High Court: ప్రైౖవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్
ABN, Publish Date - May 09 , 2025 | 03:03 AM
కోర్సుల విలీనం, సీట్ల పెంపు విషయంలో పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీట్ల పెంపునకు అనుమతులు నిరాకరిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూడు సార్లుకోర్టును ఆశ్రయించినా ఆయా కళాశాలలకు ఊరట లభించలేదు.
కొత్త కోర్సులు, సీట్ల పెంపుపై సర్కారుదే
తుది నిర్ణయమని తేల్చి చెప్పిన ధర్మాసనం
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): కోర్సుల విలీనం, సీట్ల పెంపు విషయంలో పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీట్ల పెంపునకు అనుమతులు నిరాకరిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూడు సార్లుకోర్టును ఆశ్రయించినా ఆయా కళాశాలలకు ఊరట లభించలేదు. కాలేజీలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. కొత్త కోర్సులు, సీట్ల పెంపు విషయంలో అంతిమ నిర్ణయం సర్కారుదేనని హైకోర్టు స్పష్టం చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్-సీఎ్‌సఈ, వివిధ విభాగాల్లో సీట్లు పెంచుకోవడానికి ఏఐసీటీఈ, జేఎన్‌టీయూ అనుమతినిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులివ్వడం లేదని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, సీఎంఆర్, ఎంఎల్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ సహా 14 ఇంజనీరింగ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. తామంతా గత ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నామని ఆరోపిస్తూ రాజకీయ కక్షతోనే అనుమతులివ్వడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నాయి. దీంతో పిటిషనర్ల కేసులను ఒక్కొక్కటి ప్రత్యేకంగా పరిశీలించి అనుమతుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించాయి.
అయితే సీట్ల పెంపునకు సదరు కాలేజీలకు వనరులు, మౌలిక సదుపాయాలు, అర్హతలు లేవని పేర్కొంటూ ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయించింది. దీంతో పిటిషనర్లయిన కాలేజీలు మూడో రౌండ్ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘సర్కారు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అన్ని అంశాలను పరిగణనలోకి అనుమతులను తిరస్కరించింది. గత ప్రభుత్వంతో అనుబంధం ఉన్నందుకే సీట్ల పెంపునకు అనుమతులివ్వడం లేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నప్పటికీ దానికి ఆధారాలు లేవు. ‘సంగం లక్ష్మీబాయి విద్యాపీఠ్’ కేసులో కాలేజీలు, కోర్సులు, సీట్లు విచ్చలవిడిగా పెరిగిపోకుండా నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయంలో జోక్యానికి నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టేస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పునిచ్చింది.
బతుకమ్మ కుంట భూములపై యథాతథ స్థితి
హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్‌లోని వివాదాస్పద బతుకమ్మ కుంటకు చెందిన ఏడు ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వ ఏజెన్సీలైన హైడ్రా, హెచ్‌ఎండీఏ.. భూమిని క్లెయిం చేస్తున్న ప్రైవేటు పార్టీలు యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సదరు ప్రాంతంలో కుంట పునరుద్ధరణ పనులు చేపట్టకుండా అడ్డుకోవాలని ఎడ్ల సుధాకర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్టేటస్ కో విధిస్తూ జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News
Updated Date - May 09 , 2025 | 03:03 AM