Khammam farmer: తూ.. ఏం బతుకిది.. రాయినై పుడితే బాగుండు
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:51 PM
‘తూ.. ఏం బతుకిది? రాయినై పుడితే బాగుండు’ అంటూ ఓ రైతు పాట రూపంలో తనతో పాటు సాటి అన్నదాతలు పడుతున్న కష్టాల కన్నీటిని వివరిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
- రాయినై పుడితే బాగుండు అంటూ ఓ అన్నదాత ఆవేదన
- పాట రూపంలో రైతుల దీనస్థితిని వినిపించిన వెంకన్న
- సోషల్ మీడియాలో ఒక్క వీడియోతో వైరల్
తిరుమలాయపాలెం(ఖమ్మం): ‘తూ.. ఏం బతుకిది? రాయినై పుడితే బాగుండు’ అంటూ ఓ రైతు పాట రూపంలో తనతో పాటు సాటి అన్నదాతలు పడుతున్న కష్టాల కన్నీటిని వివరిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాత బతుకు ఎంత హీనంగా మారిందో, పది మంది కడుపు నింపే రైతుల దుస్థితి ఎంత దుర్భరంగా ఉందో.. కాలం కలిసిరాక వేసిన పంటలు ఎండుతుంటే వారి కడుపు ఎలా తరుక్కుపోతుందో.. కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాక.. ప్రభుత్వాల నుంచి న్యాయం జరగక.. రైతులు పడే బాధేంటో వివరిస్తూ తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన ఆరెంపుల వెంకన్న పాడిన పాట అందరినీ ఆలోచింపజేస్తోంది.
చిన్నతనం నుంచే వ్యవసాయం చేస్తున్న వెంకన్న గ్రామంలో తనకున్న మూడెకరాల్లో వివిధరకాల పంటలు పండించి వాటిని మార్కెట్‌కు తరలించి విక్రయించేసమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అధికంగా పెట్టుబడులు కావడం, ప్రకృతి సహకరించకపోవడంతో గిట్టుబటు ధర రాక విసుగు చెందిన వెంకన్న కొంత భూమి కౌలుకు ఇచ్చి మరికొంత భూమిలో ఆకుకూరలు పండించి చుట్టుపక్కల ఊర్లలో అమ్ముతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇటీవల పక్కనే ఉన్న దమ్మాయిగూడెం గ్రామానికి ఆకుకూరలు అమ్మేందుకు వెళ్లిన వెంకన్న గోంగూర కట్ట రూ. 10 అని చెప్పగా.. ఓ వినియోగదారుడు రూ.5కు బేరం ఆడాడు.
ఆ సమయంలో వెంకన్న బాధతో పాడినపాట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘రైతునై పుట్టాను.. రైతునైపెరిగాను, రాయినై పుడితే ఏ రందీ ఉండదు.. ఏమి బతుకు ఇది.. తూ ఏమి బతుకు’ అంటూ తన దీనగాధను పాటరూపంలో వెల్లడించాడు. 20ఏళ్లుగా న్యూడెమోక్రసీ(New Democracy)లో పనిచేస్తూ అనేక పదవులు చేపట్టిన వెంకన్న ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఎంపీటీసీగా పోటీ చేసి రూపాయి ఖర్చులేకుండా గెలిచాడు. అంతే కాదు ఆ సమయంలో ఎంపీపీ ఎన్నికల్లో ఓటుకోసం రూ.6లక్షలు ఇస్తామని ఆశావహులు చెప్పినా తను ఓటును అమ్ముకోకుండా తనను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశాడు.
ఢిల్లీలో నల్లచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో తన గళంతో రైతుల్లో చైతన్యం నింపి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. రైతుల సమస్యల పరిష్కారానికి జరిగే ప్రతీ ఉద్యమంలో వెంకన్న పాల్గొంటాడు. అలాగే విద్యుత్ ఉద్యమ సమయంలో గజ్జె కట్టి పాటలు పాడాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చాడు. వెంకన్న నిరక్షరాస్యుడైనా డప్పు, కోలాటంలో అనేకమందికి శిక్షణనిచ్చాడు. రైతులపై ఉన్న మక్కువతోపాటలు పాడే వెంకన్న.. తన కుటుంబ పోషనకు తన పొలంలో పడించే కూరగాయలను వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉంటాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం
Read Latest Telangana News and National News
Updated Date - Jul 16 , 2025 | 12:51 PM