Traffic Problem in Hyderabad: నగరంలో ట్రాఫిక్ క్లియర్‌కు నయా స్కెచ్
ABN , Publish Date - Aug 03 , 2025 | 08:53 PM
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
హైదరాబాద్, ఆగస్ట్ 03: హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ ప్రజలు భాగ్యనగరానికి తరలివస్తున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరం జనసంద్రంగా మారింది. అంతేకాకుండా నగరంలో వాహనాల రద్దీ సైతం భారీగా పెరిగింది. అటు హయత్ నగర్ నుంచి ఇటు ఇస్నాపూర్ వరకు, ఇటు ఆల్వాల్ నుంచి అటు శివరామపల్లి వరకు నిత్యం రహదారుల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. గంటల కొద్దీ వాహనాలు రహదారులపై నిలిచిపోతున్నాయి. ఇక వర్షం కురిస్తే చెప్పే సంగతే లేదు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త ప్రాజెక్ట్‌ను తెర మీదకు తీసుకు వచ్చిందంటూ ఒక చర్చ సాగుతోంది.

రోప్‌వేలతో సమస్యకు చెక్..
పర్యాటక శాఖతోపాటు యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (యూఎమ్‌టీఏ) సంయుక్తంగా ఒక ప్రతిపాదన రూపొందించాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహి టూంబ్స్ వరకు రోప్ వే నిర్మించనున్నారు. అనంతరం ట్యాంక్ బండ్, మీరాలం ట్యాంక్, సంజీవయ్య పార్క్, కొత్వాల్‌గూడ ఎకో పార్క్ వరకు ఈ సదుపాయాన్ని విస్తరించేందుకు ప్రణాళికులు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.
ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి..
అందుకోసం రోప్‌వేలో తీగలపై నడిచే బాక్స్ ఆకారపు వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బాక్స్‌లో 6 నుంచి 10 మంది వరకు ప్రయాణించవచ్చు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ నుంచి విముక్తి పొందడంతోపాటు పర్యాటకులు సైతం ఒకే సమయంలో చారిత్రక ప్రదేశాలను సులభంగా సందర్శించవచ్చు. ముఖ్యంగా గోల్కొండ, కుతుబ్‌షాహి టూంబ్స్ వంటి ప్రదేశాల మధ్య ప్రయాణం దాదాపుగా తగ్గుతుంది.
కొన్ని సవాళ్లు..
వీటి ఏర్పాటులో కొన్ని సవాళ్లు ఉన్నాయి.. అవేంటంటే ముఖ్యంగా గోల్కొండ కుతుబ్ షాహి టూంబ్స్ మధ్య రోప్ వే నిర్మాణం ఒక సవాల్ అని అంటున్నారు. ఈ మార్గంలో మిలిటరీ పరిధి ఉండటంతో అలైన్‌మెంట్ విషయంలో అధికారులు చర్చలు జరుపుతున్నారు. రక్షణ విభాగం అనుమతులు లభిస్తే.. నిర్మాణం సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని చెబుతున్నారు.
నెరవేరనున్న రెండు లక్ష్యాలు..
ఈ రోప్‌వే ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. రెండు లక్ష్యాలు నెరవేరనున్నాయి. పర్యాటకులకు సులభ ప్రయాణం అందించడంతోపాటు ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది. విదేశీ, దేశీయ పర్యాటకులను సైతం ఆకర్షించే అవకాశముంది. ఈ సదుపాయం నగర ప్రతీష్టను మరింత పెంచుతుంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే.. హైదరాబాద్ పర్యాటక రంగానికి సరికొత్త మలుపు అని చెప్పవచ్చు. అయితే గతంలో ఇదే తరహాలో వరంగల్‌లో రోప్ వే ప్రాజెక్ట్ ప్రతిపాదనలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News