Chamala Vs Kavitha: కవితకు ఎంపీ చామల కౌంటర్
ABN, Publish Date - Aug 03 , 2025 | 09:15 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆమెకు కాస్తా ఘాటుగా ఆయన కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్, ఆగస్ట్ 03: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవితకి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాస్తా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాజకీయంగా పబ్బం గడుపు కోవడానికే కవిత తపన పడుతోందని విమర్శించారు. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తోందంటూ కవితపై మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం 72 గంటలు ధర్నా చేయాల్సిన అవసరం ఏముందంటూ కవితను ఆయన సూటిగా ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై చేయాల్సిందంతా కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు. ఇంకేదైనా వేరే అంశంపై ధర్నా చేస్తే బాగుంటుందంటూ కవితకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. కుల, మత ప్రాతిపాదికన ఓబీసీ కేటగిరి ఉండదని స్పష్టం చేశారు. వెనకబడిన కులాల వారిని ఓబీసీ జాబితాలో పెడుతారని గుర్తు చేశారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలలో ముస్లింలు ఓబీసీ జాబితాలో ఉన్నారని వివరించారు. బీజేపీకి దమ్ముంటే ముందు వారి ప్రభుత్వాలు కొలువు తీరిన రాష్ట్రాల్లో ఓబీసీల నుంచి ముస్లింలను వేరు చేయాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లాలో పాదయాత్ర.. స్పందించిన పీసీసీ చీఫ్
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితలు దోచుకున్న పైసలను పంచుకునేందుకే ఈ లొల్లి చేస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇచ్చిందేమీ లేదన్నారు. ఆదివారం ఖానాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జన హిత పాదయాత్రలో పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి శనిలా దాపురించాడని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తేంటే.. దానిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటే కిషన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. బీసీలను ఎదిరించి బీజేపీ నాయకులు గెలుస్తారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. అసలు శ్రీరామునికి బీజేపీకి సంబంధం ఏమిటంటూ ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. దేవుని పేరు చెప్పి రాజకీయలేమిటంటూ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.
గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులు తెలుసుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర చేపట్టిందని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు పూర్తిగా అమలు చేస్తామని ప్రకటించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందంటూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నగరంలో ట్రాఫిక్ క్లియర్‌కు నయా స్కెచ్
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 03 , 2025 | 09:26 PM