ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ACB investigation: ఈఎన్‌సీ అనిల్‌కు ‘నూనె’ సెగ!

ABN, Publish Date - Jun 15 , 2025 | 05:42 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టయిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ వ్యవహారం ఆ శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌కు చుట్టుకునేలా ఉంది.

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఈఈ నూనె శ్రీధర్‌

  • గతంలో ఆయన బదిలీని అడ్డుకున్న ఈఎన్‌సీ అనిల్‌ కుమార్‌

  • ఏసీబీ విచారణలో వెలుగులోకి

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టయిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) నూనె శ్రీధర్‌ వ్యవహారం ఆ శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌కు చుట్టుకునేలా ఉంది. గతంలో ఈఈ శ్రీధర్‌ బదిలీని ఈ ఎన్‌సీ అనిల్‌ కుమార్‌ అడ్డుకున్నారనే విషయం ఏసీబీ విచారణలో వెలుగులోకి రావడమే ఇందు కు కారణం. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవ్వగా.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు అనిల్‌ కుమార్‌ వివరణ ఇచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణను ప్రభావితం చేసేలా నూనె శ్రీధర్‌ వ్యవహరిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం 2024 జూన్‌ 27న ఆయన్ను బదిలీ చేసి ఈ ఎన్‌సీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయితే, నూనె శ్రీధర్‌ చొప్పదండిలోనే కొనసాగేలా ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌ ఆ ఉత్తర్వులను అడ్డుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులను పట్టించుకోకుండా బదిలీ ఆపడం ద్వారా అనిల్‌కుమార్‌.. శ్రీధర్‌కు మేలు చేశారని ఏసీబీ భావిస్తోంది. దీంతో అనిల్‌ కుమార్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జాను కలిసిన ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌.. ఈఈ శ్రీధర్‌ బదిలీని అడ్డుకోవడంలో తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని వారికి వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది. కాళేశ్వరం విచారణ నేపథ్యంలో కమిషన్‌/విజిలెన్స్‌ అడిగే కీలక పత్రాలు, వివరాలను అక్కడ పనిచేసిన వారైతే త్వరగా ఇవ్వగలరన్న ఉద్దేశంతోనే శ్రీధర్‌ బదిలీని అడ్డుకుని విధుల్లో కొనసాగించామని చెప్పినట్టు సమాచారం. అంతేకాక, కాళేశ్వరం విచారణ నేపథ్యంలో ప్రాజెక్టుతో ముడిపడిన పోస్టుల్లో చేరేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేకపోవడం వల్ల కూడా శ్రీధర్‌ను కొనసాగించినట్టు వివరించారు. ఇక ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు ప్రాజెక్టుకు నీటిని తరలించడానికి ఉద్దేశించిన నందిమేడారం, గాయత్రి పంపుల నిర్వహణ శ్రీధర్‌ చేతిలో ఉందని, పంపింగ్‌పై అవగాహన ఉన్నవారే ఆ పోస్టుల్లో ఉండాలనే ఉద్దేశం మాత్రమే ఉందని తెలిపారు. అంతేకాక, నూనె శ్రీధర్‌ బదిలీని నిలుపుదల చేయించిన రోజు నుంచి ఇప్పటిదాకా ఆ ప్రాంతంలో (శ్రీధర్‌ ఈఈగా ఉన్న ప్రాంతంలో) ఎలాంటి పనులు జరగలేదని వివరించినట్టు తెలిసింది. మరోపక్క, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నూనె శ్రీధర్‌ను ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రూ.100 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టిన శ్రీధర్‌కు చెందిన బ్యాంకు లాకర్లు తెరిపించేందుకు, బినామీల అంశంలో ఆయన్ను ప్రశ్నించేందుకు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 05:42 AM