తెలుగులో రాసిన వారెందరు ఎంపికయ్యారు?
ABN, Publish Date - May 01 , 2025 | 04:12 AM
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో తీవ్ర లోపాలు ఉన్నాయని.. పరీక్షలు మళ్లీ నిర్వహించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ఽధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
గ్రూప్-1 పేపర్లు దిద్దిన వారిలో తెలుగుపై పట్టున్నవారెందరు?
మెయిన్స్ జవాబు పత్రాలు దిద్దిన వారికి ‘కీ’ ఇచ్చారా?
పూర్తి వివరాలివ్వండి.. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం
విచారణను నేటికి వాయిదా వేసిన ఏకసభ్య ధర్మాసనం
వ్యాసరూప పరీక్షలకు కీ ఇవ్వడం సాధ్యం కాదు: టీజీపీఎస్సీ
సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమన్న డివిజన్ బెంచ్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను తెలుగులో రాసిన వారు ఎంత మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు? సమాధాన పత్రాలు దిద్దిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వారు ఎందరున్నారు? జవాబు పత్రాలను దిద్దినవారికి నమూనా జవాబు పత్రం (కీ) ఇచ్చారా? అని టీజీపీఎస్సీని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందజేయాలని ఆదేశించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో తీవ్ర లోపాలు ఉన్నాయని.. పరీక్షలు మళ్లీ నిర్వహించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ఽధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. దాదాపు రెండున్నర గంటలపాటు వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు సురేందర్‌రావు, విద్యాసాగర్ వాదనలు వినిపించారు. ‘‘కోఠి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళా అభ్యర్థులనే కేటాయించాలన్న కాలేజీ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆ కేంద్రంలో మహిళలకే పరీక్ష రాసే అవకాశం కల్పించామని చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ ద్వారా అభ్యర్థుల కేటాయింపు జరిగినప్పుడు మహిళా అభ్యర్థులను వేరు చేయడం ఎలా సాధ్యమైంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు హాల్‌టికెట్లు మార్చారు. కొందరికి అనుకూలంగా సెంటర్లు వేయడం కోసమే చట్టవిరుద్ధంగా ఇలా చేశారు. ఏ పరీక్షలోనూ ఇలా హాల్‌టికెట్ నంబర్లలో మార్పు ఉండదు. ఎంపిక చేసిన మహిళా అభ్యర్థులను సెంటర్ నంబరు 18, 19లో వేశారు. ఇతర సెంటర్లలో మహిళా కాలేజీలు అయినప్పటికీ అక్కడ పురుషులు, మహిళలను కేటాయించారు. మొత్తం పోస్టులకుగాను 16, 17, 18, 19 సెంటర్ల నుంచే ఎక్కువ మంది అర్హత సాధించారు. కొన్ని సెంటర్ల నుంచి ఒకరిద్దరు కూడా అర్హత సాధించలేదు. పక్కపక్కన హాల్‌టికెట్ నంబర్లు ఉన్న వందల మందికి ఒకేలా మార్కులొచ్చాయి. ఆ నాలుగు సెంటర్లలోనే ఇలా ఎక్కువగా జరిగింది. అభ్యర్థులకు తగిన విధంగా పేపర్లు దిద్దే అధ్యాపకులు లేరు. అధికారిక వెబ్‌సైట్‌లో మొత్తం మార్కుల జాబితా మార్చి 10న అప్‌లోడ్ చేయగా.. పేపర్ల వారీగా మార్కులను వారం తర్వాత పెట్టారు. మరిన్ని వివరాలను మార్చి 30న అప్‌లోడ్ చేశారు. దీన్నిబట్టే అవకతవకలు జరిగాయని తెలుస్తోంది’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
కీ ఇవ్వడం సాధ్యం కాదు: టీజీపీఎస్సీ
తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల వారీగా పేపర్లు దిద్దేవారికి నమూనా జవాబు పత్రం(కీ) ఇచ్చారా? అని టీజీపీఎస్సీ న్యాయవాది రాజశేఖర్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. మెయిన్స్ పరీక్ష వ్యాస రూపంలో జరుగుతుందని, దానికి కీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. విషయ నిపుణులే పేపర్లు దిద్దుతారని.. వారికి జవాబుపై పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులు గతంలో కంటే ఎక్కువ మందే అర్హత సాధించారన్నారు. పిటిషన్లు వేసినవారు నిరుద్యోగులు కాదని, ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులని ఆరోపించారు. వారికున్న పరపతిని ఉపయోగించి మూల్యాంకనం చేసినవారి పేర్లు బయట పెడుతున్నారని.. దీంతో పేపర్లు దిద్దేవారు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఇలాగైతే పేపర్లు దిద్దే నిపుణులు దొరకరన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఏకసభ్య ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం..
గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక నియామకాలను అడ్డుకోవడం సరికాదని విజ్ఞప్తి చేసింది. ఈ అప్పీల్‌పై తాత్కాలిక సీజే జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఈ పిటిషన్లపై సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలంది. అయితే, వేసవి సెలవులకు ముందే విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి సూచించింది.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..
Updated Date - May 01 , 2025 | 04:12 AM