ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Classroom Seating Arrangement: యూ సీటింగ్‌!

ABN, Publish Date - Jul 18 , 2025 | 03:35 AM

తరగతి గదిలో విద్యార్థులు ఒకరి వెనుక మరొకరు.. వరుసగా ఉన్న బెంచీల మీద కూర్చుంటారు. మొదటి, రెండు, మూడు వరుసల్లోని విద్యార్థులు తెలివైన పిల్లలని

  • తరగతి గదుల్లో కొత్త తరహాలో బెంచీల ఏర్పాటు

  • మలయాళం సినిమా స్ఫూర్తితో హైదరాబాద్‌లోని

  • ప్రభుత్వ, రెసిడెన్షియల్‌, ఆశ్రమ పాఠశాలల్లో..

  • అధికారులకు కలెక్టర్‌ హరిచందన ఆదేశాలు

  • ఇప్పటికే కేరళ, ఒడిసాల్లో పూర్తిస్థాయిలో అమలు

  • పంజాబ్‌, తమిళనాడులో కొన్నిచోట్ల..

  • బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్లు, అల్లరి పిల్లలు అన్న భావనకు దీంతో చెల్లు

  • విద్యార్థుల్లో పెరగనున్న ఆత్మవిశ్వాసం..

  • అభ్యసన సామర్థ్యాలూ మెరుగు

హైదరాబాద్‌ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తరగతి గదిలో విద్యార్థులు ఒకరి వెనుక మరొకరు.. వరుసగా ఉన్న బెంచీల మీద కూర్చుంటారు. మొదటి, రెండు, మూడు వరుసల్లోని విద్యార్థులు తెలివైన పిల్లలని.. బ్యాక్‌ బెంచీల్లోని వారు అల్లరి పిల్లలని, పాఠాలు సరిగా వినరనే అభిప్రాయాలు చాలామందిలో పాతుకుపోయాయి! ఉపాధ్యాయులు కూడా ముందు వరుసల్లోని పిల్లలను దృష్టిలో పెట్టుకొనే పాఠాలు చెబుతుంటారనే అభిప్రాయంతో వెనుక బెంచీల్లో కూర్చునే విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే చాలాచోట్ల తరగతి గదిలోని మొదటి, రెండు, మూడు వరసల్లో కూర్చునే విద్యార్థులే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని ఫస్ట్‌ క్లాసులో ఉత్తీర్ణులవుతున్నారు. వెనక బెంచీల్లోని పిల్లల్లో కొందరు అత్తెసరు మార్కులు తెచ్చుకుంటుంటే, ఇంకొందరు ఫెయిల్‌ అవుతున్నారు. అయితే.. ఈ ‘ఫస్ట్‌ బెంచ్‌-లాస్ట్ బెంచ్‌’ సమస్యకు ‘స్థానార్థి శ్రీకుట్టన్‌’ అనే ఓ మలయాళీ సినిమా చక్కని పరిష్కారం చూపింది.

ఆ సినిమాలో చూపించిన విధంగా తరగతి గదుల్లో ఆంగ్ల అక్షరమైన ‘యూ’ ఆకారంలో విద్యార్థులను కూర్చోబెడితే బాగుంటుందని.. ఉపాధ్యాయులు గదిలోని అందరు విద్యార్థులపై సమ దృష్టి పెడతారని.. ఆ మేరకు ప్రతి విద్యార్థి కేంద్రం (స్టూడెంట్‌ సెంట్రిక్‌)గా విద్యాబోధన జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ముందు బెంచీలు-వెనుక బెంచీలు అనే అసమానతలు ఉండవని అంటున్నారు. ‘స్థానార్థి శ్రీకుట్టన్‌’ సినిమాను ప్రేరణగా తీసుకొని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి.. జిల్లాలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్‌, ఆశ్రమ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ‘యూ’ ఆకారంలో విద్యార్థులకు సీటింగ్‌ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఒకటో తరగతి మొదలుకుని 10వ తరగతి దాకా అన్ని క్లాసుల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇటీవల సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ అక్కడ తరగతి గదిలోని బెంచీలను చూసి వెంటనే యూ ఆకారంలోకి మార్పించారు. పాఠశాలల్లో బ్యాక్‌బెంచ్‌ అన్నదే లేకుండా ‘యూ’ సీటింగ్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

‘యూ’ సీటింగ్‌ ఏర్పాటు అంటే..

