CM Revanth reddy: బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుండా అడ్డుకొంటున్న కేంద్రం
ABN, Publish Date - Jul 23 , 2025 | 05:41 PM
తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం అడ్డుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
న్యూఢిల్లీ, జులై 23: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదిస్తేనే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ కులగణన విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. బీసీ కులగణనతో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా 3.55 కోట్ల మంది వివరాలు సేకరించామని తెలిపారు.
గత వందేళ్లుగా వాయిదా పడిన కులగణనను నెల రోజుల్లోనే పూర్తి చేశామని వివరించారు. తెలంగాణ అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేసి పార్లమెంట్‌కు సైతం పంపామని ఆయన గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామన్నారు. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపామని తెలిపారు. కానీ ఈ బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తోందంటూ కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై కులగణన, రిజర్వేషన్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం రాహుల్ గాంధీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అలాగే మిగతా పక్షాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన చెప్పారు. కేంద్రం మెడలు వంచి అయినా సరే బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని ప్రకటించారు. అలాగే పార్లమెంట్ ఉభయ సభల్లోని కాంగ్రెస్ ఎంపీలను కలిసి వారికి సైతం ఈ రిజర్వేషన్ల గురించి వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అయితే బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలోని బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వాదన వింతగా ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్సే అమలు చేయాలని, కేంద్ర సహాయం కోరకూడదంటూ వింతగా మాట్లాడుతున్నారని చెప్పారు. అంటే కాంగ్రెస్, బీజేపీకి వేర్వేరు రాజ్యాంగాలు ఉంటాయా? అంటూ సందేహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు సాకులు వెతుకుతున్నారంటూ ఆ పార్టీ నేతల తీరును ఎండగట్టారు.
ముస్లిం రిజర్వేషన్లు తొలగించాక తెలంగాణ గురించి మాట్లాడాలంటూ బీజేపీ నేతలకు సూచించారు. ఇలాగే మాట్లాడితే తెలంగాణలో బీజేపీని ప్రజలు తుడిచి పెట్టేస్తారని జోస్యం చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు.. బీజేపీ సహా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు పెంచాలంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆ పదవి బండారు దత్తాత్రేయకు..
ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బండారు దత్తాత్రేయకు ఆ పదవి కేటాయించాలని కేంద్రానికి ఆయన సూచించారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తేనే బీసీలకు న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు.
అలాగే తెలుగు రాష్ట్రాలకు సరైన గౌరవం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను ఇండియా కూటమితో మాట్లాడతానని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తే.. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని కోరతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 23 , 2025 | 09:45 PM