One Day Scientist: వన్ డే సైంటిస్ట్ ప్రొగ్రామ్.. ఈ విద్యార్థులకు మంచి ఛాన్స్
ABN, Publish Date - May 06 , 2025 | 09:49 PM
ఇది వరకు వన్డే సీఎం, వన్డే డాక్టర్ వంటి కార్యక్రమాల గురించి విన్నాం. కానీ వన్ డే సైంటిస్ట్ గురించి విన్నారా లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఇది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించిన కార్యక్రమం.
సమ్మర్ హాలిడేస్ విద్యార్థులకు ఎంతో స్పెషల్ అని చెప్పవచ్చు. టూర్లు, షికార్లు, సినిమాలు, పార్కులు ఇలా ఎక్కడ చూసినా కూడా పిల్లలే కనిపిస్తారు. ఇలాంటి వేసవి సెలవుల సమయంలో విద్యార్థులు ప్రత్యేకంగా గడిపేందుకు ఒక అరుదైన అవకాశం వచ్చింది. అదే వన్ డే సైంటిస్ట్ ప్రొగ్రామ్(One Day Scientist Program). CSIR-CCMB ఈ అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. విద్యార్థులకు పరిశోధన, విజ్ఞానం గురించి తెలిపే ఒక వేదికగా నిలువనుంది. ఈ క్రమంలో విద్యార్థులు తమలోని శాస్త్రీయ ఆలోచనలను వెలికితీసుకోవచ్చు. దీంతోపాటు ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో మమేకం కావచ్చు. ఈ సమయంలో వినోదానికి బదులుగా, విజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుంది.
శాస్త్రవేత్తలతో మమేకం
అయితే మీరు కూడా ఈ విజ్ఞానయాత్రలో భాగం కావాలని చూస్తున్నారా, అందుకోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లోని ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా సంస్థ అయిన CSIR, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (CCMB) విద్యార్థులకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని CSIR ప్రయోగశాలలతో కలసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 2025 మే 13 నుంచి 16 తేదీల మధ్య జరుగనుంది. ఇది 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం రూపొందించబడింది.
కార్యక్రమం ప్రత్యేకతలు
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఒక రోజు పాటు శాస్త్రవేత్తలతో కలిసి పని చేసే అవకాశం లభిస్తుంది. సాధారణంగా పాఠశాలలో చదివే విద్యార్థులకు శాస్త్రీయ పరిశోధన అనేది ఒక ఆలోచనగా మాత్రమే ఉంటుంది. కానీ ఈ అవకాశంతో, వారు ప్రత్యక్షంగా ప్రయోగశాలలోకి వెళ్లి, శాస్త్రవేత్తలతో కలసి విభిన్న పరిశోధనలపై అవగాహన పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది వారికి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారాలనే ప్రేరణనిచ్చే అవకాశం అవుతుంది.
ఎంపిక విధానం & నమోదు ప్రక్రియ
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే విద్యార్థులు Jigyasa అనే ప్లాట్‌ఫారమ్ (https://jigyasa-csir.in) ద్వారా ఆన్‌లైన్‌లో మే 10వ తేదీలోపు నమోదు చేసుకోవాలి. అందులో భాగంగా వారు తమకు నచ్చిన CSIR ప్రయోగశాలను ఎంపిక చేసుకోవచ్చు. CCMB, NGRI, IICT హైదరాబాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రయోగశాలల్లో ఉన్నాయి. విద్యార్థులు తమకు దగ్గరలో ఉన్న ప్రయోగశాలలో లేదా తమకు ఆసక్తి ఉన్న అంశాలపై పరిశోధనలు చేస్తున్న ప్రయోగశాలలో పాల్గొనవచ్చు.
ప్రయోగశాలలో అనుభవం
ఈ కార్యక్రమం రోజున విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయోగశాలలో గడుపుతారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖీ సంభాషణలు, ప్రయోగాలు, ప్రయోగశాల పర్యటన, జీవ శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవకణ పరిశోధన వంటి అంశాలపై ప్రయోగ అనుభవం పొందుతారు. వీటి ద్వారా వారు శాస్త్రవేత్తల నిత్య జీవితాన్ని, వారి విధానాలను, పరిశోధనల వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.
విద్యార్థులకు ఎంతో ఉపయోగం
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించడమే కాకుండా, వారి భవిష్యత్తు లక్ష్యాలను మరింత స్పష్టంగా తీర్చిదిద్దుతుంది. సైన్స్‌ను పాఠ్యాంశాల ద్వారా మాత్రమే కాకుండా, అనుభవం ద్వారా నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం తెలియజేస్తుంది. ఈ వన్ డే సైంటిస్ట్ ఆలోచన ప్రధాని మోదీది కావడం విశేషం. ఫిబ్రవరి 23న మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Sridhar Babu: సీఎం రేవంత్‌ను సమర్థిస్తూనే బీఆర్ఎస్కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..
Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Read More Business News and Latest Telugu News
Updated Date - May 06 , 2025 | 09:52 PM