Share News

Osmania Hospital: ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

ABN , Publish Date - Apr 17 , 2025 | 05:12 AM

పరిస్థితి విషమంగా ఉందని చెబుతూ రోగిని అడ్మిట్‌ చేసుకునేందుకు ఓ ప్రైవేటు ఆస్పత్రి తిరస్కరిస్తే. సర్కారు దవాఖానా మాత్రం పండగ సెలవురోజు అయినా ఆ రోగిని అడ్మిట్‌ చేసుకొని.. క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టింది.

Osmania Hospital: ప్రైవేట్‌ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది

  • షిర్డీ వెళుతూ తీవ్ర అస్వస్థతకు గరైన ఏపీ యువకుడు

  • ఉస్మానియా ఆస్పత్రికి వెళితే అడ్మిట్‌ చేసుకున్న వైద్యులు

  • శస్త్రచికిత్స నిర్వహణ.. పూర్తిగా కోలుకున్న యువకుడు

మంగళ్‌హాట్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): పరిస్థితి విషమంగా ఉందని చెబుతూ రోగిని అడ్మిట్‌ చేసుకునేందుకు ఓ ప్రైవేటు ఆస్పత్రి తిరస్కరిస్తే. సర్కారు దవాఖానా మాత్రం పండగ సెలవురోజు అయినా ఆ రోగిని అడ్మిట్‌ చేసుకొని.. క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టింది. ఆ ప్రభుత్వాస్పత్రి ఉస్మానియా పెద్దాస్పత్రి అయితే ఆ రోగి ఏపీకి చెందిన హేమంత్‌ అనే 22 ఏళ్ల యువకుడు. విశాఖ వాస్తవ్యుడైన హేమంత్‌ గత నెల 29న కుటుంబసభ్యులతో కలిసి షర్డీ వెళ్లేందుకు హైదరాబాద్‌కొచ్చాడు. 30వ తేదీ ఉగాది రోజు షిర్డీ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా హేమంత్‌ ఒక్కసారిగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. హేమంత్‌ కడుపు బాగా ఉబ్బిపోయి ఉండటంతో చేర్చుకునేందుకు వైద్యులు తిరస్కరించారు. దీంతో కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు.


ఉస్మానియా ఆస్పత్రిలో సెలవు దినాల్లో, పండగ రోజుల్లో సిబ్బంది, వైద్యులు తక్కువగా ఉంటారు. అయినా అక్కడి జనరల్‌ సర్జరీ విభాగం వైద్యులు సకాలంలో స్పందించి హేమంత్‌కు పలు పరీక్షలు నిర్వహించారు. ఆలా్ట్రసౌండ్‌ రిపోర్టు ఆధారంగా అతడి కడుపులో పేగుకు రంధ్రం పడిందని గుర్తించారు. వెంటనే హేమంత్‌కు జనరల్‌ సర్జరీ 7వ యూనిట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రంగా అజ్మీరా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విక్రమ్‌ సారథ్యంలోని వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించి కడుపులోని వ్యర్థాలను తొలగించడంతో పాటు పేగుకు పడిన రంధ్రాన్ని సరిచేశారు. పది రోజులు పరిశీలనలో ఉంచి.. గతవారం డిశ్చార్జి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో లక్షలతో కూడుకున్న శస్త్రచికిత్సను పూర్తి ఉచితంగా, అదికూడా సెలవు రోజు నిర్వహించి ప్రాణాలను కాపాడిన వైద్య బృందంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉస్మానియా వైద్యులకు ధన్యవాదాలు చెబుతూ హేమంత్‌ కుటుంబసభ్యులు, స్నేహితులు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఫలితంగా అక్కడి వైద్యులపై నెటిజెన్లూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయని, నిరుపేద రోగులు వినియోగించుకోవాలని ప్రొఫెసర్‌ డాక్టర్‌ రంగా అజ్మీరా తెలిపారు.

Updated Date - Apr 17 , 2025 | 05:12 AM