High Court: పాలకు పాలు, నీళ్లకు నీళ్లు.. వేరుచేస్తాం
ABN, Publish Date - May 03 , 2025 | 04:27 AM
గ్రూప్-1 అంశం వేల మంది జీవితాలతో ముడిపడినదని.. అందువల్ల అందరి వాదనలు సమగ్రంగా విని నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరుచేస్తామని వ్యాఖ్యానించింది.
గ్రూప్-1 వేల మందికి సంబంధించిన అంశం ఏళ్లుగా వేచి ఉన్నారు.. తొందరపాటు వద్దు..
సమగ్రంగా విచారించి నిర్ణయం: హైకోర్టు
రీకౌంటింగ్‌లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయ్
ఆ అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాం: పిటిషనర్లు
ఇది నకిలీ మెమో.. మరో పిటిషన్‌లో ఇలా చేసి కొందరు దొరికిపోయారు: టీజీపీఎస్సీ
ఆ అభ్యర్థి జవాబు పత్రాలు సమర్పించాలన్న కోర్టు
నియామకపత్రాలు ఇవ్వొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు.. జూన్ 11కు వాయిదా
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 అంశం వేల మంది జీవితాలతో ముడిపడినదని.. అందువల్ల అందరి వాదనలు సమగ్రంగా విని నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరుచేస్తామని వ్యాఖ్యానించింది. ఆలస్యం అవుతోందంటూ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎంత బాధ ఉందో, ఎంపిక కాలేకపోయిన వారికీ అదే స్థాయి బాధ ఉంటుందని పేర్కొంది. ఇంత కీలక అంశంలో వేగంగా విచారణ చేపట్టి తీర్పు ఇవ్వాలనడం సరికాదని పేర్కొంది. విచారణను జూన్ 11 వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది.
గ్రూప్-1 అంశంలో వ్యవస్థీకృతంగా తప్పు జరిగింది
తొలుత పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ‘‘నోటిఫికేషన్‌లో పేర్కొనకుండానే మెయిన్స్ పరీక్షలకు కొత్తగా హాల్‌టికెట్లు జారీచేశారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న టీజీపీఎస్సీ.. మెయున్స్ పరీక్షలు ఎంతమంది రాశారనే కచ్చితమైన సంఖ్యను ఇప్పటికీ చెప్పడం లేదు. బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు అరగంటలో మొత్తం ఎంతమంది హాజరయ్యారో చెప్పేయొచ్చు. అలాంటిది మొదటిసారి చెప్పిన సంఖ్యకు, రెండోసారి చెప్పిన సంఖ్యకు వ్యత్యాసం ఎందుకుంది? ఎక్కువగా వచ్చినవారు ఎవరు? సీనియర్ ఫ్యాకల్టీతో మూడోసారి మూల్యాంకనం చేయించినట్టు చెబుతున్నారు. బార్‌కోడ్, ఆప్టికల్ మెషీన్ లేకుండా మూడో మూల్యాంకనం చేస్తే ఏం లాభం? అక్కడ అక్రమాలకు చాలా ఆస్కారం ఉంటుంది. కొన్ని సెంటర్ల నుంచి 10 నుంచి 12 శాతం మంది ఎంపికయ్యారు. అసలు పేపర్లు దిద్దేవారి మాధ్యమం ఏమిటి? తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషలకు సంబంధించి ఎంతమంది ఎవాల్యుయేటర్లు (మూల్యాంకనం చేసేవారు) ఉన్నారన్న వివరాలు లేవు. ఒక ప్రభుత్వ అధ్యాపకుడు ప్రైవేటు కోచింగ్ సెంటర్‌కు అనుబంధంగా ఉన్నారు. ఆయనతో పేపర్లు దిద్దించడం వల్ల పారదర్శకత ఎక్కడ ఉంటుంది? పేపర్లు దిద్దే అధ్యాపకుల పేర్లు బయటపెట్టడం మా ఉద్దేశం కాదు. మూల్యాంకనదారుల ఎంపికలో లోపాలు ఉన్నాయి. మొత్తం వ్యవస్థీకృతంగా తప్పు జరిగింది. తప్పు జరిగిందని చెప్తే.. దొంగ పత్రాలు, కేసులు పెడతాం అంటూ బెదిరిస్తున్నారు. టీజీపీఎస్సీ రాజ్యాంగ బద్ధ సంస్థ అని చెబుతున్నారు.. మరి గతంలో పేపర్ లీకేజీలు ఎందుకు జరిగాయి? పారదర్శకతను నిరూపించుకోవాల్సిన బాధ్యత టీజీపీఎస్సీపై ఉంది. ఓ అభ్యర్థికి రీకౌంటింగ్‌లో 60 మార్కులు తగ్గాయి. ఆ అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాం?’’ అని వివరించారు.
