Dubai incident: దుబాయిలో అసలేం జరిగింది..?
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:07 AM
దుబాయిలో ఇద్దరు తెలంగాణ వాసుల హత్యపై ఉత్కంఠ కొనసాగుతోంది. మతపరమైన వాగ్వివాదం హత్యలకు దారితీసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ వాసుల హత్యకు కారణమేంటి?
ఖుబూస్ల తయారీ కేంద్రంలో గొడవేంటి?
జంట హత్యలపై కొనసాగుతున్న ఉత్కంఠ
అత్యంత గోప్యంగా స్థానిక పోలీసుల విచారణ
ఆచితూచి వ్యవహరిస్తున్న దుబాయి, భారత అధికారులు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దుబాయిలో ఇద్దరు తెలంగాణ వాసులను దారుణంగా హతమార్చిన ఉదంతంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అక్కడ అసలు ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియడం లేదు. ఈ దుర్ఘటన కంటే ముందు రెండు సార్లుపాకిస్థానీయులు, భారతీయుల మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. మూడోసారి జరిగిన వాగ్వాదం జంట హత్యలకు దారి తీసినట్లు సమాచారం. రంజాన్ ఇఫ్తార్ విందు సమయంలో హోలీ పండగ చేసుకుంటూ భారతీయులు కొందరు మతపరమైన నినాదాలు చేయగా పాకిస్థానీయులు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. కంపెనీ యాజమాన్యం ఇరు వర్గాలకు సర్దిచెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఖుబూస్ తయారీ కేంద్రంలో..
దుబాయిలో స్థానికులందరూ రొట్టెలే తింటారు. వీటిని అరబ్ భాషలో ఖుబూస్ అంటారు. రోజూ లక్షలాది ఖుబూస్లను తయారు చేసి, దుబాయి నగరమంతటికీ సరఫరా చేసే ఈ సంస్ధలో పెద్ద సంఖ్యలో భారతీయులు పనిచేస్తుండగా.. కొద్ది సంఖ్యలోనే పాకిస్థానీయులు, ఇతర దేశస్థులు ఉన్నట్లు తెలుస్తోంది. నినాదాలు, ప్రతి నినాదాలతోనే హత్యలు జరిగినట్లు సమాచారం. అయితే నినాదాలను ఎవరు మొదలుపెట్టారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు విచారణలో భాగంగా అనేక మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం సహా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు సమాచారం. విచారణ దశలో ఉన్నందున కేసుకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. భారత అధికారులు సహా ఎవరికీ తెలియనివ్వడం లేదు. మృతుల వివరాలను కూడా భారత కాన్సులేట్ తెలుసుకోలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన మైత్రి కారణంగా అధికారులూ ఈ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
అంతా మౌనమే..
వాట్సాప్ గ్రూపుల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారెవరూ ఈ దుర్ఘటనకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్నీ పంచుకోవడం లేదు. అందరూ మౌనంగానే ఉంటున్నారు. కంపెనీలో పని చేసే వారి కదలికలపై పోలీసులు కన్నేసి ఉంచారని చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది. దుబాయి ప్రభుత్వం జాతి, మతం సహా ఎలాంటి వివక్షనూ సహించదు. ముస్లింలు, ముస్లిమేతరులు ఎవరైనా సరే విద్వేష, కవ్వింపు చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలు తీసుకుంటుంది.
ఇవి కూడా చదవండి...