Kaleshwaram Corruption case: కేసీఆర్‌కు పిలుపు
ABN, Publish Date - May 21 , 2025 | 03:45 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకాలపై విచారణ జరుపుతున్న కమిషన్ జూన్ 5న మాజీ సీఎం కేసీఆర్‌కు సమన్లు జారీ చేసింది. హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
జూన్ 5న విచారణకు రమ్మన్న కాళేశ్వరం కమిషన్
హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకూ పిలుపు
వ్యక్తిగతంగా, రిజిస్టర్డ్ పోస్టులో ముగ్గురికి సమన్లు
కాళేశ్వరం నిర్మాణ పర్యవేక్షణపై కేసీఆర్, హరీశ్‌లకు..
నిధుల విడుదలపై ఆర్థిక మంత్రిగా ఈటలకు..
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణకు రావాలని కోరింది. ఈ మేరకు ఆయనకు సమన్లు పంపింది. కమిషన్ ముందు జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఆయనతో పాటు బ్యారేజీల నిర్మాణ కాలంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావుకు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌కు కూడా సమన్లు జారీ చేశారు. హరీశ్‌ను జూన్ 6న, ఈటలను జూన్ 9న హాజరవ్వాలని కోరారు. మూడు పేజీల సమన్లను ముగ్గురికీ నేరుగా వ్యక్తిగతంగా పంపడమే కాకుండా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కూడా కమిషన్ పంపింది. కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా అనూహ్యంగా గడువును రెండు నెలల పాటు పొడిగిస్తూ సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైంది. 2019 మేలో పూర్తయింది. 2016 నుంచి 2018 సెప్టెంబరు 6 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విధాన నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు. బ్యారేజీల స్థలాల ఎంపిక, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాల మార్పు నిర్ణయం కూడా కేసీఆర్‌దే. బ్యారేజీల స్థలాలను ఎంపిక చేసే క్రమంలో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు కూడా చేయలేదని విచారణలో తేలింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది.
వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలను ఖాళీచేసి, బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయని నివేదికలు తయారు చేయాల్సి ఉండగా, 2023 అక్టోబరు 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాకు కుంగేదాకా మధ్యలో ఒక్కసారి కూడా చేయలేదని గుర్తించారు. 2019 మేలో బ్యారేజీలు పూర్తికాగా మేడిగడ్డ కుంగుబాటు ఘటన జరిగే వరకు కూడా ఏ సంవత్సరం కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం) పనులు చేయలేదని విచారణలో తేలింది. నీటి మళ్లింపు కోసం కాకుండా బ్యారేజీలను నీటి నిల్వ కోసం కట్టడమే అనర్థాలకు కారణమని కమిషన్ విచారణలో పలువురు వివరించారు. బ్యారేజీల్లో ఎక్కువ రోజులు నీటిని నిల్వ చేయడానికి కారణం ఎవరని కమిషన్ అధికారులను ప్రశ్నించగా అంతా కేసీఆర్ పేరే చెప్పారు. హరీశ్‌రావు ఆదేశాలు కూడా కారణమని కొందరు ప్రస్తావించారు. 2016-18 మధ్యకాలంలో నీటిపారుదల మంత్రి హోదాలో హరీశ్‌రావు కేసీఆర్ మార్గదర్శకంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. రెండో దఫా ప్రభుత్వం వచ్చాక నీటి పారుదల శాఖ కేసీఆర్ దగ్గరే ఉంది. నిధుల విడుదల సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉండటంతో ఆయనకు విచారణకు పిలిచారు. కేసీఆర్‌కు జూన్ 5న విచారణకు హాజరవుతారా? విచారణ ప్రక్రియను న్యాయస్థానంలో సవాలు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. కమిషన్ మంగళవారం జారీ చేసిన సమన్లు బుధవారం కేసీఆర్, హరీశ్‌రావు, ఈటలకు అందనున్నాయి. హరీశ్, ఈటల విచారణకు హాజరవడానికే మొగ్గు చూపే అవకాశం ఉంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఛత్తీ్‌సగఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికి కేసీఆర్ నిరాకరించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. తాజాగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కాలేనని, వీడియో ద్వారా విచారించాలని కేసీఆర్ కోరితే కమిషన్ సానుకూలంగా స్పందించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ సూపరింటెండెంట్ ఇంజనీర్ అమెరికాలో ఉండగా వర్చువల్‌గా విచారించారు. అదే అవకాశం కేసీఆర్‌కు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Updated Date - May 21 , 2025 | 05:59 AM