HCA Secretary: హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్ అరెస్టు
ABN, Publish Date - Jul 26 , 2025 | 04:47 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) కార్యదర్శి దేవరాజ్ రామచందర్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, బ్లాక్‌మెయిలింగ్‌పై సీఐడీ కేసు నమోదు చేసినప్పటి నుంచి దేవరాజ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే..
పుణెలో అరెస్టు.. హైదరాబాద్‌కు తరలింపు
క్రికెట్ వేసవి శిబిరాల పేరుతో రూ.4 కోట్ల నిధులు స్వాహా?
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్ మాయ
ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌ల నిర్వహణకు ఏకసభ్య కమిటీ.. హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) కార్యదర్శి దేవరాజ్ రామచందర్ ఎట్టకేలకు అరెస్టయ్యారు. నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, బ్లాక్‌మెయిలింగ్‌పై సీఐడీ కేసు నమోదు చేసినప్పటి నుంచి దేవరాజ్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే..! ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన సమాచారంతోనే దేవరాజ్ తప్పించుకున్నాడనే ఆరోపణలు రావడంతో.. ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు పడింది. అయితే.. దేవరాజ్ హైదరాబాద్ నుంచి పారిపోయాక.. తన ఫోన్‌ను స్విచాఫ్ చేసుకున్నారు. 17 రోజుల్లో ఏడు రాష్ట్రాల్లో తిరిగి.. చివరకు మహారాష్ట్రలోని పుణె చేరుకున్నారు. కొత్త ఫోన్, కొత్త సిమ్‌కార్డులను వాడుతూ.. పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దేవరాజ్‌ను అరెస్టు చేసేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ.. తాజాగా అతను కొత్త సిమ్‌ను వాడుతున్నట్లు గుర్తించింది. అయితే.. అతని లొకేషన్‌ను తెలుసుకుని, అక్కడికి వెళ్లే సరికి.. దేవరాజ్ పారిపోతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపురం, బెంగళూరు, గోవా, పుణె, ఊటీ, యానాం ప్రాంతాల్లో తిరిగి.. మళ్లీ పుణె చేరుకున్నారు. ఎక్కడికి వెళ్లినా.. 24 గంటల్లోపే మకాం మార్చేవారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల్లో తిరుగుతూ.. ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో ప్రయాణించేవారు. ఈక్రమంలో సీఐడీ అధికారులు 36 గంటల పాటు దేవరాజ్‌ను ట్రాక్ చేశారు. అతను పుణెలోని ఓ త్రీస్టార్ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించి, శుక్రవారం అరెస్టు చేశారు. వెంటనే అతణ్ని హైదరాబాద్‌కు తరలించారు. ‘‘దేవరాజ్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచాం. అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు’’ అని సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా వెల్లడించారు.
రూ.4 కోట్ల గోల్‌మాల్
హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో జగన్ మోహన్‌రావు వీలు చిక్కినప్పుడల్లా నిధులను స్వాహా చేసినట్లు సీఐడీ గుర్తించింది. క్రికెట్ బంతులను కొనకున్నా.. వాటిని కొనుగోలు చేసినట్లు చూపించి రూ.3 లక్షలు కొట్టేసిన వ్యవహారం ఇప్పటికే వెలుగులోకి రాగా.. తాజాగా విద్యార్థుల కోసం వేసవి శిబిరాల పేరుతో రూ.4 కోట్ల బీసీసీఐ నిధులను గోల్‌మాల్ చేసిన వ్యవహారం బయటపడింది. హెచ్‌సీఏ గత ఏడాది వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా 28 సమ్మర్ క్యాంపులను నిర్వహించింది. ప్రతి క్యాంపులో సగటున వంద మందికి క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు లెక్కలు చూపింది. ఒక్కో సమ్మర్ క్యాంపునకు రూ.4 లక్షల ఖర్చయినట్లు పేర్కొంటూ.. విద్యార్థులకు ఒక్కోటి చొప్పున క్రికెట్ కిట్స్‌ను ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసింది. జగన్‌ను కస్టడీకి తీసుకున్న సీఐడీ.. క్షేత్రస్థాయిలో జరిపిన దర్యాప్తులో అసలు సమ్మర్‌క్యాంపులకు అంత మంది విద్యార్థులు హాజరుకాలేదని తేలింది. ఒక్కో శిబిరంలో సగటున రూ.లక్ష చొప్పున కూడా ఖర్చు కాలేదని ఆధారాలను సీఐడీ సేకరించింది. రూ.28 లక్షల లోపే నిధులను వినియోగించినట్లు పేర్కొంది.
ముగ్గురికి బెయిల్..
ఈ కేసులో అరెస్టయిన హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలకు మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమ కస్టడీలో జగన్ మోహన్‌రావు సహకరించలేదని, అతడి కస్టడీని పొడిగించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జగన్ మోహన్‌రావు, సీఈవో సునీల్ కాంతే బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా పడింది.
హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌ల నిర్వహణకు ఏకసభ్య కమిటీ మాజీ జడ్జి జస్టిస్ నవీన్‌రావు నియామకం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) 2025- 26 సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు హైకోర్టు ఏకసభ్య కమిటీని నియమించింది. హైకోర్టు కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావుకు ఈ బాధ్యతలను అప్పగించింది. గతంలో జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు తరహాలోనే జస్టిస్ నవీన్‌రావు హెచ్‌సీఏ విధులను పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. హెచ్‌సీఏ ఆర్థిక అవకతవకలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటివరకు కార్యకలాపాల పర్యవేక్షణకు ఓ కమిటీని నియమించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. జస్టిస్ నవీన్‌రావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 04:47 AM