Bonalu Festival: బోనమెత్తిన భాగ్యనగరం
ABN, Publish Date - Jul 14 , 2025 | 05:10 AM
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఆదివారం బోనాల శోభతో కళకళలాడాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో లష్కర్ బోనాల జాతర ఆదివారం ప్రారంభమయ్యాయి.
మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్
హైదరాబాద్‌లో బోనాల శోభ.. భక్త జనసంద్రమైన లష్కర్
గోల్కొండ కోటలో ఘనంగా 6వ బోనం
హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఆదివారం బోనాల శోభతో కళకళలాడాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో లష్కర్ బోనాల జాతర ఆదివారం ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 11.32 గంటలకు మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రేవంత్‌ను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అంతకుముందు తెల్లవారుజామున 4 గంటలకు మంత్రి పొన్నంప్రభాకర్ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. బోనాల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు, శివసత్తులు, జోగినీలు.. బోనాలు, తొట్టెలు, ఒడి బియ్యం సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యులు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివా్‌సయాదవ్, దానం నాగేందర్, చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, ముఠా గోపాల్, శ్రీగణేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యార్, కలెక్టర్ దాసరి హరిచందన, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, ఉజ్జయినీ మహాకాళి ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
అలాగే.. గోల్కొండ కోటలోని జగదాంబిక మహాకాళి అమ్మవారి ఆరో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. వేల సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలను, తొట్టెలను సమర్పించారు. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో, శంభీపూర్‌లో, దుండిగల్‌లోని దుర్గాదేవి గుడిలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ముషీరాబాద్‌లోని మహాకాళి ఆలయంలో మొదటి బోనం సమర్పించారు. తాళ్లబస్తీలోని నల్లపోచమ్మ మహంకాళి దేవాలయాలతోపాటు పలు ఆలయాల్లో బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి.
సీఎం, మంత్రులు, నేతలకు పొన్నం విందు
హైదరాబాద్/బంజారాహిల్స్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్.. తన అధికార నివాసంలో విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు తన కుటుంబ సభ్యులను పొన్నం పరిచయం చేశారు.
Updated Date - Jul 14 , 2025 | 05:10 AM