KTR: బీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కంకణం
ABN, Publish Date - Apr 21 , 2025 | 03:55 AM
బీఆర్‌ఎస్ పార్టీని హరించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకం, ఐటీ రంగ అభివృద్ధికి వైఎస్‌ఆర్, చంద్రబాబుల అంగీకారం అవసరమని కొనియాడారు.
ఆ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే.. ప్రజలకు రక్షణ గులాబీ జెండానే
వైఎస్‌ఆర్ తెచ్చిన ఆరోగ్య శ్రీ భేష్.. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు వారిద్దరినీ అభినందించాల్సిందే: కేటీఆర్
రాజేంద్రనగర్/హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీఆర్‌ఎ్‌సను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాయి. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు శత్రువులే. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం గులాబీ జెండా. ప్రజలకు ఏ కష్టం వచ్చిన అండగా ఉండేది బీఆర్‌ఎస్ పార్టీయే’’ అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వనం శ్రీరాంరెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎన్నో కొత్త పార్టీలు వచ్చాయి.. పోయాయి.. రాజకీయ చరిత్రలో నిలిచిపోయిన పార్టీలు తెలుగుదేశం, బీఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ నుంచి వచ్చిన వారి ఉత్సాహం చూస్తుంటే తొందరలోనే పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఎమ్మెల్యే అవుతాడనిపిస్తోందని చెప్పారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రులుగా పనిచేసిన దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య శ్రీ పథకం తీసుకువచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. వారిద్దరినీ అభినందించాల్సిందేనన్నారు. వాళ్లు తీసుకొచ్చిన పథకాలను తాము కొనసాగించామని, మంచి పనులను బీఆర్‌ఎస్ ఎప్పుడూ అడ్డుకోదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటూ.. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని అఘాతంలో పడేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మాటలు పెద్దవి.. చేతలు చిన్నవి అన్నట్లు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల ఇండ్లు, వ్యాపార సముదాయాలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే ముట్టుకోరని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లను మాత్రం కూల్చుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ ఒక్క మంచి పని చేయలేదని దుయ్యబట్టారు. మత పిచ్చి, కుల పిచ్చి తప్ప ఆ పార్టీకి మరొకటి లేదన్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘సమరశంఖ గర్జన గెరిల్లా ఉద్యమాల ఖిల్లా.. ఓరుగల్లు జిల్లా ’ అంటూ సాగే పాటను కేటీఆర్ విడుదల చేశారు.
Updated Date - Apr 21 , 2025 | 03:55 AM