Nambala Keshav Rao Encounter: మావోయిస్టు చీఫ్ ఎన్‌కౌంటర్
ABN, Publish Date - May 22 , 2025 | 03:31 AM
ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 26 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు.
అబూజ్‌మఢ్‌లో నేలకొరిగిన నంబాల కేశవరావు
మరో 26 మంది నక్సల్స్ కూడా.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన కార్యదర్శి మృతి ఇదే తొలిసారి
మావోయిస్టు పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వర్‌రావు మృతి చెందినట్లు ప్రచారం
అబూజ్‌మఢ్‌లో 72 గంటలపాటు ఆపరేషన్
కేశవరావుపై రూ.1.5 కోట్ల రివార్డు
ఒక జవాన్ మృతి.. ఐదుగురికి గాయాలు
అబూజ్‌మఢ్‌లో కొనసాగుతున్న కూంబింగ్
ఆపరేషన్‌లో నాలుగు జిల్లాల బలగాలు
కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం
వరంగల్‌లో ఇంజనీరింగ్ పూర్తి
రాడికల్ ఉద్యమం నుంచి నక్సలిజం వైపు
గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ చీఫ్ పదవి
ఏడేళ్లుగా ఉద్యమానికి కేశవరావు సారథ్యం
చర్ల/హనుమకొండ/టెక్కలి/చింతపల్లి/సీలేరు/చీరాల, మే 21 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్ కగార్’తో అతలాకుతలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది..! ఇప్పటికే అగ్రనాయకులను పోగొట్టుకుని, క్యాడర్ లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీ బుధవారం పెద్ద దిక్కును కోల్పోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(71) ఛత్తీస్‌గఢ్ లోని అబూజ్‌మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీయన్న పేటకు చెందిన కేశవరావు వరంగల్ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాక.. అజ్ఞాతంలోకి వెళ్లారు. నక్సలిజంపై పోలీసులు జరుపుతున్న ఐదు దశాబ్దాల పోరులో.. ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మృతి చెందడం ఇదే తొలిసారి. బుధవారం నాటి ఎన్‌కౌంటర్‌లో మరో 26 మంది నక్సల్స్ చనిపోగా, వారిలో పలువురు అగ్రనాయకులు, కేశవరావు అంగరక్షకులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు పార్టీ పత్రిక అవామ్-ఇ-జంగ్ చీఫ్ ఎడిటర్ సజ్జా వెంకట నాగేశ్వర్‌రావు కూడా మృతిచెందినట్లు ప్రచారం జరుగుతున్నా.. పోలీసులు నిర్ధారించలేదు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఓ డీఆర్‌జీ జవాను మృతిచెందగా.. మరో ఐదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ పోలీసుల కథనం ప్రకారం.. మూడంచెల భద్రత ఉండే మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు.. పార్టీ అగ్రనాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు, డీవీసీఎం నేతలు అబూజ్‌మఢ్ అడవుల్లో సమావేశమైనట్లు ఈ నెల 19న ఇంటెలిజెన్స్ వర్గాలు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ఉప్పందించాయి. దాంతో అదే రోజు తెల్లవారుజామున నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన డీఆర్జీ బలగాలు, స్థానిక పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ‘‘72 గంటల పాటు ఆపరేషన్ కొనసాగింది.
ఈ క్రమంలో బుధవారం ఉదయం బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావాళ్లు ఎదురు కాల్పులు జరిపారు. మూడు గంటలపాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల వైపు కాల్పులు నిలిచిపోయిన తర్వాత.. బలగాలు గాలింపును కొనసాగించాయి. 27 మంది మావోయిస్టుల మృతదేహాలు, ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్, కార్బైన్ తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం’’ అని నారాయణపూర్ పోలీసులు మీడియాకు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ బీఆర్ దాదా అలియాస్ గంగన్నను గుర్తించామన్నారు. ఈయనకు మరో 10 పేర్లున్నట్లు తెలిపారు. మిగతా వారిలో కేశవరావు అంగరక్షకులు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, పీఎల్‌జీఏ నేతలు, సభ్యులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. కేశవరావుపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు రూ.కోటిన్నర రివార్డు ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో కూడా రివార్డులున్నట్లు వెల్లడించారు. కాగా.. మృతిచెందిన మిగతా మావోయిస్టుల వివరాలు గురువారానికి తెలిసే అవకాశాలున్నాయి.
మావోయిస్టు ‘ఉంగా’ లొంగుబాటు
సీపీఐ (మావోయిస్టు) పార్టీ సభ్యుడు ముచ్చకీ ఉంగా అలియాస్ కిశోర్ ఎటపాక స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు వివరాలను రంపచోడవరం ఓఎస్డీ జగదీష్ అడహల్లీ వెల్లడించారు. ‘ఉంగా స్వగ్రామం సుక్మా జిల్లా దంతేష్పురం గ్రామం. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మాడో డివిజన్ ఒకటో కంపెనీ, ఒకటో ప్లటూన్ సభ్యుడుగా వ్యవహరిస్తున్న ఉంగా 2020లో మావోయిస్టు పార్టీలో చేరాడు. ఛత్తీస్‌గఢ్ లో జరిగిన పలు ఎదురు కాల్పులు, రోడ్లు తవ్విన ఘటనలో నిందితుడిగా పోలీసు రికార్డులో ఉన్నాడు’ అని ఓఎస్డీ తెలిపారు.
ఆస్పత్రి నుంచి తీసుకెళ్లి చంపారు!
రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆరోపణ
సీపీఐ(మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు(బస్వరాజ్) ఎన్‌కౌంటర్ బూటకం అని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నేత బల్లా రవీంద్రనాథ్ ఆరోపించారు. తీవ్ర అనారోగ్యంతో ఒడిశాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నంబాలను పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత ఎన్‌కౌంటర్ చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
నాగేశ్వర్‌రావు మృతిపై ప్రచారం
అబూజ్‌మఢ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పత్రిక అవామ్-ఇ-జంగ్ చీఫ్ ఎడిటర్ సజ్జా వెంటక నాగేశ్వర్‌రావు(61) కూడా మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి గ్రామం. ఆయన గుంటూరులో డిప్లొమా పూర్తిచేసి, 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. యూజీ, డీసీఎస్‌గా పనిచేసి, అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ బోర్డులో సేవలందించారు. చీఫ్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు నాగేశ్వర్‌రావు మృతిని నిర్ధారించలేదు. అయితే.. బాపట్ల జిల్లా పోలీసులు మాత్రం తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, ఈ నేపథ్యంలో నాగేశ్వర్‌రావు వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఇతనిపై వేటపాలెం ఠాణాలో ఓ కేసు ఉన్నట్లు సమాచారం.
నక్సలిజం నిర్మూలనలో మైలురాయి: అమిత్‌షా
మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతిచెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌లో స్పందిస్తూ.. నక్సలిజం నిర్మూలనలో ఇదో మైలురాయి విజయంగా అభివర్ణించారు. ‘‘2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కారు దృఢ సంకల్పంతో ఉంది. కర్రెగుట్టల ఆపరేషన్ తర్వాత.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో 54 మంది నక్సల్స్ అరెస్టయ్యారు. 84 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Updated Date - May 22 , 2025 | 04:10 AM