Harish Rao: రైతులపై దాడి, అరెస్టు దుర్మార్గం
ABN, Publish Date - Jun 06 , 2025 | 03:05 AM
జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడ గ్రామంలోని ఇథనాల్ పరిశ్రమ ఘటనలో 12 గ్రామాలకు చెందిన రైతులను కొట్టడమే కాక, 40 మందిపై కేసులు పెట్టి 12మందిని రిమాండ్‌కు పంపడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
రైతులను కొట్టించిన వారిపై కేసులేవి?
రైతులను కొట్టు.. కమీషన్లు పట్టు మాదిరిగా ప్రభుత్వ పాలన
పెద్దధన్వాడ ఇథనాల్ పరిశ్రమ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ ధ్వజం
12 మంది రైతుల విడుదలకు డిమాండ్
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడ గ్రామంలోని ఇథనాల్ పరిశ్రమ ఘటనలో 12 గ్రామాలకు చెందిన రైతులను కొట్టడమే కాక, 40 మందిపై కేసులు పెట్టి 12మందిని రిమాండ్‌కు పంపడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రైతులను కొట్టించిన పరిశ్రమ యజమాని, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పెద్దలకు భూములను కట్టబెట్టేందుకు.. రైతులను కొట్టు... కమీషన్లు పట్టు అనే విధంగా ప్రభుత్వ పాలన సాగుతోందని ఎక్స్ వేదికగా గురువారం ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజాపాలన పేదల కోసమా? పెద్దల కోసమా? పేద రైతుల కడుపుకొట్టి.. బడాబాబులకు కారుచవకగా భూములను కట్టబెడతావా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
ఏడాదిన్నర కాలంలో రైతులకు, ప్రజలకు పనికొచ్చేపని ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు. 2013 భూేసకరణ చట్టాన్ని తుంగలోకి తొక్కుతూ తనకు నచ్చిన బడా పారిశ్రామికవేత్తల కోసం బలవంతంగా భూములను సేకరించే బాధ్యతను సీఎం భుజాన వేసుకోవడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి దుశ్చర్యలతో రైతులపై తరచూ ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు లాఠీలు ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ వద్దని అన్నందుకు రైతులపైౖ బౌన్సర్లు, పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమన్నారు. పేదరైతులపై ప్రతాపం చూపించిన ప్రభుత్వం.. రైతులను కొట్టించిన ఇథనాల్ పరిశ్రమ యజమానిపై, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వేస్త ఫార్మాసిటీ భూములు తిరిగిస్తామన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రైతులపై కేసులు పెట్టడం తగదన్నారు. అరెస్ట్ చేసిన పెద్దధన్వాడ గ్రామ రైతులు 12మందిని వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేశాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. క్యాబినెట్ నిర్ణయాల్లో పీఆర్సీ, పెండింగ్ బకాయిలు, రిటైర్డు ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావనే లేదని అన్నారు.
హెచ్‌సీయూ అంశంలో సుప్రీం ఆదేశాలు అమలు చెయ్యండి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కచ్చితంగా అమలు చెయ్యాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కేవలం నినాదం కాదని.. అది బాధ్యత అని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 06 , 2025 | 03:05 AM