవించింది.
తిరుపతి, జులై 14: తిరుపతి రైల్వేస్టేషన్‌లోని యార్డ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. యార్డ్‌లో ఆగి ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. హిసార్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ల బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రైల్వేస్టేషన్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక శకటాలతో వారు అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. రాజస్థాన్‌లోని హిసార్ నుంచి హిసార్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 11.50కి తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.
ప్రయాణికులను రైల్వేస్టేషన్‌లో దింపిన తర్వాత యార్డ్‌లోకి వెళ్తున్న క్రమంలో ఇంజిన్ వెనుక భాగంలో ఉన్న రైల్వే బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో పక్క ట్రాక్‌పై ఉన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ జనరేటర్ బోగీలోకి మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజన్ వచ్చి.. మంటలు ఆర్పేలోగా హిసార్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ పూర్తిగా కాలిపోయింది. ఇక రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లోని జనరేటర్ బోగీ పాక్షికంగా కాలిపోయింది.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రైల్వేస్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించగానే.. ఇంజిన్ నుంచి బోగీలను వేరు చేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు అయ్యింది.
ఇవి కూడా చదవండి
గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియామకం
ఆ మూడు ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమే: దేవినేని
Read Latest AP News And Telugu News