Konda Surekha: దేవాదాయ భూముల రక్షణకు టాస్క్‌ఫోర్స్!
ABN, Publish Date - May 04 , 2025 | 03:58 AM
వేల ఎకరాల దేవాదాయ భూములను పరిరక్షించి, ఆలయాల మనుగడకు ఆదాయ మార్గంగా మార్చుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి
త్వరలో మంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ
ఆ తర్వాత కీలక అధికారులను మార్చే అవకాశం
దేవాదాయ శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): వేల ఎకరాల దేవాదాయ భూములను పరిరక్షించి, ఆలయాల మనుగడకు ఆదాయ మార్గంగా మార్చుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కబ్జాకు గురైన ఆలయాల భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినప్పుడు రాజకీయ నేతలు, స్థానిక అధికారులు, ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తే అన్యక్రాంతమైన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో త్వరలో ఉన్నత స్థాయి భేటీ జరగనుంది. ఇందులోనే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, అర్చక, ఉద్యోగుల సమస్యలతోపాటు ఆలయాల్లో బంగారు, వెండి ఆభరణాల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు. కొందరు అధికారులు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోనే తిష్ట వేసిన వైనంపై సొంత శాఖలోనే విమర్శలున్నాయి.
ఈ విషయంపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన ఉన్నతాధికారులు.. మంత్రితో భేటీ తర్వాత మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశం ఉంది. కాగా, దేవాదాయ శాఖ డైరెక్టర్‌ను తరచూ మారుస్తుండడం ఆ శాఖ పనితీరుపై ప్రభావం చూపుతోందన్న వాదన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న అనీల్ కుమార్‌ను తప్పించి హన్మంతరావుకు బాధ్యతలు అప్పగించింది. కొద్ది నెలల్లోనే మరో డైరెక్టర్‌ను నియమించింది. తర్వాత శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల శ్రీధర్‌ను తప్పించి వెంకట్‌రావును నియమించింది. ఇలా ఏడాదిలోనే నలుగురు మారి.. ప్రస్తుతం ఐదో అధికారి కొనసాగుతుండడంతో ఎవరికీ శాఖపై పూర్తిస్థాయిలో పట్టురాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి భేటీ జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 03:58 AM