Hyderabad: సెల్‌ఫోన్‌తో పైరసీ!
ABN, Publish Date - Jul 04 , 2025 | 04:32 AM
అతడు చదివింది ఐటీఐ.. పని చేస్తున్నది ఏసీ టెక్నీషియన్‌గా! కానీ అది పైకి ముసుగు మాత్రమే. అతడి ప్రధాన వ్యాపకం..
ఫోన్‌తో థియేటర్‌లో సినిమాల రికార్డింగ్
టెలిగ్రాం లింకుల ద్వారా విక్రయం
ఒక్కో చిత్రానికి రూ.30-40 వేలు
ఏడాదిన్నర వ్యవధిలో 60 సినిమాల
పైరసీకి పాల్పడిన నిందితుడి పట్టివేత
చదివింది ఐటీఐ.. ఏసీ టెక్నీషియన్‌గా
పనిచేస్తూ డబ్బుల కోసం అడ్డదారులు
ఒక్క 2024లోనే పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు రూ.3700 కోట్ల నష్టం
హైదరాబాద్ సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అతడు చదివింది ఐటీఐ.. పని చేస్తున్నది ఏసీ టెక్నీషియన్‌గా! కానీ అది పైకి ముసుగు మాత్రమే. అతడి ప్రధాన వ్యాపకం.. సినిమాల పైరసీ! ఏడాదిన్నరగా అలా కొత్త సినిమాలను సెల్‌ఫోన్‌తో వీడియో తీసి, ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ఆ నేరగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా జనా కిరణ్‌కుమార్ ఐటీఐ చదివి నగరానికి వచ్చి వనస్థలిపురం ఎన్జీవో కాలనీలో ఉంటూ ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతడు ట్విటర్‌లో.. ‘తమిళ్‌ఎంవీ’ అనే పైరసీ వెబ్‌సైట్‌కు చెందిన వీడియో ఒకటి చూశాడు. కొత్త సినిమాలను రికార్డ్ చేసి పంపితే డబ్బులు ఇస్తామని ఆ వీడియోలో చెప్పడంతో.. వెంటనే వారిని మెయిల్ ద్వారా సంప్రదించి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం మేరకు.. ఏడాదిన్నరగా తెలుగులో రిలీజైన ప్రతి కొత్త సినిమానూ రికార్డ్ చేసి వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక్కో సినిమాకూ అతడు రూ.30వేల నుంచి రూ.40 వేల దాకా తీసుకుంటున్నాడని సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపారు. కొత్త సినిమా విడుదలైన వెంటనే కిరణ్‌కుమార్ ఆన్‌లైన్‌లో మొదటి రోజు మొదటి ఆటకు టికెట్ తీసుకునేవాడు. జేబులో మొబైల్ పెట్టుకొని సినిమాకు వెళ్లి.. ఫోన్‌ను జేబులోనే ఉంచి సినిమాను పూర్తిగా రికార్డ్ చేసేవాడు. ఆ వీడియో ఫార్మాట్ మార్చి.. టెలిగ్రాం లింక్ ద్వారా తమిళ్‌ఎంవీ నిర్వాహకులకు పంపేవాడు.
వారు ఈ రికార్డింగ్‌లను హెచ్‌డీ క్వాలిటీలోకి మార్చి ఆన్‌లైన్‌లో ఉంచేవాడు. ఇలా అతడు ఏడాదిన్నర వ్యవధిలో 40-60 దాకా కొత్త సినిమాలను వేర్వేరు థియేటర్లలో చూసి ఎవరికీ అనుమానం రాకుండా రికార్డ్ చేసినట్టు సైబర్ క్రైం అధికారులు గుర్తించారు. ఈ పని చేస్తూ.. పోలీసులకు పట్టుబడకుండా ఉండడానికి కిరణ్‌కుమార్ పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు డీసీపీ కవిత తెలిపారు. సినిమాల రికార్డింగ్ కోసంప్రత్యేకంగా ఒక మొబైల్‌ను వాడేవాడని.. రికార్డ్ చేసే సమయంలో తప్ప మిగతా సమయంలో దాన్ని స్విచ్చాఫ్ చేసి ఉంచేవాడని చెప్పారు. తమిళ్‌ఎంవీ నుంచి తనకు రావాల్సిన సొమ్మును క్రిప్టో కరెన్సీలో తీసుకుని.. జెబ్ పే, కాయిన్ డీసీఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆ కరెన్సీని మన కరెన్సీలోకి మార్చేవాడు. ఆ డబ్బును మూడు బ్యాంకు ఖాతాల్లో జమ చేసి అవసరమైనప్పుడు తీసుకునేవాడు. చివరిగా ఈ ఏడాది మేలో రిలీజైన ఒక కొత్త సినిమాను రికార్డ్ చేసి విక్రయించాడని డీసీపీ తెలిపారు. ఈ ఏడాది మే 9న ‘సింగిల్’ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజైన రెండో రోజే ఆ సినిమా పైరేటెడ్ వెర్షన్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. దాంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి ఎర్రా మణీంద్రబాబు సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశారు. పైరసీ కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు ఒక్క 2024లోనే రూ.3700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం అధికారులు సాంకేతిక ఆధారాల సాయంతో కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 04 , 2025 | 04:32 AM