గదిలో బ్లాక్‌ బోర్డు ఉన్న వైపు మినహా మిగతా మూడు వైపులా గోడలకు తగిలేలా బల్లలు వేస్తారు. ఆ బెంచీల మీద పిల్లలు కూర్చుంటారు. ఈ విధానం వల్ల బోర్డు దగ్గర నిల్చుని పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు విద్యార్థులందరిపైనా దృష్టిని కేంద్రీకరించగలుగుతాడు. పిల్లల్లోనూ పాఠ్యాంశంపై ఆసక్తి పెరిగి వారిలో అభ్యసన సామర్థ్యం పెరుగుతుంది. ఫలితంగా ముందు-వెనుక బెంచీల పిల్లల మధ్య అసమానతలు తొలగి.. తరగతి గదిలో అందరం సమానమేనన్న అభిప్రాయం విద్యార్థుల్లో ఏర్పడుతుంది. కొన్నినెలల క్రితం కేరళలోని బడుల్లో ‘యూ’ ఆకారం సీటింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. కేరళను స్ఫూర్తిగా తీసుకొని ఒడిసా ఆ దిశగా అడుగులు వేసింది. తొలుత బెర్హంపూర్‌లోని అప్పర్‌ ప్రైమరీ స్కూల్లో ప్రవేశపెట్టి.. తర్వాత మిగతా చోట్ల ప్రారంభించారు.

పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ‘స్టానార్థి శ్రీకుట్టన్‌’ 2024 నవంబరు 22న విడుదలైంది. తరగతి గదిలో విద్యార్థుల మధ్య వివక్షకు తావు ఉండొద్దనే సందేశాన్నిస్తుందీ సినిమా. కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, విద్యార్థుల తెలివితేటలు, ప్రవర్తనను ఆధారంగా చేసుకొని కొందరిని ముందు బెంచీల్లో.. ఇంకొందరిని వెనుక బెంచీల్లో కూర్చోబెట్ట కూడదని ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పారు. వెనుక బెంచీలో కూర్చునే విద్యార్థి చదువులో వెనుకబడితే ఆ విద్యార్థిదే తప్పు అన్నట్లుగా అందరూ చూస్తున్నారని.. ఈ ధోరణి ఏళ్లుగా వస్తోందన్న దర్శకుడి ఆవేదన చిత్రీకరణలో కనిపిస్తుంది. క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల మధ్య అసమానతలను తొలగించేందుకు ’యూ’ ఆకారపు సీటింగ్‌ను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఒక బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌.. తన తెలివితేటలు, చురుకుదనం ద్వారా ఎలా హీరోగా నిలిచాడనేది దర్శకుడు చూపిస్తారు.

అమలు సాధ్యమయ్యేనా?

యూ-టైప్‌ సీటింగ్‌ విధానం బాగానే ఉన్నా హైదరాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇది సాధ్యమయ్యే పనేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశాలంగా ఉండే తరగతి గదుల్లో బెంచీలను యూ ఆకారంలో ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులు ఉండవని.. చిన్నపాటి గదుల్లో మాత్రం సాధ్యం కాదని పలువురు టీచర్లు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో యూ-టైప్‌ సీటింగ్‌ విధానం దిశగా కొన్నిచోట్ల ఉపాధ్యాయులు ముందుకు సాగుతున్నారు. కొన్నిచోట్లనేమో తమకు స్థలం సరిపోదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది

పాఠశాలల్లో యూ ఆకారంలో సీటింగ్‌ ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నా యి. ఈ విధానం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లాసులో ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ కాదని, అందరం సమానం అన్న భావన పిల్లల్లో ఏర్పడుతుంది. ఉపాధ్యాయులకు ప్రతి విద్యార్థిపై దృష్టి ఉంటుంది. మా స్కూల్లో కూడా త్వరలో యూ-టైప్‌ సీటింగ్‌ను ఏర్పాటు చేస్తాం.

-ప్రభాకర్‌, ఎల్‌ఎ్‌ఫఎల్‌, హెచ్‌ఎం జీజీపీఎస్‌, డెయిరీ క్వార్టర్స్‌

ఇవి కూడా చదవండి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 09:48 AM