JEE Mains: తుది కీ విడుదల గంటలోపే తొలగింపు
ABN, Publish Date - Apr 18 , 2025 | 04:04 AM
జేఈఈ మెయిన్స్ తుది కీని ఎన్టీఏ విడుదల చేసిన గంటలోపే తొలగించడంతో విద్యార్థుల్లో గందరగోళం మొదలైంది ఫలితాలపై స్పష్టత లేకపోవడం వల్ల 12 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో గందరగోళం
ఎలాంటి ప్రకటనా చేయని ఎన్టీఏ.. విద్యార్థుల్లో ఆందోళన
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఈ పరీక్షల ఫలితాల విడుదలపై నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ (ఎన్టీఏ) తర్జనభర్జన పడుతోంది. జనవరిలో జరిగిన తొలి విడత పరీక్షల ఫలితాలు ఇప్పటికే విడుదలవగా.. ఏప్రిల్ 2-9 మధ్య జరిగిన రెండో విడత పరీక్షల ఫలితాలపై ఎన్టీఏ మల్లగుల్లాలు పడుతోంది. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీని ఈ నెల 11న వి డుదల చేసింది. అయితే ఇందులో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని 9 ప్రశ్నలకు తప్పుడు సమాధానాలున్నాయని పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఆ తప్పులు సవరించి, తుది కీ విడుదల చేస్తామని ఎన్టీఏ తెలిపింది. కీతో పాటు ఫలితాలు గురువారం విడుదల చేస్తామని పేర్కొంది. కానీ, గురు వారం తుది కీని అధికారిక వెబ్‌సైట్లో విడుదల చేసిన ఎన్టీఏ.. గంటలోపే దాన్ని తొలగించింది. ఈ తొలగింపుపై ఎన్టీఏ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ రాసిన 12 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. తప్పులు సవరించి తుది కీ విడుదల చేసిన తర్వాత జేఈఈ మెయిన్స్ రెండు పరీక్షల్లోని ఉత్తమ ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను కేటాయిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News
Updated Date - Apr 18 , 2025 | 04:04 AM