నకిలీ డాక్యుమెంట్లు.. కుట్రపూరిత దాడి..
టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదించారు. ‘‘పిటిషనర్లలో దాదాపు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు. వారు నిరుద్యోగులని చెప్పడానికి వీల్లేదు. రీకౌంటింగ్‌లో 60 మార్కులు తగ్గాయని చెబుతున్న పూజితారెడ్డి అనే అభ్యర్థి పిటిషనర్లలో లేరు. ఆమెకు సంబంధించినదిగా చెబుతూ నకిలీ మార్కుల డాక్యుమెంట్‌ను పిటిషనర్లు సమర్పించారు. ఇలాంటప్పుడు ఆర్టికల్ 226 కింద దఖలుపడిన విచక్షణాధికాన్ని హైకోర్టు ఉపయోగించ కూడదు. గ్రూప్-1పై ఇదే తరహాలో దాఖలైన మరో పిటిషన్‌లో నకిలీ డాక్యుమెంట్ పెట్టారంటూ మరో ఏకసభ్య ధర్మాసనం జరిమానా వేసి, విచారణకు ఆదేశించింది. ఆ పిటిషన్ కొట్టివేసింది. ఆ పిటిషన్‌లోని ఓ అభ్యర్థి తాను ఎవరికీ కేసు ఇవ్వలేదని, వకాలత్‌పై సంతకం కూడా చేయలేదని, తనపై విచారణ చేపట్టవద్దని రిజిస్ర్టార్‌కు లేఖ కూడా రాశారు. అదే తరహాలో ఇక్కడ కూడా నకిలీ డాక్యుమెంట్ పెట్టారు. దీనిపై నిజనిర్ధారణ జరిగే వరకు కేసు మెరిట్స్‌లోకి కూడా వెళ్లకూడదు..’’ అని పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షలపై కొందరు పనిగట్టుకొని చేస్తున్న కుట్రపూరితమైన దాడి ఇదని చెప్పారు. ధర్మాసనం అడిగిన అన్ని ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని.. వేసవి సెలవులకు ముందే ఈ వ్యవహారాన్ని తేల్చాలని డివిజన్ బెంచ్ పేర్కొన్నదని గుర్తు చేశారు.
సుదీర్ఘ విచారణ అనంతరం వాయిదా..
కోర్టు సమయం దాటిన తర్వాత కూడా దాదాపు రెండు గంటల పాటు జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు వాదనలు విన్నారు. ఇంకా వాదనలు వినిపించాల్సిన సీనియర్ న్యాయవాదులు ఉండటం, టీజీపీఎస్సీ సమాధానం ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. టీజీపీఎస్సీ దాఖలు చేసిన వెకేట్ స్టే పిటిషన్‌పై తీర్పు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మార్కులు తగ్గాయని పేర్కొంటున్న అభ్యర్థి పూజితారెడ్డి సమాఽధాన పత్రాలు, టీజీపీఎస్సీ లాగ్ హిస్టరీ, ఇతర వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించారు. నకిలీ పత్రాలు, మార్కుల మెమోలు సమర్పించినట్టు తేలితే పిటిషనర్లపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వివరణ ఇవ్వాలంటూ పూజితారెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేశారు. నియామకపత్రాలు ఇవ్వరాదన్న మధ్యంతర ఉత్తర్వులను అప్పటివరకు పొడిగించారు.
నాపై విచారణ ఉపసంహరించండి హైకోర్టు రిజిస్ట్రార్‌కు జరిమానా పడిన అభ్యర్థి షబ్నం ఆర్యా లేఖ
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి హైకోర్టుకు తప్పుడు మార్కుల మెమో సమర్పించిన వ్యవహారంలో తనపై విచారణను ఉపసంహరించాలని గ్రూప్-1 అభ్యర్థి, సంగారెడ్డి జిల్లా లింగంపల్లి పంచాయతీ సెక్రెటరీ షబ్నం ఆర్యా హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ‘‘నేను గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాశాను. పరీక్షలు పారదర్శకంగా జరగలేదంటూ కొందరు వాట్సాప్ గ్రూప్ సృష్టించి నన్ను జత చేశారు. ఆర్థికంగా మద్దతుకావాలని అడిగితే రూ.5 వేలు బదిలీ చేశాను. కానీ 18వ పిటిషనర్‌గా నా పేరుంది. నేను ఎవరికీ కేసు ఇవ్వలేదు. వకాలత్‌పై సంతకం పెట్టలేదు. విచారణ నుంచి నాపేరు తొలగించాలి’’ అని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News
Updated Date - May 03 , 2025 | 04:27 AM